న్యూఢిల్లీ, అక్టోబర్ 6: మేడిన్ ఇండియా ఎయిర్‌క్రాఫ్ట్ ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ క్రమంలోనే రాబోయే రెండేండ్లలో ఓ జాయింట్ వెంచర్ ద్వారా తొలి స్వదేశీ పౌర విమానాన్ని తయారుచేసి, అందుబాటులోకి తెస్తామన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మంగళవారం ఇక్కడ జరిగిన ఇండియన్ ఫౌండేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్మెంట్ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగానే భారత్‌లో పౌర విమానాల తయారీపట్ల ఆశాజనక అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అయితే ఇంతకుమించి వివరాలేవీ ఆయన చెప్పలేదు. ఇక దేశీయ పౌర విమానయాన రంగం వృద్ధిపథంలో వెళ్తున్నదని, ఎయిర్‌లైన్స్ 1,600కుపైగా విమానాలను తయారు చేయిస్తున్నాయని, ఈ ఆర్డర్ల విలువ దాదాపు 100 బిలియన్ డాలర్లపైనే ఉండొచ్చని మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
వచ్చే పదేండ్లలో 100కుపైగా కొత్త ఎయిర్‌పోర్టులు దేశవ్యాప్తంగా రానున్నాయని మంత్రి తెలియజేశారు. ప్రస్తుతం 165 విమానాశ్రయాలున్నాయని, దేశీయ ఎయిర్‌లైన్స్‌కు సుమారు 850 ఎయిర్క్రాఫ్ట్లున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధిచెందుతున్న దేశీయ పౌర విమానయాన మార్కెట్లలో భారత్ కూడా ఒకటన్న విషయాన్ని గుర్తుచేశారు. కాగా, విమానయాన రంగంలో అత్యున్నత శ్రేణి తయారీ కార్యకలాపాల కోసం నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి, నాణ్యమైన మెటీరియల్స్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని మంత్రి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
విమాన తయారీ దిగ్గజ సంస్థలు బోయింగ్, ఎయిర్‌బస్.. భారత్ నుంచి ఏటా దాదాపు 4 బిలియన్ డాలర్ల విలువైన విడిభాగాలు, సేవలను సమకూర్చుకుంటున్నాయన్న మంత్రి.. 2030కల్లా ఇది 10 బిలియన్ డాలర్లను చేరవచ్చని అంచనా వేశారు. దేశీయంగా జెట్ ఇంజిన్ల తయారీ అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నదని, అయితే ఇది కార్యరూపం దాల్చాలంటే ఇంకా సమయం పడుతుందన్నారు.
విమానయాన ఇంధన (ఏటీఎఫ్) ధరలు పెద్ద ఎత్తున పెరుగుతున్న నేపథ్యంలో ‘ఏటీఎఫ్ ధర స్థిరీకరణ నిధి’ని పునరుద్ధరించాలా? వద్దా? అనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు ఓ సీనియర్ అధికారి చెప్తున్నారు. అయితే ఎటీఎఫ్ ధరలపై పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం తీవ్రంగా ఉన్నదని, ఈ అధిక ధరలపై ఇటు ఎయిర్‌లైన్స్‌తో, అటు చమురు మార్కెటింగ్ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. కాగా, విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో దాదాపు 40 శాతం వాటా ఎటీఎఫ్దే. అయితే అమెరికా-ఇరాన్ యుద్ధం దెబ్బకు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అంతకంతకూ ఎగబాకుతున్నాయి. దీంతో ఎయిర్‌లైన్స్ లాభాలకు గండి పడుతున్నది.
ఈ క్రమంలోనే ‘ఏటీఎఫ్ ధర స్థిరీకరణ నిధి’ని పునరుద్ధరించాలా? వద్దా? అనే యోచనలో కేంద్రం పడింది. నిజానికి ఈ ఏడాది జూన్‌లో కేంద్ర కేబినెట్.. ఈ నిధిని కల్పించింది. కానీ ఎయిర్‌లైన్స్ దీన్ని వినియోగించుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. దానికిప్పుడు కాలం తీరిపోయింది. ఇక సోమవారం ఇండిగో తమ దేశ, విదేశీ విమానాల్లో ఇంధన సర్‌చార్జీని పెంచిన విషయం తెలిసిందే. మరికొన్ని సంస్థలూ ఇదే దారిలో పోవచ్చన్న అంచనాలున్నాయి. కాగా, అంతర్జాతీయ ప్రామాణిక ధరల విధానం కాకుండా ఇంధన వాస్తవ విలువ, సహేతుకమైన లాభంతో ఏటీఎఫ్ ధరలను నిర్ణయించాలని భారతీయ ఎయిర్‌లైన్స్ సమాఖ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్న సంగతి విదితమే.