Badshah Wedding : ప్రముఖ ర్యాపర్, సింగర్ బాద్షా (Rapper Badshah) రెండోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఆరేళ్ల క్రితం మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న అతడు పంజాబీ నటి ఇషా రిఖీ (Isha Rikhi)ని మంగళవారం పెళ్లి చేసుకున్నాడు. ఈ కొత్త జంట ఫొటోలను ఇషా తల్లి పూనమ్ రిఖీ సోషల్ మీడియాలో పంచుకుంది. దాంతో, ర్యాపర్ నిజంగా రెండో వివాహం చేసుకున్నాడా? లేదా ఇవన్నీ వదంతులా? అనే చర్చకు చెక్ పడింది. హఠాత్తుగా బాద్షా పెళ్లి చేసుకోవడంతో అభిమానులు మొదట షాకైనా.. ఆ తర్వాత అభినందనలు తెలియజేస్తున్నారు.
ర్యాపర్ బాద్షా రెండో పెళ్లి గురించిన వార్తలు మంగళవారం ఉదయం నుంచే చక్కర్లు కొట్టాయి. అందుకు కారణం వధువు ఇషా రిఖీ తల్లి పూనమ్ రిఖీ ఇన్‌స్టాగ్రామ్‌లో వరుసగా ఫొటోలు పోస్ట్ చేయడమే. దేవుడు ఇషా, బాద్షాలను ఆశీర్వదించాడు అని ఆమె పెళ్లి ఫొటోలను పోస్ట్ చేసింది. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు, మిత్రుల సమక్షంలో బాద్షా, ఇషా పెళ్లి జరిగింది. ఇద్దరూ సంప్రదాయ దుస్తుల్లో, మెడలో పూలదండలతో ధగధగ మెరిసిపోయారు. సోషల్ మీడియాలో కొత్త జంట ఫొటోలు చూసినవాళ్లంతా కంగ్రాట్యులేషన్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
సోల్‌మేట్, గర్మీ, జెండా ఫూల్, అక్కడ్ బక్కడ్, లెట్స్ నాచో, బ్యాడ్ బాయ్ వంటి ఆల్బమ్స్‌తో విశేష గుర్తింపు తెచ్చుకున్న బాద్షా మొదటగా జాస్మినే మసిహ్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2017లో గ్రేస్ మసిహ్ సింగ్ అనే అమ్మాయి జన్మించింది. అనంతరం మూడేళ్లకే మనస్ఫర్ధలతో జాస్మినేకు బాద్షా విడాకులు ఇచ్చాడు. 2020 నుంచి సింగిల్‌గానే ఉంటున్న ర్యాప్ కింగ్ తన జీవితంలోకి నిషా రిఖీని రెండో భార్యగా ఆహ్వానించాడు.