టాక్సిక్ సంబంధం నిరంతరం మానసిక వేధింపులు, ఆధిపత్యం, గ్యాస్‌లైటింగ్ లేదా నిర్లక్ష్యంతో నిండి ఉంటుంది. అలాంటి బంధం ముగిసిన వెంటనే ఉపశమనం లభించినప్పటికీ దాని పరిణామాలు భావోద్వేగాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అలాంటి బంధం నుంచి బయటికి వచ్చినప్పుడు మహిళ మానసిక పరిస్థితి ఇలా ఉంటుంది.
టాక్సిక్ బంధం కలిగించిన మానసిక గాయాల నుంచి బయటపడి, పూర్వ వైభవాన్ని, ప్రశాంతతను పొందడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి.
‘నో కాంటాక్ట్’ రూల్: మానసిక ప్రశాంతతకు మొదటి మెట్టు భాగస్వామితో ఉన్న అన్ని కమ్యూనికేషన్ మార్గాలను పునరాలోచన లేకుండా మూసివేయడం. ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, సోషల్ మీడియా ట్రాకింగ్ పూర్తిగా ఆపేయాలి. పదే పదే వారి ప్రొఫైల్స్ చూడటం వల్ల ‘ట్రామా బాండ్’ మళ్లీ బలపడుతుంది.
భావోద్వేగాలను అంగీకరించడం: బాధను లేదా కోపాన్ని అణచివేయడానికి ప్రయత్నించవద్దు. ఒక బంధం ముగిసినప్పుడు బాధ, దుఃఖం కలగడం సహజమైన ప్రక్రియ. ఏడవడం, కోపాన్ని సురక్షితమైన మార్గంలో వ్యక్తపరచడం వల్ల మనసులోని భారం తగ్గుతుంది.
కాగ్నిటివ్ రీఫ్రేమింగ్: మనసులోకి వచ్చే ప్రతికూల ఆలోచనలను ప్రశ్నించి, వాటి స్థానంలో వాస్తవిక ఆలోచనలను ప్రవేశపెట్టడం. ‘నేను ఆ బంధాన్ని నిలబెట్టుకోలేకపోయాను’ అనుకునే కంటే ‘నేను నా శాయశక్తులా ప్రయత్నించాను, కానీ నా ఆత్మగౌరవం, మానసిక ఆరోగ్యం అంతకంటే ముఖ్యం’ అని అనుకోవడం.
బౌండరీస్ నిర్మించుకోవడం: మీ జీవితంలోకి ఎవరు రావచ్చు, మిమ్మల్ని ఎలా చూడాలో స్పష్టమైన సరిహద్దులు గీయడం నేర్చుకోవాలి. ‘నో’ అని చెప్పడం ఒక ఆత్మరక్షణ చర్యగా భావించాలే తప్ప నేరంగా కాదు.
రీ-డిస్కవరింగ్ సెల్ఫ్: టాక్సిక్ రిలేషన్లో ఉన్నప్పుడు సొంత ఇష్టాలు, అభిరుచులు, ఆశయాలు తుడిచిపెట్టుకుపోతాయి. మీకు నచ్చిన పాత హాబీలను మళ్లీ ప్రారంభించండి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, పుస్తకాలు చదవడం, వ్యాయామం చేయడం ద్వారా శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి, ఇవి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.
సోషల్ సపోర్ట్ నెట్వర్క్: మిమ్మల్ని అర్థం చేసుకునే, తీర్పులు ఇవ్వని కుటుంబ సభ్యులు లేదా నమ్మకమైన స్నేహితులతో సమయం గడపండి. మీ బాధను పంచుకోవడం వల్ల ఒంటరితనం తగ్గుతుంది.
ప్రొఫెషనల్ కౌన్సెలింగ్: మానసిక గాయం తీవ్రంగా ఉండి, రోజువారీ పనులపై ప్రభావం చూపుతుంటే సైకాలజిస్ట్ సాయం తీసుకోవడం చాలా అవసరం. వారు కౌన్సెలింగ్ సెషన్స్ ద్వారా ప్రతికూల ఆలోచనా విధానాలను మార్చుతారు. మైండ్‌ఫుల్‌నెస్ ఆధారిత థెరపీ ద్వారా ప్రస్తుతంలో జీవించడం నేర్పుతారు.
టాక్సిక్ సంబంధం నుంచి బయటపడటం అంటే జీవితం ముగిసిపోవడం కాదు, కొత్త జీవితానికి నూతన అధ్యాయం ప్రారంభం కావడం. ఈ కోలుకునే ప్రయాణంలో ఓర్పు చాలా అవసరం. ఒకే రోజులో అంతా మారిపోదు; రోజురోజుకూ చిన్న చిన్న మార్పులతో మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ప్రారంభించినప్పుడు, మానసిక ఆరోగ్యం పూర్వస్థితికి వస్తుంది ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. మీ ప్రశాంతత, ఆత్మగౌరవం కంటే ఏ సంబంధమూ గొప్పది కాదు.