ఏది తొలి తెలుగు రాత?
నాగబు, తంబయ దానం, అంధిర లోకం ఇవేవీ తెలుగు మాటలు కావు. తత్సమ, తద్భవాలతో కూడిన పదాలవి. కానీ, ఇవేవీ లేని తెలుగున్నది కదా. తెలుగేం సంస్కృత జన్యం కాదు. మధ్య ద్రావిడ భాషా శాఖకు చెందింది. గోండీ, కుయిలతో పాటు తెలుగు ఆ శాఖలో ఉన్నది. 3 వేల యేండ్ల నుంచి తెలుగు ఉన్నది. 5వ శతాబ్దం నుంచే రాతలో ఉన్నదని తెలుస్తున్నది. అచ్చం తెలుగు పదాలతో రాసిన తొలి తెలుగు లేఖనం (శాసనం అని ఒప్పుకోని వారికోసం కాదు) ‘తొలుచువాండ్రు’.
ప్రపంచ వారసత్వ వారోత్సవం సందర్భంగా
నాగబు, తంబయ దానం, అంధిర లోకం ఇవేవీ తెలుగు మాటలు కావు. తత్సమ, తద్భవాలతో కూడిన పదాలవి. కానీ, ఇవేవీ లేని తెలుగున్నది కదా. తెలుగేం సంస్కృత జన్యం కాదు. మధ్య ద్రావిడ భాషా శాఖకు చెందింది. గోండీ, కుయిలతో పాటు తెలుగు ఆ శాఖలో ఉన్నది. 3 వేల యేండ్ల నుంచి తెలుగు ఉన్నది. 5వ శతాబ్దం నుంచే రాతలో ఉన్నదని తెలుస్తున్నది. అచ్చం తెలుగు పదాలతో రాసిన తొలి తెలుగు లేఖనం (శాసనం అని ఒప్పుకోని వారికోసం కాదు) ‘తొలుచువాండ్రు’. అమరావతిలో దొరికిన శాసన శకలం ‘నాగబు’కు పండితులంతా లేనిపోని గొప్పతనాలను కూర్చి ఇదే తెలుగు తొలిమాటగా ప్రచారం చేశారు. ఉద్గ్రంథాలు రాశారు. ఆరుద్ర తన పుస్తకానికి నాగబును లోగో లెక్క వేసుకున్నారు. తీరా ఏమయింది. అది నాగబు కాదు, నాగబుధ అనే నామక శాసనంలోనిది అని చరిత్రకారులు తేల్చేశారు. నాగబు కొట్టివేతకు గురైంది. ఇపుడా చోటులో ‘తొలుచువాన్డ్రు’ రాయాలె.
యేండ్ల తరబడి చెక్కర్లు కొడుతున్న వ్యాసాన్ని పాతవారే మళ్లీ, మళ్లీ తెరమీదకు తెస్తున్నారు. ఆ వ్యాసంలో తొలి తెలుగు పదం నాగబు కాదు.. అంధిర లోకము అని, కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కన్నమడకలలో కనుగొన్న శాసనంలో అంధిర లోకము అనే పదం ఉన్నదని, ఆంధ్ర లోకము అనే మాటే అంధిర లోకమని, ప్రపంచంలోనే శాసనపూర్వకమైన తొలి తెలుగు పదంగా చరిత్రకారులు గుర్తించారు. అదే మండలంలోని గ్రామాల్లో దొరికిన ఎనిమిది శాసనాల్లో కూడా తెలుగు పదాలు ఉన్నాయి, అంధిరపతి పదమున్న మరో శాసనాన్ని కనుగొన్నారని ఆ వ్యాసంలో పేర్కొన్నారు. బొల్లవరం గుట్టల వద్ద తెలుగు బ్రాహ్మీలిపిలో ‘గిబ్బతీగల’ అనే నామక శాసనం దొరికిందట. తెలుగు లిపా? బ్రాహ్మీలిపా? అనేది మాత్రం అస్పష్టం.
