Tech News | చిన్నప్పుడు చదువుకున్న చీమ కథ గుర్తుందిగా… తన పుట్టలో వేలు పెడితే కుట్టనా అంటూ చీమ చెప్పిన సమాధానం విని పకపకా నవ్వుకున్నాం. కానీ, అనవసరమైన విషయాల జోలికి పోతే.. నలుగురూ జాలి చూపించే పరిస్థితి కలుగుతుందని చీమ కథ చెబుతుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న జీవుల పరిస్థితీ ఇలాగే తయారైంది. చీమ చిటుక్కుమన్నా ఎఫ్బీలో అప్లోడ్ చేస్తూ.. సమయాన్ని వృథా చేస్తున్నారు. మరోవైపు అత్యుత్సాహంతో లేనిపోని విషయాల్లో దూరి తలబొప్పి కట్టించుకుంటున్నారు.
ఫేస్బుక్ వచ్చిన కొత్తల్లో.. భావుకుల కులం పరవశించింది. ఉదయాన్నే హృదయరాగాలు వాల్స్‌పై ప్రకటించేవాళ్లు. మధ్యాహ్నం వేళకు మజ్జిగన్నంలోకి నిమ్మకాయ బద్ద నంజుకున్నంత కమ్మనైన కవితో, సందర్భాన్నో షేర్ చేసేవాళ్లు. జామురాతిరి సమయానికి జాబిలమ్మ జోలపాడినట్టుండే సందేశంతో రోజును ముగించేవాళ్లు. ప్రతి చేతికీ స్మార్ట్ ఫోన్, అందులోకి 5జీ డాటా వచ్చి చేరాక.. సామాజిక మాధ్యమాల్లోకి ప్రవేశించేవారికి పట్టపగ్గాలు లేకుండా పోయింది. తాను మునిగిందే గంగ అన్న చందంగా పోస్టులు, రీల్స్‌తో విరుచుకుపడుతున్నారు కొందరు. కామెంట్లు, లైక్‌లు, షేర్ల కోసం నాసిరకం పోస్టులు చేస్తూ సమాజానికి కీడు తలపోస్తున్నారు.
మనలోని భావోద్వేగాలు, నాలుగు మంచి మాటలు పంచుకోవడానికి సోషల్ మీడియా వేదిక. అయితే, రాను రాను వింత వైఖరులు చోటుచేసుకుంటున్నాయి. ప్రతి చిన్నాపెద్దా విషయాన్ని అయినవారి కన్నా ముందుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మనసు భారంగా రఫీ ఎమోషనల్ సాంగ్‌ను వాట్సాప్ స్టేటస్‌గా పెడుతున్నారు. ఎఫ్బీ దగ్గరికి వచ్చేసరికి సమాజం తనను పట్టించుకోవడం లేదన్నట్టుగా దీర్ఘ కవితలు రాస్తున్నారు. వ్యక్తిగత విషయాల దగ్గర ఆగిపోవడం లేదు వీళ్లు! రాజకీయాలపై తమ ఆసక్తినంతా రంగరించి సోషల్ మీడియాలో సెన్సార్ చేయకుండా పోస్టు చేస్తున్నారు. పాజిటివ్ ఉద్దేశాలే కానీ, నెగెటివ్ దురుద్దేశాలే కానీ.. సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడమే తమ విద్యుక్తధర్మంగా భావిస్తున్నారు. వ్యక్తిగత ఆసక్తులను పదిమందితో పంచుకోవడం తప్పు కాదేమో! కానీ, మాట పబ్లిక్‌లోకి వెళ్లిన తర్వాత దాని పర్యవసానాలకు బాధ్యులం మనమే అవుతామన్న స్పృహ కలిగి ఉండటం చాలా అవసరం.
ఒక వస్తువును ఎలా ఉపయోగించుకోవాలో తెలిసి ఉండటం చాలా అవసరం. సామాజిక మాధ్యమాల్లో విహరించేటప్పుడు కూడా ఏ ప్లాట్‌ఫామ్ దేని కోసం ఉద్దేశించినదో తెలిసి ఉండటం ఆవశ్యకం. ఉదాహరణకు ఫేస్బుక్ వ్యక్తిగత భావోద్వేగాలను పంచుకోవడానికి అనువైన వేదిక. అదే సమయంలో ‘ఎక్స్’లో.. పబ్లిక్ ఎక్స్ప్రెషన్స్కు ప్రాధాన్యం ఎక్కువగా కనిపిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో విహరించాలని భావిస్తే.. కొన్ని విషయాలపై పూర్తి అవగాహన కలిగి ఉండటం అవసరం. అవేంటంటే…
ప్రస్తుతం ఎఫ్బీలో ఫ్రెండ్స్, ఇన్‌స్టాలో ఫాలోవర్ల సంఖ్యను బట్టి ఒక వ్యక్తిని అంచనా వేస్తున్నారు. ఎంత మంచి పోస్ట్ పెట్టాడన్నది కాకుండా.. ఎన్ని లైకులు వచ్చాయన్న దాన్నిబట్టి సదరు వ్యక్తికి విలువ ఇస్తున్నారు. ఈ క్రమంలో నలుగురూ తనను గుర్తించాలనే కుతూహలంతో చాలామంది విలువలకు తిలోదకాలిస్తున్నారు. ఫాలోవర్లను పెంచుకోవడానికీ, ఇన్ఫ్లూయెన్సర్లుగా ముద్ర వేయించుకోవడానికి నానా యాగీ చేస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునే సందేశాలు కూడా సగర్వంగా పోస్టు చేస్తూ కాలరెగిస్తున్నారు. సున్నిత మనస్కులు చేసే పోస్టును ఆధారంగా చేసుకొని.. వారి జీవితాల్లోకి తొంగి చూస్తున్న ప్రబుద్ధులూ ఉన్నారు. వాళ్లు చేసిన పోస్టు ఆధారంగా వ్యక్తిగత సమస్యలను అంచనావేసి తెలివిగా లొంగదీసుకునే ప్రయత్నమూ చేస్తున్నారు. ఇలా మోసపోయిన బాధితులు ఎందరో ఉన్నారు. సో.. సోషల్ మీడియాలో జర్నీ సేఫ్‌గా ఉండాలంటే.. నొప్పింపక తానొవ్వక అన్నట్టుగా ఉండటమే మేలు.
– అనిల్ రాచమల్ల వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్