– 24×7 విస్తృత పర్యవేక్షణ
– సమాచారంపై తక్షణ స్పందన
– ఫిర్యాదుల స్వీకరణకు కమాండ్ కంట్రోల్ సెంటర్
లక్ష్మీదేవిపల్లి, సెప్టెంబర్ 29 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ & కంట్రోల్ సెంటర్లో అటవీశాఖ కమాండ్ కంట్రోల్ టీమ్‌కు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ఇన్చార్జ్ సీఐ రమాకాంత్ ప్రత్యేకంగా పాల్గొని, అటవీశాఖ కమాండ్ కంట్రోల్ టీమ్‌కు సమాచార స్వీకరణ, విశ్లేషణ, పర్యవేక్షణ, అత్యవసర స్పందన, ఫీల్డ్ బృందాలతో సమన్వయం తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ, విలువైన సూచనలు అందించారు. పోలీస్ శాఖలో అమలవుతున్న కమాండ్ కంట్రోల్ వ్యవస్థలోని అనుభవాలను ఆధారంగా చేసుకుని సమాచారం అందిన వెంటనే దాని ప్రాధాన్యతను గుర్తించడం, సంబంధిత అధికారులకు తక్షణ సమాచారం చేరవేయడం, ఫీల్డ్ స్థాయిలో చేపట్టిన చర్యలను పర్యవేక్షించడం, సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరంతర ఫాలోఅప్ నిర్వహించడం వంటి అంశాలను సీఐ సిబ్బందికి వివరించారు. ఈ సందర్భంగా డీఎఫ్ఓ సిద్దార్థ్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ అటవీ సంరక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో కమాండ్ & కంట్రోల్ సెంటర్‌ను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. “కమాండ్ & కంట్రోల్ సెంటర్ కేవలం సమాచారం స్వీకరించే కేంద్రం కాదు. అటవీ ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, అందిన సమాచారాన్ని చర్యగా మార్చే కీలక వ్యవస్థగా ఇది పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.
కమాండ్ & కంట్రోల్ సెంటర్ ద్వారా జిల్లాలోని అటవీ ప్రాంతాలకు సంబంధించిన అటవీ నేరాలు, అక్రమ కలప నరికివేత, రవాణా, వన్యప్రాణుల వేట, అటవీ ఆక్రమణలు, అటవీ అగ్ని ప్రమాదాలు, అనుమానాస్పద కార్యకలాపాలు తదితర అంశాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. అందిన ప్రతి సమాచారాన్ని నమోదు చేసి, దాని తీవ్రతను బట్టి సంబంధిత రేంజ్ అధికారులు, టాస్క్ ఫోర్స్ మరియు ఫీల్డ్ సిబ్బందికి తక్షణమే చేరవేసి, చేపట్టిన చర్యలపై నిరంతరం పర్యవేక్షణ మరియు ఫాలోఅప్ నిర్వహించే విధంగా వ్యవస్థను రూపొందించినట్లు తెలిపారు.
అటవీ ప్రాంతాల్లో అక్రమ కలప నరికివేత, అక్రమ రవాణా, వన్యప్రాణుల వేట, అటవీ ఆక్రమణలు, అగ్ని ప్రమాదాలు లేదా ఇతర అటవీ నేరాలకు సంబంధించిన సమాచారం ఎవరి వద్ద ఉన్నా, వారు కమాండ్ & కంట్రోల్ సెంటర్‌కు సమాచారం లేదా ఫిర్యాదు అందించవచ్చని అధికారులు తెలిపారు. పోలీస్ శాఖ కమాండ్ కంట్రోల్ వ్యవస్థలోని అనుభవాన్ని అటవీశాఖ సాంకేతిక అలాగే ఫీల్డ్ స్థాయి సామర్థ్యాలతో అనుసంధానం చేయడం ద్వారా సమాచారం నుంచి చర్య వరకు వేగవంతమైన సమన్వయ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ కమాండ్ కంట్రోల్ సిబ్బంది, అటవీశాఖ అధికారులు, కమాండ్ & కంట్రోల్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.