హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): కొత్త విద్యుదుత్పత్తి ప్లాంట్ల విషయంలో ప్రభుత్వరంగ సంస్థ జెన్కోను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టి ప్రైవేట్ రంగానికే జైకొట్టింది. ఇక నుంచి కొత్త ప్లాంట్ల నిర్మాణానికి పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలోనే నిర్మించనున్నారు. రాష్ట్రంలో కొత్తగా 7,800 మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్లు నెలకొల్పేందుకు రాష్ట్ర మంత్రిమండలి గురువారం పచ్చజెండా ఊపింది. ఇందులో 3 వేల సోలార్, 4 వేలు బ్యాటరీ, 800 మెగావాట్లు పవన (విండ్) విద్యుత్తు ప్లాంట్లు ఉన్నాయి.
ఈ కొత్త ప్లాంట్లను పీపీపీ పద్ధతిలో నిర్మించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త ప్లాంట్లు జెన్కోకు ఇవ్వకుండా పీపీపీ మోడ్‌లో చేపట్టడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటీకరణను ప్రోత్సహించడంపై ఉద్యోగులు మండిపడున్నారు. ఇది సంస్థ మనుగడకు శాపంగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జెన్కోను కావాలనే నిర్వీర్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
కొత్త ప్లాంట్లల్లో జెన్కో భాగస్వామ్యం నామమాత్రంగానే ఉండనున్నది. పీపీపీ విధానంలో జెన్కోకు చెందిన స్థలాల్లో ప్రైవేట్ సంస్థలు విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటాయి. మొత్తం ప్రైవేట్ సంస్థల ఆధిపత్యమే ఉంటుంది. ప్రాథమిక సమాచా రం ప్రకారం పెద్దపల్లి జిల్లా రామగుడంలో రెండువేలు, రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో రెండు వేల చొప్పున బ్యాటరీ స్టోరేజీ పవర్ ప్లాంట్లను నిర్మించనున్నారు. శంకర్‌పల్లిలో గతంలో గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్ కోసం జెన్కో భూసేకరణ పూర్తిచేసింది. రామగుండంలోనూ జెన్కో స్థలం ఉన్నది. ఖాళీగా ఉన్న సబ్స్టేషన్ల స్థలాలను సైతం బ్యాటరీ స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటుకు పరిశీలిస్తున్నారు.
రాష్ట్రంలో మొదటి సోలార్ ప్లాంట్ జెన్కోదే. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జురాలలో ఒక మెగావాట్ సామర్థ్యం గల సోలార్‌ప్లాంట్‌ను జెన్కో ఏర్పాటుచేసింది. ఆ తర్వాత సోలార్‌ప్లాంట్లు ఏర్పాటు చేయనేలేదు. పులిచింతల, నిజాంసాగర్, పెద్దపల్లిలో కాలువలపై సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు జెన్కో అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. కేటీపీఎస్‌లో 8 మెగావాట్ల సోలార్‌ప్లాంట్‌కు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
కానీ ఆ ప్రతిపాదనలన్నీ అటకెక్కాయి. ప్రైవేట్ ప్లాంట్లు పెద్ద ఎత్తున ఏర్పాటు కావడమే కాకుండా.. అవి మన రాష్ర్టానికే విద్యుత్తును విక్రయిస్తున్నాయి. కానీ జెన్కో మాత్రం సోలార్ ప్లాంట్ల ఏర్పాటు దిశలో ముందడుగే పడలేదు. 800 మోగావాట్ల విండ్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పవన విద్యుత్తు రంగంలోనూ జెన్కో ప్రవేశించలేదు. జెన్కో సంస్థను కేవలం థర్మల్, హైడల్కే పరిమితం చేయరాదని, ఇకనైనా జెన్కోను బలోపేతం చేయాలని సర్కార్ పెద్దలను జెన్కో ఉద్యోగులు కోరుతున్నారు.