న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 : వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ భారత్‌పై అమెరికా సుంకాల మోత మోగిస్తున్నది. భారత సోలార్ ఉత్పత్తులపై ప్రాథమికంగా 125.87 శాతం సుంకాలు విధిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ ఉత్పత్తులపై భారత ప్రభుత్వం అసంబద్ధంగా సబ్సిడీలు అందిస్తున్నదని ఆరోపించింది. ఇండోనేషియా, లావోస్ నుంచి దిగుమతి అవుతున్న సోలార్ గూడ్స్పైనా సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించింది. ఇండో నేషియాపై 104 శాతం, లావోస్‌పై 80 శాతం డ్యూటీ విధిస్తున్నట్టు తెలిపింది. ఈ నెల 24న అన్ని దేశాలపై ట్రంప్ సర్కార్ ప్రకటించిన 10 శాతం సుంకాలకు తాజాగా ప్రకటించిన టారిఫ్‌లు అదనం. సబ్సిడీ దిగుమతుల నుంచి తమకు ఉపశమనం కల్పించాలని అమెరికా సోలార్ అలయన్స్ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ట్రంప్ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నది. ట్రంప్ విధించిన సుంకాలను అమెరికా సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ ట్రేడ్ అలయన్స్ కొనియాడింది.‘దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు అమెరికా తయారీదారులు బిలియన్ డాలర్లు వెచ్చిస్తున్నారు. అనేక ఉద్యోగాలు సృష్టిస్తున్నారు. అసంబద్ధ దిగుమతులను అనుమతిస్తే ఈ పెట్టుబడులు ఫలితాలనివ్వవు’ అని పేర్కొన్నది.
ఈ మూడు దేశాల వాటానే మూడింట రెండొంతులు
అమెరికా వాణిజ్య శాఖ డాటా ప్రకారం.. అమెరికాకు దిగుమతి అవుతున్న సోలార్ ఉత్పత్తుల్లో భారత్, ఇండోనేషియా, లావోస్ వాటానే అత్యధికం. గత ఏడాది ఈ మూడు దేశాల నుంచి అగ్రరాజ్యానికి దిగుమతి అయిన సోలార్ ప్యానెల్స్, సెల్ వంటి సోలార్ దిగుమతుల విలువ 4.5 బిలియన్ డాలర్లని ట్రేడ్ డాటా వెల్లడిస్తున్నది. 2025లో మొత్తం సోలార్ దిగుమతుల్లో ఇది మూడింట రెండొంతులు. భారత్ నుంచి దిగుమతులు 2022లో 83.86 మిలియన్ డాలర్లుగా ఉండగా, 2024 నాటికి అది 792.6 మిలియన్ డాలర్లకు పెరిగినట్టు అమెరికా ప్రభుత్వం తెలిపింది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని భారత్ ప్రోత్సహిస్తున్నది. సోలార్ ఎనర్జీ ఇందులో కీలకం. సౌర విద్యుత్తు ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్నది. రూఫ్‌టాప్ సోలార్ ప్రోగ్రామ్, పీఎం-కుసుమ్, సీపీఎస్‌యూ ఫేజ్-2 కింద చేపట్టే ప్రాజెక్టుల్లో దేశంలో తయారైన సోలార్ సెల్స్, ప్యానెల్‌నే వాడాలని కేంద్రం ఆదేశించింది. సోలార్ సెల్స్, మాడ్యూల్స్‌పై 2022 ఏప్రిల్‌లో కస్టమ్స్ డ్యూటీని విధించింది.
అమెరికా సోలార్ సుంకాలపై మోదీ సర్కారు మీద విపక్షాలు విరుచుకుపడ్డాయి. ట్రంప్ నిర్ణయం అసాధారణమైనదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందం విశ్వసనీయతపై ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. ట్రేడ్ డీల్ ద్వారా భారత్ ఉత్పత్తులకు అమెరికా ద్వారాలు తెరుచుకుంటాయని మోదీ సర్కారు గొప్పగా ప్రకటించుకుందని, ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. వాస్తవానికి ఈ వాణిజ్య ఒప్పందం ఏకపక్షంగా ఉందని, అమెరికా ఎగుమతులకు భారత్ తలుపులు బార్లా తెరువగా, భారత ఎగుమతులు మాత్రం ట్రంప్ నిర్ణయాలపై ఆధారపడి ఉన్నాయని ఆరోపించారు. ఈ ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేయాలని, లేదంటే కోట్లాది మంది భారత రైతులకు ఇది శరాఘాతంగా మారుతుందని హెచ్చరించారు.