హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కార్‌లో ప్రభుత్వ సంస్థలను పాతర పెట్టి.. ప్రైవేట్ సంస్థలను అందలం ఎక్కించడం పరిపాటిగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్‌ఫెడ్‌ను అడ్రస్ లేకుండా చేసేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కంకణం కట్టుకున్నదనే వ్యాఖ్యలు వినిపిసిస్తున్నాయి. నిన్నటికి నిన్న ఆయిల్‌ఫెడ్‌కు చెందిన కోట్ల విలువైన నాలుగు ఎకరాల స్థలాన్ని ప్రైవేట్ సంస్థకు అడ్డదారిలో కట్టబెట్టి.. చివరికి తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది. ఇప్పుడు ఆయిల్‌ఫెడ్‌కు కేటాయించిన ఆయిల్‌పామ్ ఏరియాను తగ్గించే పనిలో పడిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఆయిల్‌ఫెడ్ జిల్లాలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. తొలిదశలో నారాయణపేట్ జిల్లాను ఆయిల్‌ఫెడ్ నుంచి తొలగించింది. ఈ జిల్లాను ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు ఇప్పటికే తెరవెనుక రంగం సిద్ధమైనట్టు సమాచారం.
సిద్దిపేట జిల్లా నర్మెట్టలో బీఆర్ఎస్ హయాంలో నిర్మాణ పనులు మొదలైన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని ఈ ఏడాది మార్చి 22న సీఎం రేవంత్‌రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇప్పుడు ఇలాంటి ఫ్యాక్టరీనే తన నియోజకవర్గం కొడంగల్‌లోనూ కావాలని పట్టుబట్టారు. దీంతో అధికారులు అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన ఆయిల్‌పామ్ సాగు ఉన్నదా లేదా అనే అంశాలతో సంబంధం లేకుండా ఏర్పాట్లు చేశారు. వాస్తవానికి కొడంగల్ వికారాబాద్ జిల్లాలో ఉంది. ఈ జిల్లాను ఇప్పటికే ఎకోపామ్ ఆయిల్ అండ్ ఫ్యాట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించారు. ఈ జిల్లాలో సదరు కంపెనీ కేవలం 3వేల ఎకరాల్లోనే ఆయిల్‌పామ్‌ను సాగు చేయించగలిగింది. ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటే కనీసం 8వేల ఎకరాలు అవసరం. ఈ నేపథ్యంలో పక్కనే ఆయిల్‌ఫెడ్ ఆధీనంలో ఉన్న నారాయణపేట జిల్లాలోని నాలుగు మండలాలను వికారాబాద్‌లో కలుపాలని నిర్ణయించారు. కానీ ఏమైందో.. మొత్తం జిల్లానే ఆయిల్‌ఫెడ్‌కు కాకుండా చేసి.. ఎకోపామ్ కంపెనీకి కట్టబట్టేందుకు తెరవెనుక పావులు కదిపినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు ఇటీవల ఆయిల్‌ఫెడ్‌కు నారాయణపేట జిల్లాను రద్దు చేసి ప్రైవేట్ కంపెనీకి కేటాయించేందుకు నోటిఫికేషన్ కూడా జారీచేశారు. దీంతో ఆయిల్‌ఫెడ్ ఆరేండ్ల కష్టాన్ని ఎకోపామ్ కంపెనీకి అప్పనంగా అప్పగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి తన నియోజకవర్గంలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోరిక ఆయిల్‌ఫెడ్‌కు శిక్షగా మారిందని ఆయిల్‌ఫెడ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నారాయణపేట జిల్లాను వెనక్కి తీసుకోవడంతో మొదలైన ఆయిల్‌ఫెడ్ పతనం మిగిలిన జిల్లాలకు కూడా పాకడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఆయిల్‌ఫెడ్‌కు గద్వాల, నారాయణపేట జిల్లాలున్నాయి. నారాయణపేట జిల్లాను తొలగించడంతో మిగిలిన ఒక్క గద్వాల జిల్లాలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే పరిస్థితి ఉండదు. ఆ జిల్లా రైతుల నుంచి సేకరించే ఆయిల్‌పామ్ గెలలను సిద్దిపేటకు తరలించడం ఇబ్బందికరమే. కొద్ది రోజుల తర్వాత ఈ సాకును చూపుతూ గద్వాల జిల్లాను కూడా ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టే అవకాశముంటుందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఓ మంత్రి, ఖమ్మం జిల్లాలోని మరో మంత్రి మధ్య జరిగిన రాజకీయ క్విడ్‌ప్రోకోలో భాగంగా మరికొన్ని జిల్లాలు కూడా ఆయిల్‌ఫెడ్ నుంచి తీసేసి ప్రైవేట్‌కు అప్పగించే కుట్రలు జరుగుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఇందులో భాగంగానే భువనగిరి, మహబూబాబాద్, సూర్యాపేట, జనగామ, ఖమ్మంలో కొంతభాగం ఆయిల్‌ఫెడ్ నుంచి తొలగించి ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ఆయిల్‌పామ్ సాగులో దేశంలోనే తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. 12 జిల్లాల్లో విజయవంతంగా ఆయిల్‌పామ్ సాగును చేపడుతున్నది. అనతికాలంలోనే 1.9 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయించింది. ఎక్కడికక్కడ ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలు నిర్మిస్తూ రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు యువతకు ఉపాధి కల్పిస్తున్నది. ఇలాంటి కంపెనీని పక్కన పెట్టి ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అది కూడా సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో ప్రభుత్వరంగ సంస్థను నిర్వీర్యం చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ సంస్థకు జవాబుదారీతనం ఉంటుంది, రైతులు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కానీ ప్రైవేట్ కంపెనీకి ఏం జవాబుదారీతనం ఉంటుందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో అనేక ప్రైవేట్ ఆయిల్‌పామ్ కంపెనీలు చేతులెత్తేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం ఇలాకాలో కోరికోరి ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టడం వెనుక మతలబు ఏందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.