Thellakagitham | అక్టోబర్ 2న అట్టహాసంగా థియేటర్లలో విడుదల కావాల్సిన టాలీవుడ్ సినిమా ‘తెల్లకాగితం’ చిత్ర యూనిట్‌కు భారీ షాక్ తగిలింది. సినిమా విడుదలకు కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన కంటెంట్ ఆన్లైన్లో లీక్ కావడం సినీ వర్గాల్లో కలకలం రేపింది. ఈ అనూహ్య పరిణామంతో చిత్ర నిర్మాతతో పాటు టెక్నీషియన్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఈ వ్యవహారంపై స్పందించిన ‘తెల్లకాగితం’ చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. సినిమాకు సంబంధించిన లీకైన కంటెంట్‌ను ఎవరూ డౌన్లోడ్ చేయవద్దని, సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని మరియు ఇతరులకు సర్క్యులేట్ చేయవద్దని ప్రేక్షకులను హృదయపూర్వకంగా కోరింది.
మా చిత్రం ‘తెల్లకాగితం’కు సంబంధించిన కంటెంట్ అనుమతి లేకుండా ప్రచారం చేయబడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ సినిమా కంటెంట్‌ను చట్టపరంగా లీక్ చేయడాన్ని, షేర్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. లీకైన కంటెంట్‌ను ఎవరూ షేర్ చేయవద్దని, డౌన్లోడ్ చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సినిమాను కేవలం థియేటర్లలోనే వీక్షించి మా చిత్రబృందానికి మీరంతా సంపూర్ణ మద్దతు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము. అంటూ తెల్లకాగితం చిత్ర బృందం ప్రెస్ నోట్ విడుదల చేసింది.
సినిమా సక్సెస్ వెనుక ఎంతోమంది కష్టపడతారని, ఇలాంటి పైరసీ చర్యలు మరియు లీక్‌లు చిత్ర యూనిట్‌ను తీవ్రంగా దెబ్బతీస్తాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, లీక్ అయిన వీడియోలను ఎంకరేజ్ చేయకుండా కేవలం థియేటర్లలోనే సినిమాను చూసి విజయవంతం చేయాలని సినీ పరిశ్రమ కోరుతోంది.