సిద్దిపేట, మార్చి 2: సాగు నీటిని విడుదల చేయడమే గాకుండా, పెండింగ్లో ఉన్న మూడు పంటలకు సంబంధించి రైతు భరోసా నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లి స్టేజీ వద్ద ముస్తాబాద్ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు, రైతులు సోమవారం రాస్తారోకో నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో రైతులకు సకాలంలో రైతుబంధు నిధులు విడుదల అయ్యేవని, రైతులు సంతోషంగా వ్యవసాయాన్ని పండుగలా చేసుకునేవారని గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల పాలిట శాపంగా మారిందని అన్నారు. రంగనాయక సాగర్, మల్లన్నసాగర్ రిజర్వాయర్ల ద్వారా రైతులకు సాగునీరు అందించాలని, తక్షణమే మూడు పంటల రైతుభరోసా నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోలో బీఆర్ఎస్ నాయకులు ఎల్లయ్య, సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.