ఈ పుస్తకం నిత్యజీవితంలోని వస్తువులు, పరిసరాలు, దైనందిన అనుభవాల్లో దాగివున్న అందాన్ని లోతుగా చర్చిస్తుంది. కళలు, ప్రకృతితో పాటు మనం రోజూ ఎదుర్కొనే సాధారణ జీవితానుభవాలకూ సౌందర్యశాస్త్రంలో తగిన చోటు ఉండాలని థామస్ లెడ్డి వాదిస్తారు. ముఖ్యంగా నిత్యం మనం పలికే ‘neat’ (చక్కదనం), ‘messy’ (గజిబిజి), ‘pretty’ (ముచ్చటైన రూపం), ‘lovely’ (మనోహరత), ‘cute’ (ముద్దులొలికే తీరు), ‘pleasant’ (ఆహ్లాదం) వంటి మాటలను కూడా సౌందర్య భావనలుగా విశ్లేషించడం ఆయన ఆలోచనల ప్రత్యేకత.
అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని చూసి పొందే పరవశమా? ఏదైనా అసాధారణ కళారూపం మనపై చూపే బలమైన ప్రభావమా? లేక ఒక గొప్ప చిత్రాన్ని చూసినప్పుడు కలిగే అనుభూతినా? సౌందర్యశాస్త్ర చర్చల్లో చాలాకాలంపాటు ఈ ప్రశ్నలు కళల చుట్టూ, ప్రకృతి వైభవం చుట్టూ, అరుదైన అనుభవాల చుట్టూనే తిరిగాయి. కానీ మనిషి జీవితం ఎప్పుడూ ఇలాంటి గొప్ప క్షణాలతోనే గడవదు. నిత్యం ఎదురయ్యే సాధారణ వస్తువులు, అలవాటైన పనులు, పరిచయమైన పరిసరాలు, చిన్నచిన్న ఎంపికలతోనే మన బతుకు సాగుతుంది. మరి ఈ సాదాసీదా జీవితంలో సౌందర్యం ఉండదా? ఉంటే అది ఎక్కడ, ఏ రూపంలో కనిపిస్తుంది? థామస్ లెడ్డి రాసిన ‘The Extraordinary in the Ordinary: The Aesthetics of Everyday Life’ పుస్తకం లేవనెత్తే ముఖ్యమైన ప్రశ్న ఇదే.
ఈ నేపథ్యంలో ‘సూక్ష్మ సౌందర్యశాస్త్రం’ అనే మాటను సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇది థామస్ లెడ్డి తన సిద్ధాంతానికి పెట్టిన పేరు కాదు. ఆయన సూక్ష్మ సౌందర్యానుభవం (low-level aesthetic experience), అతిసూక్ష్మ సౌందర్యానుభవం (very low-level aesthetic experience), సూక్ష్మ సౌందర్య ప్రభావం (low-level aura) వంటి మాటలతో చిన్నచిన్న సౌందర్య సందర్భాలను వివరిస్తారు. అలాగే సౌందర్య పూర్వదశ (pre-aesthetic), సౌందర్యానుభవ ఆరంభ రూపం (proto-aesthetic) వంటి స్థితులనూ చర్చిస్తారు. అందువల్ల ‘సూక్ష్మ సౌందర్యశాస్త్రం’ అనేది నిత్యజీవిత సౌందర్యంపై ఆయన ఆలోచనలన్నింటినీ కలిపి అర్థం చేసుకోవడానికి వాడే ఒక సులువైన మాట మాత్రమే.
ఇక్కడ ‘సూక్ష్మ’ అంటే సౌందర్యం విలువ తక్కువని కాదు, అనుభవపు తీవ్రత తక్కువని, పరిధి చిన్నదని, సందర్భం చాలా సాధారణమైనదని అర్థం. రోజూ వేసుకునే బట్టలు ఎంచుకునేటప్పుడు వాటి రంగు, తీరు, పొందిక మనకు నచ్చవచ్చు. అక్కడ పెద్ద పారవశ్యం ఏమీ కలుగకపోవచ్చు, అయినా ఆ బట్టల తీరు మన కండ్లను ఆకట్టుకుంటుంది. వస్తువు ఉపయోగం కంటే దాని రూపురేఖలే మనకు నచ్చిన ఆ క్షణంలోనే ఒక చిన్న సౌందర్యానుభవం మొదలవుతుంది.
ఈ అనుభవానికి శ్రద్ధ అవసరం. మన చుట్టూ ఎన్నో వస్తువులు ఉంటాయి. రోజూ చూసే అలవాటు వల్ల, వాటి పనేంటో మనకు తెలుసునన్న ధీమాతో వాటి రూపాన్ని ప్రత్యేకంగా గమనించం. కానీ కాస్త మనసు పెట్టి చూస్తే పరిస్థితి మారిపోతుంది. వాటి రంగు, తీరు, అమరిక, పరిసరాల ప్రత్యేకత స్పష్టంగా కండ్ల ముందు నిలుస్తాయి. ఇక్కడ వస్తువులో ఏ మార్పూ ఉండదు, మారేది మన చూపు మాత్రమే. ఆ మారిన చూపులోనే సౌందర్యం దాగివున్నది.
