Viral news : విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఒక 50 ఏళ్ల ప్రొఫెసర్ తప్పుగా ప్రవర్తించాడు. 19 ఏళ్ల వయసున్న ఓ విద్యార్థినికి ప్రేమ పాఠాలు చెప్పబోయాడు. క్లాస్రూమ్ (Class Room) లో అందరిముందే విద్యార్థినికి ‘ఐ లవ్ యూ (I Love You)’ చెప్పాడు. దాంతో సదరు విద్యార్థిని ఆగ్రహం వ్యక్తంచేసింది. చెప్పు తీసి ప్రొఫెసర్ (Professor) చెంప పగులగొట్టింది. తోటి విద్యార్థులు కూడా ఆ విద్యార్థినికి మద్దతుగా ప్రొఫెసర్‌పై దాడిచేశారు. కర్ణాటక (Karnataka) లో ఇటీవల జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన 50 ఏళ్ల అబ్దుల్ మహమ్మద్ నేలమంగళలోని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. క్లాస్‌లో పాఠాలు చెబుతున్న సమయంలో ఓ 19 ఏళ్ల విద్యార్థినిని ఉద్దేశిస్తూ ప్రొఫెసర్ మాట్లాడాడు. విద్యార్థినిపై తనకున్న ప్రేమను బయటపెట్టాడు. తరగతి గదిలో అందరి ముందు ఆమెకు ‘ఐ లవ్ యూ’ చెప్పాడు. దాంతో ఆ విద్యార్థిని అభ్యంతరం వ్యక్తంచేసింది. అయినా ప్రొఫెసర్ అంతటితో ఆగలేదు.
కాలేజీ సిబ్బందిలో ఓ వ్యక్తిని పిలిచి క్లాస్‌లో అందరికీ చాక్లెట్లు పంచమని చెప్పాడు. అయితే ఆ చాక్లెట్లను తీసుకునేందుకు విద్యార్థులు నిరాకరించారు. అయితే విద్యార్థులు ఆ చాక్లెట్లను తీసుకోలేదు. ప్రొఫెసర్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. దాంతో ఆగ్రహించిన ప్రొఫెసర్ కోపంగా ఆ విద్యార్థిని దగ్గరకు వెళ్లాడు. ‘నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావు కదా..?’ అని నిలదీశాడు. ‘ఈమె నాకు ఐ లవ్ యూ చెప్పింది. ఇప్పుడు మాట మార్చింది’ అని ఆమె తోటి విద్యార్థులతో చెప్పాడు.
ఆమె తనకు ఐ లవ్ యూ చెప్పినట్లు ఆధారాలు కూడా ఉన్నాయని, సీసీ ఫుటేజీ ఆధారంగా నిరూపిస్తానని ప్రొఫెసర్ అన్నాడు. దాంతో బాధితురాలితో సహా తోటి విద్యార్థులంతా సీసీ ఫుటేజీ చూపించమని ప్రొఫెసర్‌ను డిమాండ్ చేశారు. దాంతో ప్రొఫెసర్ ‘ఈ గొడవ ఇంతటితో వదిలేద్దాం’ అని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ప్రొఫెసర్ మాట మార్చడంతో విద్యార్థులంతా అతనిపై దాడిచేశారు. బాధిత విద్యార్థిని తన చెప్పు తీసి అతని చెంప పగులగొట్టింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రొఫెసర్ అబ్దుల్ మహమ్మద్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.