ముంబై: మహారాష్ట్రలో ఓ డాక్టర్‌పై చేయి చేసుకున్న శివసేన కార్పొరేటర్(Shiv Sena Corporator) రమేశ్ మాత్రేకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరీ చేసింది. అయితే ఓ షరతు ప్రకారం ఆ బెయిల్ ఇచ్చారు. గోవా రిసార్టులో అతను గడిపేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో రమేశ్ మాత్రేతో పాటు ఇతరులకు కూడా బెయిల్ వచ్చింది. ఆ కార్పొరేటర్ మహారాష్ట్రలో ఉండకూడదన్న ఆదేశాలు కూడా కోర్టు ఇచ్చింది. ఉత్తర గోవాలోని నజ్రీ రిసార్ట్ అండ్ లాన్స్‌లో ఆ కార్పొరేటర్ గడిపేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. బాగా-కల్నాట్ మార్గంలో ఆ రిసార్టు ఉన్నది.
జూలై 6వ తేదీన జారీ చేసిన ఆదేశాల్లో బెయిల్ షరతు అంశంలో కోర్టు కఠినంగా వ్యవహరించింది. రిసార్టులో గడిపేందుకు బెయిల్ కండీషన్ పెట్టడం కొంత అర్ధంకాని రీతిలో ఉన్నది. జూలై 6వ తేదీన ఓ ఆస్పత్రిలోకి వెళ్లిన కార్పొరేటర్ రమేశ్.. మహిళా డాక్టర్‌పై చేయి చేసుకున్నాడు. ఓ పేషెంట్‌కు ఇచ్చే చికిత్స అంశంలో వాగ్వాదానికి దిగిన అతను ఆవేశంతో దాడి చేశాడు. జూలై 8వ తేదీన కార్పొరేటర్ మాత్రేను అరెస్టు చేశారు. తొలుత దిగువ కోర్టు అతనికి బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్‌ను బాంబే హైకోర్టు రద్దు చేసింది.
మళ్లీ జూలై 19వ తేదీన అతను లొంగిపోయాడు. కోర్టు ఆదేశాల ప్రకారం జుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. 20 రోజుల తర్వాత అతనికి హైకోర్టు బెయిల్ ఇచ్చింది. కళ్యాణ్ – డాంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న శాస్త్రి నగర్ ఆస్పత్రిలో డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందిపై కార్పొరేటర్ రమేశ్ మాత్రే అటాక్ చేశారు. ఆ ఘటనకు చెందిన వీడియో వైరల్ కూడా అయ్యింది.