ఇలాంటి నిత్యజీవిత తాత్విక చూపు దాసరి అమరేంద్ర యాత్రా రచనలైన ‘అండమాన్ డైరీ’ (2016), ‘గల్ఫ్ గీతం’ (2021)లలో స్పష్టంగా కనిపిస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని ఆస్వాదించే తీరిక కరువవుతున్నదని ‘అండమాన్ డైరీ’లో రచయిత బాధపడతారు. వెన్నెల కాంతిని చూసి ఆనందించే తీరికా ఉండదు. కండ్ల ముందు ఎన్నో అందమైన దృశ్యాలు కదలిపోతున్నా, ఆగి చూసే శ్రద్ధ, స్పందించే మనసు లోపిస్తున్నాయి. ఈ ఆవేదనలో ప్రకృతిపై ప్రేమే కాకుండా, ఆధునిక మనిషిలో సన్నగిల్లుతున్న పరిశీలనా దృష్టి గురించిన ఆలోచన కూడా కనిపిస్తుంది.
రచయిత ఆ శ్రద్ధను తన రచనలో నిలబెట్టుకుంటూ, పెద్ద దృశ్యాలకే కాకుండా చిన్న విషయాలకూ విలువనిస్తారు. రచనలో ఒక పోలీసు.. యువతి తనను స్థానిక ద్వీపవాసిగా పొరబడిన చిన్న సంగతిని ఆయన ఎంతో సరదాగా గుర్తుచేసుకుంటారు. ‘అంతకన్నా గొప్ప యోగ్యతా పత్రం చలం గారు కూడా ఇవ్వలేరు!’ అనే మాటతో ఆ చిన్న సన్నివేశానికి కొత్త అందం వస్తుంది. ఇక్కడ సౌందర్యం ప్రకృతిలో కాదు, అది మనుషుల మాటల్లో, ఆత్మీయ జ్ఞాపకాల్లో, సున్నిత హాస్యంలో మెరుస్తుంది.
బ్రిటిష్ వృద్ధురాలిని కలిసిన సందర్భంలో ఈ చూపు మరింత విచ్చుకుంటుంది. ఆమె రూపం, మాటలు, రచయిత జవాబు, ఆ తర్వాత సంధ్యావేళ ఆకాశంలో విరిసిన రంగుల సొగసు కలిసి ఒక అందమైన దృశ్యంగా మారతాయి. సూర్యాస్తమయం తర్వాత మిగిలిన రంగులను రచయిత ఒక పాత జ్ఞాపకంతో ముడివేస్తారు. దృశ్యం అక్కడితో ఆగక జ్ఞాపకమై, ఊహతో కలిసి, ఒక సాధారణ క్షణాన్ని గొప్ప అనుభూతిగా మలుస్తుంది.
ఓడ ప్రయాణాన్ని వర్ణించేటప్పుడు కూడా ఇలాంటి చిన్న సౌందర్యమే కనిపిస్తుంది. బయలుదేరాల్సిన సమయం దగ్గరపడినా ఓడ ఇంకా ‘నిద్రలేచే లక్షణాలే’ చూపలేదని రచయిత రాస్తారు. ఓడ కదలకుండా ఉండటం సాధారణ విషయమే అయినా, దాన్ని ఇంకా మేల్కొనని మనిషిలా ఊహించడంతో ఆ మాటలకు ప్రాణం వస్తుంది. మామూలు సమాచారం ఒక చక్కని రూపకంగా మారి పాఠకుడి మనసులో నిలుస్తుంది. నిత్య జీవిత వాస్తవం సాహిత్యంలో కొత్త సొగసును సంతరించుకుంటుంది. ఇదే దృష్టి ‘గల్ఫ్ గీతం’లో మరో తీరుగా దర్శనమిస్తుంది. పుస్తక పరిచయంలోనే ప్రయాణాన్ని కేవలం ఊళ్లు చూడటంగా కాకుండా, కొత్త అనుభవాలను పొందే సాధనంగా భావించాలనే ఆలోచన కనిపిస్తుంది. ‘ప్రతి ప్రయాణమూ ఒక పాఠం, ప్రతి మనిషీ ఒక నడిచే పుస్తకం, ప్రతి అనుభవమూ ఆ పుస్తకంలో ఒక అధ్యాయం’ అనే మాటలు యాత్రకు మంచి లోతును ఇస్తాయి.
ఈ పుస్తకంలో ఆయన నగరాల పైపై మెరుగులనే కాకుండా, దారిపొడవునా కనిపించే చిన్న చిన్న విషయాలను కూడా ఎంతో ఆసక్తితో చూస్తారు. ఎడారి ఒడిలోని నీటి చెలమలు, పచ్చదనం, చెట్ల నీడన సాగే నడక దారులు, అక్కడి ఆహ్లాదం, ఆ నిర్మాణాల చక్కదనం ఆయన రాతల్లో ప్రాణం పోసుకుంటాయి. ఇక్కడ ప్రయాణ వివరాల కంటే, ఆ దృశ్యం రచయిత మనసులో కలిగించిన స్పందనే మనకు నచ్చుతుంది. మనుషులను పరిచయం చేయడంలోనూ ఇదే శ్రద్ధ కనిపిస్తుంది.
ప్రయాణంలో కలిసిన వ్యక్తులను రచయిత చూసీచూడనట్లు వదిలేయరు. వారి మాటలను, స్వభావాలను, జీవన నేపథ్యాలను గుర్తుపెట్టుకుని రాస్తూ, ఆ పరిచయాలను విలువైన సాహిత్య జ్ఞాపకాలుగా మలుస్తారు. ఈ తాత్విక దృష్టి కేవలం పుస్తకాల విశ్లేషణకో, సాహిత్య చర్చలకో మాత్రమే పరిమితమైనది కాదు, ఆధునిక ఉరుకులు, పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరికీ అవసరమైన జీవన కళ.