Jagadish Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. బడ్జెట్‌కు సంబంధించి డిమాండ్ బుక్, అవుట్ కమ్ బడ్జెట్ బుక్ ఒకేలా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారో? సర్కస్ నడిపిస్తున్నారో అర్థం కావడం లేదంటే నిప్పులు చెరిగారు.
జగదీశ్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. డిమాండ్ బుక్స్‌లో అవుట్ కమ్ బడ్జెట్ ముద్రించారని తెలిపారు. అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి తన సొంత ఆర్థిక కారణాలపై బిజీగా ఉన్నట్లు అనిపిస్తుందని విమర్శించారు. తప్పు చేసి సరిదిద్దుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అవుట్ కమ్ బడ్జెట్, ఈ ఏడాది గ్రాంట్స్ బుక్‌లు ఒకేలా ఉన్నాయని విమర్శించారు. గతంలో సాధించిన ఫలితాలు, ఈ ఏడాది గ్రాంట్స్‌పై ప్రభుత్వానికి స్పష్టత లేదని అన్నారు. డిమాండ్ బుక్, అవుట్ కమ్ బడ్జెట్ బుక్ ఒకేలా కాపీ పెస్ట్ చేశారని అన్నారు. ఉన్నది ఉన్నట్లు రెండు బుక్‌లు తయారుచేస్తే.. ప్రభుత్వం ఎలా నడుపుతున్నారని ప్రశ్నించారు. పవిత్రమైన అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులపై ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. ఇది పొరపాటు కాదు నేరమే అని స్పష్టం చేశారు. తక్షణమే తప్పును సర్దుకొని సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సభలో ఇదే విషయమై మాట్లాడతానని స్పష్టం చేశారు.