న్యూఢిల్లీ: కదులుతున్న రైలులోని ఒక కోచ్‌లో పూజా కార్యక్రమం నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘హనీమూన్ కోచ్’ సంఘటన తర్వాత ఇది జరుగడంతో రైల్వేపై విమర్శలు వెల్లువెత్తాయి. (Religious Ceremony In Moving Train) కదులుతున్న రైలు కోచ్ నేలపై కొందరు పూజారులు కూర్చొని పూజలు నిర్వహిస్తూ కనిపించారు. తెల్లని దుస్తులు ధరించిన వ్యక్తులతో పాటు మరి కొందరు ఈ పూజలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘హనీమూన్ కోచ్’ తర్వాత ‘సెలూన్ కోచ్’లో పూజా కార్యక్రమాలు, భారతీయ రైల్వే ఒక సర్కస్‌లా మారుతోంది’ అని కొందరు విమర్శించారు.
కాగా, ‘సెలూన్ కోచ్’ అనేది ఉన్నతాధికారులు, వీఐపీలు, ప్రముఖుల కోసం ఉద్దేశించిన వ్యక్తిగత, విలాసవంతమైన రైల్వే బోగీ. ఏసీతో కూడిన బెడ్ రూమ్స్, చిన్న వంటగది, లివింగ్, డైనింగ్ రూమ్స్, అటాచ్ బాత్రూమ్స్, టీవీ వంటి పలు సౌకర్యాలు ఉంటాయి. అయితే ఈ ‘సెలూన్ కోచ్’లో ఇలాంటి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతి ఉన్నదా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు వైరల్ అయిన ఈ వీడియో క్లిప్‌పై రైల్వే శాఖ స్పందించింది. ఈ మతపరమైన కార్యక్రమం సాధారణ ప్యాసింజర్ కోచ్‌లో కాకుండా ప్రైవేట్‌గా బుక్ చేసుకున్న ‘సెలూన్ కోచ్’లో జరిగినట్లు నార్తర్న్ రైల్వే పేర్కొంది. ‘జూలై 8న ఐఆర్సీటీసీ ద్వారా ఈ సెలూన్ కార్ బుక్ చేసుకున్నారు. కమర్షియల్ బుకింగ్‌లో భాగంగా సంబంధిత వర్గం రూ.3,08,580 ముందస్తుగా చెల్లించారు. జూలై 10న న్యూఢిల్లీ నుంచి ముంబై వరకు ప్రయాణం కోసం ఈ సెలూన్ కార్‌ను ‘12926 పశ్చిమ్ ఎక్స్‌ప్రెస్’ రైలుకు జత చేశారు’ అని వివరించింది. ప్రయాణికుల భద్రత తమకు ముఖ్యమని పేర్కొంది.
అయితే ఆ ‘సెలూన్ కోచ్’లో ఇలాంటి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతించే నిబంధనలు ఉన్నాయా? అన్నది రైల్వే శాఖ స్పష్టం చేయలేదు.
After honeymoon coach, now worship rituals in saloon coach of Indian Railways. Unidentified location. pic.twitter.com/MqDYiPcNDe
— Rajendra B. Aklekar (@rajtoday) July 12, 2026
👉🏻 The Saloon Car was booked by IRCTC on 08.07.26.The party made an advance payment of Rs 3,08,580
as commercial booking. The Saloon Car was to be attached in Train No. 12926 Paschim Express on one way journey from New Delhi (NDLS) to Mumbai (BDTS) on 10.07.2026.👉🏻NR issued…
— Northern Railway (@RailwayNorthern) July 12, 2026