హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : 22ఏ సమస్యపై ప్రభుత్వ పెద్దలు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా క్షేత్రస్థాయి పరిణామాలు మాత్రం వారి లో ఆందోళన కలిగిస్తున్నాయా? అసలు సమస్యే లేదని ఒకసారి.. పొరపాటు జరిగిందని మరోసారి చెప్పడం అందరినీ గందరగోళంలో పడేస్తున్నా రెవెన్యూ శాఖ మంత్రి మాత్రం సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారా? వాస్తవాలు ఎలా ఉన్నా.. అధికారులతోపాటు కాంగ్రెస్ నాయకులు తమ భూముల్ని కొల్లగొట్టేందుకే ఈ సమస్యను సృష్టించారని ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయా? ఇంటెలిజెన్స్ నివేదిక ఇవ న్నీ వాస్తవలేనని అంటున్నది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రభుత్వానికి నిద్రలేకుండా చేస్తున్న 22ఏ సమస్య గురించి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులపై నివేదికలు తెప్పించుకుంటున్నట్టు తెలిసింది. ప్రజలు ఏమనుకుంటున్నారు? రైతుల అభిప్రాయం ఎలా ఉన్నదనే వివరాలతోపాటు హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో జటిలంగా మారిన ఈ సమస్యపై బాధితుల మనోగతాన్ని కూ డా తాజా ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌లో పొందుపరిచినట్టు సమాచారం. అసలు రాష్ట్రం లో 22ఏ సమస్య ఎలా మొదలైందనే సమాచారాన్ని కూడా ఆ నివేదికలో వెల్లడించినట్టు సమాచారం.
ప్రభుత్వ భూ ములతోపాటు అనేక ప్రాంతాల్లో ప్రైవేట్ పట్టా భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని, ఈ ఏడాది జనవరిలోనే సమస్య బయటికి రావడం మొదలైనప్పటికీ అది క్రమంగా పెద్దదై.. ఇప్పుడు జటిలంగా మారిందని పేర్కొన్నారు. ఈ 22ఏ సమస్య క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని ఇంటెలిజెన్స్ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. ముఖ్యంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీసీఎల్ఏ లోకేశ్‌కుమార్ సమస్యను గుర్తించి, త్వరితగతిన పరిష్కరించడంలో విఫలమైనట్టు నివేదికలో పేర్కొన్నారని ప్రచారం జరుగుతున్నది. అధికారులు, కాంగ్రెస్ నేతలు తమ భూముల్ని కొల్లగొట్టేందుకే ఈ 22ఏ సమస్యను తెరపైకి తెచ్చారనే భయాందోళనలు సాధారణ బాధితుల్లో వ్యక్తమవుతున్నదని కూడా పేర్కొన్నారు.