కరీంనగర్ కార్పొరేషన్, అక్టోబర్ 2 : సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమాన్ని మరిచి బీఆర్ఎస్పై కక్షసాధింపు చర్యలపైనే దృష్టి పెట్టారని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి కొప్పులు ఈశ్వర్ ధ్వజమెత్తారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావుతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. కేటీఆర్‌పై దాడి చేయాలన్న ఉద్దేశంతోనే మంత్రులు, ఎమ్మెల్యేలు వేలాది మంది పోలీసుల పహారాలో సీఎం రేవంత్ సిరిసిల్లకు వచ్చినట్టు ఉందని విమర్శించారు.
సీఎం పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేయడంతోపాటు స్థానికంగా ఉండే ప్రజల్ని కూడా బయటకు రాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. సిరిసిల్ల సభలో సీఎం చెప్పిన వాఖ్యలపై ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవాచేశారు. బతుకమ్మ చీరలు, స్కూల్స్ దుస్తులు, సరుకులపై సబ్సిడీలు ఇచ్చి చేనేత కార్మికులను కాపాడుకున్న చరిత్ర కేసీఆర్‌ది అని అభివర్ణించారు. రేవంత్‌రెడ్డి చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కేటీఆర్ ఉన్నత చదువులు చదివి, అమెరికాలో ప్రతిష్టాత్మక కంపెనీల్లో ఉద్యోగం చేసి స్వశక్తితో ఎదిగారని, దానిని అవమానించడం కాంగ్రెస్ దిగజారుడుతనానికి నిదర్శనమని పేరొన్నారు.
ఓటుకు నోటు కేసులో రూ. 50 లక్షలతో దొరికిపోయిన చరిత్ర ఉన్న రేవంత్‌రెడ్డికి నిజాయితీ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. వేములవాడ అభివృద్ధి కోసం అథారిటీని తీసుకువచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కాగా.. సీఎం రేవంత్‌రెడ్డి వేములవాడను పూర్తిగా విధ్వంసం చేస్తున్నారని దుయ్యబట్టారు. పట్టుబట్టి మధ్యమానేరు ప్రాజెక్టు పూర్తి చేయించిన ఘనత కేసీఆర్‌ది అని పేర్కొన్నారు. కేసీఆర్ దళితబంధు తెచ్చి ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు అందిస్తే, కాంగ్రెస్ రాగానే ఆ పథకాన్ని పూర్తిగా నిలిపివేసి దళితులకు తీవ్రద్రోహం చేసిందని చెప్పారు. రూ.12 లక్షల అంబేదర్ అభయహస్తం ఏమైందో దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డిని నిలదీయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పి అధికారంలో వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా సీఎం రేవంత్‌రెడ్డి మహిళలను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. తులం బంగారం, స్కూటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎంతమంది మహిళలను కోటీశ్వరులను చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేటీఆర్, హరీశ్‌రావును తిట్టడమే పనిగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు విమర్శించారు. కేసీఆర్ మొదలుపెట్టిన కలెక్టరేట్‌ను ప్రారంభించి సిరిసిల్లలో కేటీఆర్‌ను తిట్టడమే ప్రాధాన్యతగా సీఎం పర్యటన సాగిందని మండిపడ్డారు.