ఆళ్లపల్లి, ఆగస్టు 01 : రాయిపాడు మార్గంలోని కిన్నెరసాని వంతెన వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో టేకులపల్లి మండలం కోయగూడెంకు చెందిన ఎ.కార్తీక్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో స్పృహ కోల్పోయిన అతడిని 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించి ఆళ్లపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఈ ఘటనతో కిన్నెరసాని వంతెన వద్ద రహదారి భద్రత మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ మార్గంలో గతంలోనూ ప్రమాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో రవాణా శాఖ, పోలీసు శాఖ ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
వేగ నియంత్రణ బోర్డులు, రిఫ్లెక్టర్లు, రోడ్డు మార్కింగ్లు, హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు. ప్రాణనష్టం జరిగేలోపు సంబంధిత శాఖలు సంయుక్తంగా స్పందించి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మార్గంలో వాహనదారులు కూడా వేగ నియంత్రణ పాటిస్తూ అప్రమత్తంగా ప్రయాణించాలని అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ప్రజలు సూచిస్తున్నారు.