దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ ప్రతికూలతలు మదుపర్లను పెట్టుబడులకు దూరం చేస్తున్నాయి. ఓవైపు పశ్చిమాసియా సంక్షోభం, మరోవైపు వర్షాభావ పరిస్థితులు, ఇంకోవైపు ద్రవ్యోల్బణం భయాలు.. సూచీలను కోలుకోనివ్వడం లేదు. ఆగని విదేశీ పెట్టుబడుల ఉపసంహరణలూ దెబ్బతీస్తున్నాయి. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో పోల్చితే గత వారం సెన్సెక్స్ 1,986.04 పాయింట్లు పతనమై 71,909.70 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 718.55 పాయింట్లు క్షీణించి 22,421.95 దగ్గర నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ వారం కూడా ఒడిదుడుకులకు వీలున్నదనే చెప్పవచ్చు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష కీలకం కానున్నది. ఇప్పటికే ఫెడ్ రిజర్వ్ సహా ఆయా విదేశీ సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను పెంచిన దృష్ట్యా.. ఈసారి దేశీయంగానూ వడ్డీరేట్లు పెరుగవచ్చనే అంచనాలున్నాయి. అదే జరిగితే బ్యాంకింగ్, ఆటో, రియల్టీ, మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనుకావచ్చు.
అయితే వడ్డీరేట్లను ఆర్బీఐ యథాతథంగానే ఉంచితే మార్కెట్‌కు ఒకింత ఉత్సాహమే. అలాగే అమెరికా-ఇరాన్ యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో ముడి చమురు-సహజ వాయువు ఆధారిత షేర్లూ సెల్లింగ్ ప్రెషర్‌ను ఎదుర్కొనే వీలున్నది. గత వారం హెల్త్‌కేర్, ఇన్సూరెన్స్ రంగాల షేర్లు భారీ నష్టాలకు గురయ్యాయి. ఈ వారం కూడా ఆ ప్రభావం కనిపించవచ్చు. ట్రంప్ నిర్ణయాలు, ఏఐ విస్తరణతో ఐటీ షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడికి ఆస్కారం ఉన్నది. ఇక డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, విదేశీ మదుపర్ల పెట్టుబడులు, అంతర్జాతీయ మార్కెట్ల తీరుతెన్నులు, ఎల్ నినో సంబంధిత సమాచారం కూడా మార్కెట్ కదలికల్ని ప్రభావితం చేయగలవు. అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 22,000 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 21,800 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 22,700-22,900 పాయింట్ల స్థాయికి వెళ్లవచ్చనీ చెప్తున్నారు.
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదుడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న వివరాలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.