ముదిగొండ, ఆగష్టు 18 (నమస్తే తెలంగాణ): గ్రూప్స్ నోటిఫికేషన్ రావడం లేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ముదిగొండ మండలంలో కలకలం రేపింది. యువతకు ఉద్యోగాలు హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కాలయాపన చేస్తుండడంతో విసిగిపోయిన న్యూ లక్ష్మీపురంవాసి గడ్డం వేణు కుమార్ ఎలుకల మందు, ఇతర మాత్రలు తీసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం ఐసీయూలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అతడు తాను ఎందుకు ఆత్మహత్యకు ప్రయత్నించాడో సూసైడ్ లేఖలో వెల్లడించాడు వేణు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ముత్తారం శివారులోని పల్లె చెరువులోని మిషన్ భగీరథ ప్లాంట్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న వేణు కుమార్ పీజీ వరకూ చదివాడు. గత అయిదేళ్లుగా గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ప్రతి రోజు ప్లాంటు వద్దకు వెళ్లి.. పని చూసుకుంటూ.. అక్కడే చదువుకుని సాయంత్రం ఇంటికి వస్తాడు. రోజులానే శనివారం కూడా ఇంట్లో నుంచి వెళ్లాడు వేణు.
ఐసీయూలో వేణు కుమార్

అయితే.. సాయంత్రం సమయంలో నిరుద్యోగుల వాట్సాప్ గ్రూప్‌లో సూసైట్ నోట్ పోస్ట్ చేసి అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రూపులో ఉన్నవారు అప్రమత్తమై వెంటనే అతడి తండ్రికి సమాచారం ఇవ్వగా.. వెళ్లి చూసేసరికి వేణు అపస్మారక స్థితిలో ఉన్నాడు. హుటాహుటిన అతడిని వైద్య చికిత్స నిమిత్తం ఖమ్మంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వేణు ఆత్మహత్యకు ప్రయత్నించిన చోట ఎలకల మందు, గుర్తు తెలియని మాత్రలను గుర్తించారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న వేణు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
గ్రూప్ నోటిఫికేషన్ ఇవ్వడంలేదని మనస్తాపానికి గురై తను ఆత్మహత్యాయత్నం చేశానని సూసైడ్ లేఖలో వేణు కుమార్ వెల్లడించాడు. ‘నా మరణానికి కారణం సరైన సమయానికి గ్రూప్స్ నోటిఫికేషన్లు రాకపోవడమే. గత 5 సంవత్సరాలుగా గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నా. ఒక్కసారి మాత్రమే గ్రూప్స్ రాశా. ప్రతి సంవత్సరం జాబ్ కాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకూ ఇవ్వలేదు. జాన్ 2 సందర్భంగా చిన్న చిన్న నోటిఫికేషన్లు ఇస్తున్నారు, కానీ గ్రూప్స్ నోట్రిఫికేషన్ వచ్చే పరిస్థితి కనపడడం లేదు. ‘జాబ్ కాలెండర్ ఇస్తాము’ అని మానిఫెస్టోలో పెట్టటంతో నిరుద్యోగులమంతా కాంగ్రెస్ పార్టీని గెలిపించాము. గత ప్రభుత్వంలో మిగిలిపోయిన నోటిఫికేషన్లు పూర్తి చేశారే తప్ప జాబ్ కాలెండర్ ఇవ్వలేదు. ప్రతి సంవత్సరం నోటిఫికేషను విడుదల చేస్తే నిరుద్యోగులుకు ఈ దుస్థితి వచ్చేది కాదు. ఏదో ఒక ఉద్యోగం వస్తుందని వారిమీద వారికి నమ్మకం ఉండేది. రెండు, మూడు సంవత్సరాలు వారి ప్రతిభను పరీక్షించుకుంటారు.

5 సంవత్సరాలకి ఒకసారి పంచవర్ష ప్రణాళిక లాగా లేదా 10 సంవత్సరాలకి నోటిఫికేషన్స్ ఇస్తే ఎంతో మంది అభ్యర్థులు వారి విలువైన సమయాన్ని, వయస్సును పోగొట్టుకుంటున్నారు. అందులో నేను ఒకడిని. ఐదు సంవత్సరాలుగా గ్రూప్స్ అనే అనే ముసుగులో మునిగిపోయా. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్లు వచ్చి ఉంటే నాక్కూడా ఏదో ఒక జాబ్ వచ్చేది. ఇప్పుడున్న పరిస్థితులలో అభ్యర్థులు వారి జీవిత కాలంలో 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఒకటి లేదా రెండు నోటిఫికేషన్లు మాత్రమే చూస్తున్నారు. ఇటీవల విడుదలైన పోలీస్ నోటిఫికేషన్ కూడా నిరుద్యోగులని సంతృప్తి పరచలేదు.

రాష్ట్రంలో, వ్యవస్థలో పై స్థాయిలో మార్పులు కనిపిస్తున్నా.. కింది స్థాయిలో వికేంద్రీకరణ జరగడం లేదు. మధిర నియోజకవర్గం ఎమ్మెల్యే, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. మా అమ్మ మానసిక వికలాంగురాలు. మాకు సొంత ఇల్లు లేదు. ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడూ మంజూరు కాలేదు. 10 సంవత్సరాలుగా అద్దె ఇంట్లో ఉంటున్నాము. ఈ నోట్ సీఎం, డిప్యూటీ సీఎం, రాహుల్ గాందీలకు చేరే వరకూ షేర్ చేయాలి’ అని వేణు తన ఆవేదనను సూసైడ్ నోట్లో వెల్లగక్కాడు.