సుబేదారి, ఫిబ్రవరి 24: హనుమకొండ కొత్తూరుకు చెందిన రౌడీషీటర్, కాంగ్రెస్ పార్టీ 5వ డివిజన్ కార్పొరేటర్ పోతుల శ్రీమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్ధిక లావాదేవీల విషయమై ఒకరిపై హత్యాయత్నం కేసులో శ్రీమన్‌ను ఇంటివద్దే మంగళవారం రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సరూర్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గత ఏడాది మే 22వ తేదీన నసరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతమ్నగర్కు చెందిన చీదార శ్రీనివాస్‌ను ఇంట్లోకి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారు. మాస్కులు ధరించిన ఇద్దరూ శ్రీనివాస్‌పై దాడి చేయగా అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అనతరం బాధితుడి ఫిర్యాదు మేరకు సరూర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించారు. దాడికి పాల్పడినవారిలో హనుమకొండకు చెందిన సయ్యద్ యాకుబ్ అలియాస్ షకీల్ ఉన్నట్టు గుర్తించిన పోలీసులు అతడిని విచారించారు. శ్రీనివాస్‌పై దాడి చేయించింది కార్పొరేటర్ శ్రీమాన్ అని అతడు తెలిపాడు.
బాధితుడు శ్రీనివాస్-శ్రీమన్ మధ్య రూ.35 లక్షల ఆర్థిక లావాదేవీల కారణంగా గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. శ్రీమన్పై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో గత ఆరు నెలలుగా కార్పొరేటర్ శ్రీమన్ పోలీసులకు దొరకకుడా తప్పించుకుని తిరుగుతున్నాడు. అయితే.. మంగళవారం హనుమకొండ కొత్తూరులో శ్రీమన్ ఉన్న విషయం తెలుసుకున్న సరూర్‌నగర్ పోలీసులు ఇంటికి అతడిని వచ్చి అరెస్టు చేశారు. అనంతరం అతడిని చర్లపల్లి జైలుకు తరలించినట్టు సమాచారం. శ్రీమన్పై హనుమకొండ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఉన్నట్లు హనుమకొండ పోలీసులు తెలిపారు.