పొల్లావరము నామక శాసనం దొరికిందని అంటారు. అది క్రీ.పూ. 500 ఏండ్ల నాటిదట. కేశవులు మువ్వడి అనే పదం క్రీ.పూ.625 నాటిదని అంత కచ్చితంగా ఎట్లా చెప్పారో. శాసనంలో సంవత్సరం పేర్కొన్నారా? లేదా తెలియదు. పై శాసనాలను తమిళులు బయటికి రాకుండా చేశారని ఆరోపణ మాత్రం ఉన్నది. మలయాండి సమర్పించిన ‘హిస్టారికల్ స్టడీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్..ఏ కంపారిటివ్ స్టడీ ఆఫ్ తుంగభద్ర వ్యాలీ’ పరిశోధనాపత్రం ప్రతులు తిరుపతిలోని వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి చేరినపుడు పరిశోధకుడు వైద్యం వేంకటేశ్వరాచార్యులు వెలుగులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారని వ్యాస సారాంశం.
హంద్రీ నది పేరు మీదుగా ఆంధ్ర పదం వచ్చిందని మల్లంపల్లి సోమశేఖర శర్మ అభిప్రాయం వెలిబుచ్చారని వ్యాసంలో రాశారు. ఇది తెలివాహ నుంచి తెలుగు పేరు వచ్చిందన్న అభిప్రాయానికి సమాంతరం. డా.దేమె రాజారెడ్డి ‘ప్రాకృతం నుంచి బ్రాహ్మీదాక’ అనే వ్యాసంలో మొక్కట్రావుపేట, గట్టుసింగారం శాసనాలు (కరీంనగర్ జిల్లావి కాదు) జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందినవి. ఆయన రాసిన వ్యాసంలో వెలువరించిన అభిప్రాయం ప్రకారం ప్రాకృతం నుంచి తెలుగు పుట్టింది.
శాతవాహన చివరి రాజు పేరు పుదుమావికి బదులు పులుమావి అని రాసి ఉన్నదని అంటారు. పులుమావి అనే పేరు సంస్కృతమా? అని సందే హం. కానే కాదు, అది అచ్చ తెలుగు మాట కదా. శాతవాహనుల నుంచి కళ్యాణచాళుక్యుల పాలన వరకు తెలుగు భాషాభివృద్ధి పూర్తయింది. ఈ కాలంలో తెలుగు శాసనాలే అరుదు కదా. తెలుగు భాష గురించి ఎప్పుడు తెలిసింది? వేంగి పాలనలో 40 అక్షరాల మౌర్య బ్రాహ్మీలిపి 56 అక్షరాల తెలుగు లిపిగా మారిందని అంటారు రాజారెడ్డి.
శాతవాహన పూర్వరాజులు కోటిలింగాలను ఏలినవారు. తొలిసారిగా నాణేల మీద పేరు ముద్రించడం ‘గోబద’తో మొదలైంది. గోబద, నారన, కంవయ, సిరివాయ, సిరికామ, సమగోపలని ఆరుగురు శాతవాహన పూర్వరాజుల పేర్లు. వీటిలో అచ్చమైన తెలుగు పేరు ‘నారన’. నాణెం మీదనైనా చెక్కిన పేరే కదా. ఇది తొలి తెలుగు పేరు లేఖనమని అనాలి. కానీ బ్రాహ్మీలిపిలో దీనిని రాశారు. తెలుగులో తొలి రాతి రాత (శిలాశాసనం) ఎక్కడున్నది? తెలంగాణలోని కీసరగుట్టలో రాతిగట్టుకు చెక్కిన క్రీ.శ.5వ శతాబ్దానికి చెందిన ఐదక్షరాల పదమే తొలి తెలుగు శాసనం. రాతి గోడ మీద పెద్ద అక్షరాలతో చెక్కిన ‘తొలుచువాన్డ్రు’ ఈ శాసనం తొలుచు, వాండ్రు అనే రెండు మాటలతో ఏర్పడ్డ సమాసం. ‘తొలుచువాన్డ్రు’ అనేది అచ్చమైన తెలుగు మాట. 5వ శతాబ్దానికి చెందిన పరిణామ తెలుగు లిపిలో రాసిన తెలుగు లేఖనం. బ్రాహ్మీలిపి నుంచి తెలుగు పరిణమించిన తీరుకు మంచి ఉదాహరణ, చారిత్రక సాక్ష్యం. ఈ లేఖనాన్ని ‘తులచువాన్డ్రు’ అని చదివిన శాసనవేత్తలు ఈ నామక శాసనాన్ని తొలిచినవారికి చదువురాక తప్పుగా లిఖించారని నిందాపూర్వక వ్యాఖ్యలు చేశారు. నిజమేంటంటే ఆ నామక శాసనం ‘తొలుచువాన్డ్రే’. లేఖనంలో ‘త’కున్న ఒత్వాన్ని, ఉత్వంగా చదివారు. ఇటీవల ఒడిశా రాష్ట్రంలోని రత్నగిరిలో జరిగిన తవ్వకాల్లో ఒక టెర్రకోట ముద్ర బౌద్ధ శాసనంతో లభించింది. దాని మీద 5వ శతాబ్దపు బ్రాహ్మీలిపిలో మూడు పంక్తుల సంస్కృత శాసనం ఉన్నది.

