పాపన్నపేట, ఆగస్టు 2: మండల కేంద్రం పాపన్నపేటలో బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం నల్ల పోచమ్మ, ముత్యాల పోచమ్మలకు మున్నూరు కాపు సంఘం సభ్యులు బోనాల ఊరేగింపు నిర్వహించారు. ఉదయం అమ్మవార్లకు ఒడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బోనాల వేడుకల్లో భాగంగా సాయంత్రం సమయంలో మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. వేప కొమ్మలు, కుంకుమ, పసుపు, పూలు, నైవేద్యంతో అందంగా అలంకరించిన బోనం కుండలను మహిళలు నెత్తిన పెట్టుకొని.. గ్రామవీధుల గుండా ఊరేగింపుగా వెళ్లి అమ్మవార్లకు సమర్పించారు. పోతురాజులు, డీజే చప్పుల్ల మధ్య యువకులు నృత్యం చేస్తూ సందడి చేశారు.
బోనాల ఊరేగింపు కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం పెద్దలు, సభ్యులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బోనాల వేళ ప్రతి ఇంటా బంధుమిత్రులతో సందడి వాతావరణం నెలకొంది.