న్యూఢిల్లీ, అక్టోబర్ 6 : హొర్ముజ్ జలసంధిలో పనామా జెండాతో ప్రయాణిస్తున్న ఎమ్టీ ఆన్ పీస్ అనే నౌకను ఒక ప్రొజక్టైల్ తాకడంతో 11 మంది భారతీయులకు గాయాలయ్యాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ ధ్రువీకరించింది. ఒమన్ తీరానికి సమీపంలో జలసంధి గుండా ప్రయాణిస్తుండగా దాడి జరిగింది. ఆ సమయంలో నౌకలో 19 మంది ఉన్నారు. అందులో 17 మంది భారతీయులు కాగా.. 12 మందికి గాయాలయ్యాయి.
ఒమన్ అధికారుల సాయంతో గాయపడ్డ వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడిని విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది. జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులను వెంటనే ఆపాలంటూ డిమాండ్ చేసింది.అంతర్జాతీయ జల మార్గాల్లో వాణిజ్య కార్యకలాపాలకు స్వేచ్ఛగా అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నది. ఈ విషయంలో సాయం చేసిన ఒమన్ అధికారులకు భారత విదేశాంగ శాఖ కృతజ్ఞతలు తెలిపింది.