ప్రఖ్యాత దిగ్దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మరణంతో సినీలోకంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆదివారం సాయంత్రం చెన్నైలో సింగీతం శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. దీంతో భారతీయ సినీచరిత్రలో ఓ మహోధ్యాయం ముగిసినట్లయిందని, ఆయన ఓ కళాసృజనాత్మక ప్రయోగశాల అని, ఆయన భౌతికంగా దూరమవ్వడం భారతీయ సినీరంగానికే తీరని లోటని పలువురు సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో గల తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు.
కొత్త ఆలోచనలతో, అద్భుతమైన ఊహాశక్తితో భారతీయ సినిమాకు చిరస్మరణీయమైన చిత్రాలను అందించిన గొప్ప దార్శనీకుడు సింగీతం శ్రీనివాసరావు. వెండితెరపై ఆయన చేసిన ప్రయోగాలను, వినూత్న ప్రయత్నాలనూ గౌరవంతో, ఆప్యాయతతో గుర్తుంచుకుంటాం. ఇటీవలే విడుదలైన ఆయన చివరి చిత్రం ‘సింగ్ గీతం’ అంతులేని ఆయన తపనకు అద్భుతమైన నిదర్శనం. కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఉత్సుకత, వెండితెరపై ఏదైనా అద్భుతాన్ని సృష్టించాలనే ఉత్సాహం ఆయనలో ఎప్పుడూ ఉండేది. ఆయన సినిమాలు రాబోయే తరంతోనూ మాట్లాడుతుంటాయి.
తాను కోరుకున్నట్టే యవ్వనంతోనే సింగీతం కన్నుమూశారు. చివరి శ్వాస విడిచే వరకూ ఆయన యువకుడే. ఆ యువతత్వం ఆయనకు మాత్రమే సొంతం. ఆ గుణాన్ని అలవరచుకునేందుకు ఆయన చేయి పట్టుకొని నడిచిన స్నేహితులు, శిష్యులలో నేనూ ఒకడ్ని. ఆయన్ను కలిసిన క్షణం నుంచీ ఆరాధిస్తూనేవున్నా. ఇప్పుడు ఆయనలా బతకాలని ఆశిస్తున్నా.
నాన్నగారు పూర్తిస్థాయిలో శ్రీకృష్ణుడిగా నటించిన తొలి సినిమా ‘మాయాబజార్. ఆ సినిమాతోనే సింగీతంగారి కెరీర్ మొదలైంది. విఖ్యాత దర్శకుడు కేవీరెడ్డిగారి వద్ద సహాయ దర్శకునిగా కెరీర్ మొదలుపెట్టిన ఆయన.. తర్వాత కాలంలో దేశం గర్వించదగ్గ దర్శకునిగా అవతరించారు. ఆయన దర్శకత్వంలో మూడు అద్భుతమైన చిత్రాలలో నటించిన అదృష్టం నాది. భారతీయ సినిమాకే కొత్త ముద్ర వేసిన సైన్స్ ఫిక్షన్ ‘ఆదిత్య 369’, తెలుగులో తొలి కంప్యూటర్ గ్రాఫిక్స్ చిత్రంగా చరిత్ర సృష్టించిన జానపద చిత్రం ‘భైరవద్వీపం’, అద్భుతమైన పౌరాణిక చిత్రం ‘శ్రీకృష్ణార్జున విజయం’.. ఈ మూడు సినిమాలు నా కెరీర్లోనే మైలురాళ్లుగా నిలిచాయి. మా కుటుంబంతో ఆయనకు సినీరంగానికి అతీతమైన ప్రత్యేక అనుబంధం ఉంది. తుదిశ్వాస విడిచే వరకు వివిధ భాషల్లో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు సింగీతం.
భారతీయ సినీపరిశ్రమలో విభిన్న కథల రూపశిల్పి సింగీతం శ్రీనివాసరావు. పుష్పకవిమానం, విచిత్రసోదరులు, మయూరి, ఆదిత్య 369 లాంటి ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకుల్ని తన్మయానికి గురిచేశారాయన. 94ఏళ్ల వయసులోనూ ‘సింగ్ గీతం’ చిత్రానికి దర్శకత్వం వహించడం సినిమాపై ఆయనకున్న ఆసక్తిని నిదర్శనం.
అసాధారణ ప్రతిభ కలిగిన సినీ దిగ్గజం సింగీతం. భారతీయ సినిమా ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది.
ఆదిత్య 369, పుష్పక విమానం, మయూరి.. ఇలా కాలానికి కంటే ముందే ఆలోచించి, ప్రతి తరానికీ కొత్తగా అనిపించే సినిమాలు అందించిన దార్శనీకుడు సింగీతం శ్రీనివాసరావు. ఆయన లేరన్న వార్త ఎంతో బాధాకరం
94ఏళ్ల వయసులోనే నిత్యయవ్వనంగా ఉండే మనసు ఆయనది. సింగీతంగారూ.. మీకున్న అంకితభావమే మీ గొప్ప వారసత్వం.
సింగీతంసార్.. మీ కథలు, మీ సినిమాలు, మీ నమ్మకాలు, మీ ఆలోచనలు ఎప్పటికీ మాతోనే ఉంటాయి. ‘పెళ్లి చూపులు’ సినిమా విడుదలైన నాటి నుంచీ మీరు నాపై చూపించిన ప్రత్యేకమైన ప్రేమ, ఆప్యాయతను నేను ఎప్పటికీ మరిచిపోను