హైదరాబాద్, మార్చి2 (నమస్తే తెలంగాణ): అటవీ భూమిని కొనుగోలు చేసినట్టు ఆధార పత్రాలు సమర్పించాలని డెక్కన్ సిమెంట్ లిమిటెడ్‌ను సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (సీఈసీ) ఆదేశించింది. దక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ అటవీభూమిని ఆక్రమించిందని, కంపెనీకి ఇచ్చిన స్టేజ్-1, స్టేజ్-2 అటవీ క్లియరెన్స్‌లు రద్దు చేయాలని, ఆక్రమించిన ఫారెస్ట్ భూమిలోని నిర్మాణాలను కూల్చివేసేలా నోటీసులు జారీ చేయాలని, అడవిని పునరుద్ధరించేలా ఆదేశించాలని, కంపెనీకి సహకరించిన అధికారులను చట్టం ప్రకారం శిక్షించాలని కోరుతూ పసులేటి సురేష్‌బాబు రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ పిటిషన్‌పై సీఈసీలో సోమవారం విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా డెకన్ సిమెంట్స్ లిమిటెడ్ (డీసీఎల్) తరఫున కంపెనీ కార్యదర్శి శీ బిక్రమ్ కేషారి ప్రస్టీ హాజరై ఆక్రమణ ఆరోపణ రైల్వే సైడింగ్ ప్రయోజనాల కోసం వినియోగించిన 8.02 హెక్టార్లకు సంబంధించిందని వివరించారు. రికార్డుల ఆధారంగా అటవీయేతర భూమిగా భావించి కొనుగోలు చేశామని, ఆ సమయంలో అధునాతన సాంకేతికత అందుబాటులో లేదని వివరించారు.