Kangana Ranaut | హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్‌సభా స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలీవుడ్ కథా నాయిక కంగనా రనౌత్.. తనకు రూ.90 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. మంగళవారం ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలపై అఫిడవిట్ సమర్పించారు. వీటిలో రూ.28.73 కోట్ల చరాస్తులు, రూ.62.92 కోట్ల చిరాస్తులు ఉన్నాయని తెలిపారు. ముంబై, పంజాబ్, మనాలీలో కొన్ని ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక రూ.3.91 కోట్ల విలువైన మూడు లగ్జరీ కార్లు ఉన్నాయని వెల్లడించారు.
రూ.90 కోట్లకు పైగా ఆస్తులతోపాటు రూ.17.38 కోట్ల అప్పులు కూడా ఉన్నాయని, బ్యాంకు ఖాతాల్లో రూ.1.35 కోట్ల నగదు ఉన్నట్లు చెప్పారు. చేతిలో రూ.2 లక్షల నగదు ఉందని వివరించారు. రూ.5 కోట్ల విలువైన 6.7 కిలోల బంగారం, 60 కిలోల వెండి, మూడు కోట్ల విలువైన 14 క్యారట్ల వజ్రాభరణాలు ఉన్నాయని అఫిడవిట్ లో వివరించారు. తనపై ఎనిమిది క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయని చెప్పారు. ఏడో దశ పోలింగ్ లో భాగంగా జూన్ ఒకటో తేదీన మండి స్థానానికి పోలింగ్ జరుగనున్నది. కంగనా రనౌత్ కు పోటీగా కాంగ్రెస్ పార్టీ నుంచి విక్రమాదిత్య సింగ్ బరిలో ఉన్నారు.