టేకులపల్లి, ఫిబ్రవరి 24: అభివృద్ధికి సహకరించకుండా తమపై అక్రమ కేసులు పెడుతున్నారని టేకులపల్లి మండలంలోని చంద్రుతండా గ్రామ పంచాయతీ సర్పంచ్ బానోత్ సంతోష వాపోయారు. పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తనను అడుగడుగునా ఇబ్బందులు పెడుతున్నారని, తన భర్త బానోత్ కిషన్ పై అక్రమ కేసు పెట్టి జైలుకు పంపారని సంతోష ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం టేకులపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ తన బాధను వెళ్లబోసుకున్నారు.
చంద్రుతండా పంచాయతీకి చెందిన కొట్టు కిషన్ అనే వ్యక్తి ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుతో తన భర్తను ఆదివారం తీసుకెళ్ళి సోమవారం సాయంత్రం రిమాండ్ తరలించారని బానోత్ సంతోష చెప్పారు. కొట్టు కిషన్ ఇంట్లోకి తన భర్త వెళ్ళినేను నక్సలైట్ అని గన్ చూపించి డబ్దులు డిమాండ్ చేశాడని అక్రమ కేసు పెట్టారని ఆమె వెల్లడించారు. తన భర్తను అదుపులోకి తీసుకున్న విషయంగానీ, రిమాండ్ తరలిస్తున్నట్లుగానీ పోలీసులు తనకు చెప్పలేదని, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వమన్నా… కోర్టులో చూసుకోండి అని దురుసుగా చెప్పారని సంతోష తెలిపారు. టేకులపల్లి పోలీసులు తనకు సర్పంచ్ అనే గౌరవం కూడా ఇవ్వలేదని ఆమె పేర్కొన్నారు.
తన భర్త అక్రమ అరెస్ట్ విషయమై ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య భార్య లక్ష్మి వద్దకు వెళ్ళినా తమతో ఆమె అసభ్యకరంగా మాట్లాడారని సంతోష ఆరోపించారు. తాము కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ అధికార పార్టీ పెద్దలతో మమ్ముల్ని ఇబ్బందులు పెడుతున్నారుని ఆమె బాధ పడుతూ చెప్పారు. చంద్రుతండా గ్రామ పంచాయతీలోని భూక్య రాజా, గుగులోత్ మస్కిషన్, రాంజీ, రూప్ల, గన్న, మంగీలాల్, ముత్యాంపాడుకు చెందిన రవి కలిసి తమపై అక్రమకేసులు పెట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. తన భర్త పంచాయతీలో నలుగురికి సహాయం చేయాలనే ఆలోచన ఉన్నవాడని, అందుకే ప్రజలందని తమని గెలిపించారని సంతోష చెప్పారు. గ్రామపంచాయతీలో ఏ కార్యక్రమాలు చేద్దామన్నా తమని కొందరు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రాణహాని ఉందని, తనకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా సంతోష పేర్కొన్నారు.