భోపాల్: బైక్పై వెళ్తున్న జంటను కొందరు దుండగులు అడ్డుకున్నారు. వారిని అడవిలోకి లాక్కెళ్లారు. మొబైల్ ఫోన్లు, పర్సులు, ఇతర వస్తువులు దోచుకున్నారు. ఆ తర్వాత మహిళపై అత్యాచారానికి యత్నించారు. ఒక వ్యక్తి సమాచారంతో పెట్రోలింగ్ పోలీసులు అక్కడకు చేరుకుని ఆ జంటను రక్షించారు. (Men Drag Couple Into Forest) మధ్యప్రదేశ్లోని గునా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం రాత్రి గడెర్ గ్రామం సమీపంలోని గుడిని ఒక జంట దర్శించింది. ఆ తర్వాత బైక్పై తిరిగి వెళ్తుండగా జాతీయ రహదారిపై ఉన్న పెట్రోల్ బంకు వద్ద కొందరు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు.
కాగా, ఆ జంటను సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వారు లాక్కెళ్లారు. ఆ జంటపై దాడి చేయడంతో పాటు వారి మొబైల్ ఫోన్స్, పర్సులు, ఇతర వస్తువులను దోచుకున్నారు. ఆ తర్వాత తమ సహచరులను అక్కడికి పిలిపించారు. 26 ఏళ్ల మహిళపై అత్యాచారానికి ప్రయత్నించారు.
మరోవైపు అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి దీనిని గమనించి పెట్రోలింగ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు వెంటనే ఆ స్థలానికి చేరుకున్నారు. పోలీసులను చూసి ఆ దుండగులు అక్కడి నుంచి పారిపోవడంతో ఆ మహిళపై అత్యాచార యత్నం విఫలమైంది.
అయితే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. దోచుకున్న మొబైల్ ఫోన్స్, పర్సు, ఇతర వస్తువులను వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.