రవీంద్రభారతి, అక్టోబర్ 2: ప్రజాసాహిత్యానికి మరసం (మంజీరా రచయితల సంఘం) ప్రాణం పోస్తున్నదని, ఈ సంఘం భావితరానికి ప్రజాపక్షంగా నిలబడిన దిక్సూచి వంటిదని మాజీ మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో శుక్రవారం మరసం 40 ఏండ్ల వార్షికోత్సవం సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కలకుంట్ల రంగాచారి ఆధ్వర్యంలో జరిగిన మహాసభలో హరీశ్‌రావు మాట్లాడారు.
40 ఏండ్లు సాహిత్య సంస్థను నడిపించడం కత్తిమీద సాములాంటిదని, నాటి నిర్బంధాలు, బెదిరింపులు, రాజ్యహింసను తట్టుకొని నిలబడిన మరసం సామాజిక సమస్యల పరిష్కారాన్ని భుజాల మీదికి ఎత్తుకున్నదని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఈ సంస్థ పాత్ర ఉన్నదని, కవులు, రచయితలు, కళాకారులు, జర్నలిస్టులను ఏకంచేసి ఉద్యమాన్ని మలుపుతిప్పిన ఘనత ఈ సంస్థదేనని కొనియాడారు. మరసం సుదీర్ఘ ప్రస్తానానికి నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, దేవీప్రసాద్, విరాహత్ అలీ వంటి వారి నిబద్ధతే కారణమని పేర్కొన్నారు.
భావితరాలకు సరికొత్త స్ఫూర్తిని అందించాలని మరసం ప్రతినిధులకు ఆయన పిలుపునిచ్చారు. నేడు ఏఐ రాజ్యమేలుతున్నా.. మట్టి వాసనలతో రాసిన కవిత్వం, సాహిత్యం మాత్రమే సజీవంగా ఉంటుందని విశ్వాసం వ్యక్తంచేశారు. పాశ్చాత్య దేశాల్లో అన్ని వర్గాలవారు పుస్తక పఠనం వైపు మరలుతుంటే మన దేశంలోఉయ్యాలలూగే పిల్లలు సైతం సెల్‌ఫోన్‌ల్లో ఊగడం ఆందోళన కలిగిస్తున్నదని చెప్పారు. ప్రతి ఒక్కరిలో పుస్తక పఠనాన్ని మరింతగా పెంపొందించాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి సాహిత్యంపై ప్రేమేలేదని హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సాహిత్య అకాడమీని నెలకొల్పి మొదటి చైర్మన్‌గా నందిని సిధారెడ్డిని చేస్తే, రేవంత్‌రెడ్డి మాత్రం అకాడమీ చైర్మన్‌ను నియమించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. అసలు సాహిత్య అకాడమీని లేకుండా చేస్తున్నారని, ఇదీ తెలంగాణ సాహిత్యలోకానికి తీరని నష్టమని పేర్కొన్నారు. గత మూడేండ్లుగా తెలంగాణ అకాడమీకి తాళం వేయడం సాహిత్యంపై నేటి పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
సాహిత్య, సాంస్కృతిక వికాసానికి మరసం పునాది పరిచిందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తెలిపారు. మంజీరా రచయితల సంఘం వ్యక్తి కేంద్రంగా పనిచేయలేదని.. వస్తువు, విషయం కేంద్రంగా పనిచేస్తున్నదని వివరించారు. ఒక లక్ష్యంతో, ఆశయంతో నడుస్తున్నదని చెప్పారు. ఉద్యమాలకు ఆటగా, మాటగా, గొంతుగా మారిందని తెలిపారు. విభిన్న వ్యక్తులు, భావజాలాలు, సంస్థలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి నడిపించిన ఘనత ఈ సంఘానిదేనని చెప్పారు. బెల్లి లలితలాంటి అద్భుత కళాకారులను మరసం వెలుగులోకి తీసుకొచ్చిందని తెలిపారు.
మంజీరా రచయితల సంఘం ఎప్పుడూ పీడిత ప్రజల పక్షమే వహిస్తుందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డి తెలిపారు. నిర్బంధాలు, అవరోధాలను ఎదుర్కొంటూ అన్నివర్గాల ప్రజలకు వేదికగా నిలుస్తున్నదని చెప్పారు. సామాజిక, సాంస్కృతిక, రాజకీయ ఉద్యమాలకు మరసం ప్రేరణగా నిలిచిందని పేర్కొన్నారు. అన్నివర్గాల ప్రజలు, పల్లెలతో మరసం మమేకమైందని చెప్పారు. కవులు, రచయితలు, కళాకారులు, జర్నలిస్టులకు ఇది స్ఫూర్తి నింపిందని తెలిపారు.
మంజీరా రచయితల సంఘంతో జర్నలిస్టులకు తల్లీబిడ్డలకు ఉండే బంధం ఉన్నదని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ పేర్కొన్నారు. మరసం చొరవతో కవుల రచనలు వార్తలుగా, జర్నలిస్టుల వార్తలు కవితలుగా మారాయని గుర్తుచేశారు. మరసంతో కలిసి జర్నలిస్టుల సంఘం పోరు చేసినట్టు తెలిపారు. ఈ సంఘం స్ఫూర్తితోనే 25 ఏండ్ల క్రితం జర్నలిస్టుల బతుకులపై ‘కలం రాగాలు’ ఆడియో క్యాసెట్ విడుదల చేసినట్టు తెలిపారు. నిర్బంధాలను ఎదుర్కొంటున్న జర్నలిస్టులకు మరసం అండగా నిలిచిందని గుర్తుచేశారు. కలకుంట్ల రంగాచారి, దేవీప్రసాద్, నెల్లుట్ల రమాదేవి, జిలుకర శ్రీనివాస్ మాట్లాడారు.