Haragopal
‘యే ధర్మ హేతు ప్రభవ హేతు స్తేతామ్ తథాగతో హ్యవదత తేషామ్ చ యో నిరోధ ఎవంవాది మహాశ్రమణ’
ఒడిశాలో లభించిన మట్టి ముద్ర బ్రాహ్మీలిపి శాసనంలో ‘తథాగతో’ అనే చోట ఉన్న ‘తో’ అనే అక్షరమే కీసరగుట్ట తొలుచువాన్డ్రులో ఉన్నది. ఇపుడు తొలుచువాన్డ్రును ‘తులుచువాన్డ్రు’ అని చదివి, అర్థం లేని పేరని, రాయసగాని అవిద్య అనడానికి వీల్లేదు. తొలుచువాన్డ్రును శాసనమని, అది 5వ శతాబ్దపు లిపి అని, తెలుగులో తొలిశాసనం తొలుచువాన్డ్రు అని అంగీకరించడం చరిత్రకారుల వంతు. తెలంగాణలోని కురిక్యాల త్రిభాషా శాసనంలో తెలుగులో రాసిన ‘కంద’ పద్యాలు ఉన్నప్పుడు తెలుగు అభివృద్ధి చెందింది ఇక్కడ కాదనడం ఎంతవరకు సబబు?
క్రీ.శ.900-950 ప్రాంతంలో మల్లియ రేచన తెలుగులో రచించిన తొలి లక్షణ గ్రంథం, ఛందశ్శాస్త్రం ‘కవిజనాశ్రయం’. తెలుగులో కందపద్యాల్లో రాసిన తొలి లక్షణ శాస్త్రం. ఈ రచన జరిగింది వేములవాడ చాళుక్యుల కాలంలో, తూర్పు చాళుక్యుల కాలంలో కాదు. తెలుగు ‘తిలింగ’ నుంచి పుట్టిందని భాషా శాస్త్రవేత్తలు, చారిత్రక అధ్యయనవేత్తలు చెప్తున్నారు. త్రిలింగ శబ్దభవం అనేది అబద్ధం. శ్రీశైలం, కాళేశ్వరం, భీమేశ్వరాల్లోని త్రిలింగాల పేరు మీద ‘త్రిలింగదేశం’ అని ఈ తెలుగు ప్రజల ప్రాంతాన్ని పిలిచారని, అదే పరిణామంలో తెలుగు అయిందని చెప్పే కథకు కాలం తీరింది. ఈ మూడు లింగాలు మధ్యయుగాల్లో ప్రతిష్ఠితమయ్యాయి. తెలుగు మాట్లాడే ప్రజలను తెలంగం, తెలంగు, తైలాంగు, తిలింగులని అనడం నుంచే ‘తెలుంగు’ రూపుదిద్దుకున్నది. పరిణామంలో తెలుంగులోని పూర్ణానుస్వారం ఎగిరిపోయి ‘తెలుగు’ మిగిలింది.
(వ్యాసకర్త: కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు)
శ్రీరామోజు హరగోపాల్
9949498698
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

