GV Prakash | కోలీవుడ్‌లో మరో జంట విడిపోయింది. తన భార్య, సింగర్ సైంధవితో విడిపోతున్నట్లు ప్రముఖ తమిళ నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ ప్రకటించారు. ఈ మేరకు వాళ్లిద్దరూ సోషల్‌మీడియాలో ఒకే పోస్టు పెట్టారు.
సైంధవి, నేను మా 11 ఏండ్ల వైవాహిక జీవితానికి వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నామని జీవీ ప్రకాశ్ సోషల్‌మీడియాలో తెలిపాడు. చాలా ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నాడు.. మానసిక ప్రశాంతతో పాటు ఇద్దరి జీవితాల్లో మెరుగుకోసం ఇద్దరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామన్నాడు. ఈ సమయంలో తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని, తమ నిర్ణయాన్ని గౌరవించాలని మీడియా, ఫ్రెండ్స్, ఫ్యాన్స్‌ను రిక్వెస్ట్ చేశారు. ఇకపై తమవి వేర్వేరు జీవితాలని.. ఈ నిర్ణయం తమకు మేలు చేస్తుందని అనుకుంటున్నామని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో మీ అవగాహన, మద్దతు చాలా అవసరమంటూ జీవీ ప్రకాశ్ పోస్టు పెట్టాడు. సైంధవి కూడా దాదాపుగా ఇదే విధంగా పోస్టు చేసింది.
కాగా, జీవీ ప్రకాశ్.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ మేనల్లుడు. 2013లో తన చిన్ననాటి స్నేహితురాలు సైంధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. యుగానికి ఒక్కడు, రాజా రాణి, అసురన్, ఆకాశమే నీ హద్దు వంటి సూపర్ హిట్ తమిళ చిత్రాల ద్వారా జీవీ తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్, ఎందుకంటే ప్రేమంటా, ఒంగోలు గిత్త వంటి చిత్రాలకు నేరుగా మ్యూజిక్ అందించాడు. దాదాపు 25కి పైగా సినిమాల్లో నటించాడు.