స్టాక్‌హోమ్, అక్టోబర్ 6 : విశ్వం ఎలా రూపాంతరం చెందిందనే విషయంపై కీలక ఆధారాలు అందిస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్న అరుదైన న్యూట్రినో కణాల రహస్యాలను ఛేదించేందుకు చేసిన కృషికి బెల్జియం శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ హాల్జెస్కు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. న్యూట్రినోలు విద్యుత్తు ఆవేశం లేని, అత్యంత స్వల్ప ద్రవ్యరాశి కలిగిన సూక్ష్మమైన కాస్మిక్ కణాలు. అందువల్ల వాటిని గుర్తించడం చాలా కష్టం. విశ్వమంతటా అవి ఉన్నాయి. సూర్యుడి వంటి నక్షత్రాల నుంచి అవి వెలువడుతుంటాయి. ప్రతి సెకనుకు ట్రిలియన్ల కొద్దీ న్యూట్రినోలు మన శరీరాల గుండా కూడా ప్రయాణిస్తుంటాయి. ఈ రహస్యమైన ‘భూత కణాలు’ (ఘోస్ట్ పార్టికల్స్) స్వయంగా కనిపించవు. అందువల్ల అవి ఇతర పదార్థ కణాలను ఢీకొన్నప్పుడు జరిగే పరిణామాలను శాస్త్రవేత్తలు పరిశీలిస్తారు. న్యూట్రినోలు ఇతర కణాలను చాలా అరుదుగా మాత్రమే ఢీకొంటాయి. అందుకే వాటి ఢీకొనడాన్ని గుర్తించే అవకాశాలను పెంచేందుకు శాస్త్రవేత్తలు భారీ డిటెక్టర్లను నిర్మిస్తారు. అంటార్కిటికాలోని విస్తారమైన మంచును ఇలాంటి భారీ డిటెక్టర్‌గా ఉపయోగించాలనే ఆలోచనను హాల్జెస్ ప్రతిపాదించారు.
అంటార్కిటికాలో నిర్మించిన ఐస్‌క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీ ఏర్పాటులో హాల్జెస్ కీలకంగా వ్యహరించారని నోబెల్ కమిటీ తెలిపింది. ఈ పరిశీలనా కేంద్రం సుదూర గెలాక్సీల నుంచి వచ్చిన అధిక శక్తి కలిగిన న్యూట్రినోలను తొలిసారిగా గుర్తించింది. ‘అంటార్కిటికాలో నిర్వహిస్తున్న ఈ ప్రయోగం మనకు ఇంతకుముందు లేని విధంగా విశ్వాన్ని అర్థం చేసుకునే విప్లవాత్మక మార్గాన్ని అందించింది’ అని అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మైఖేల్ మెలోనీ అన్నారు. డిటెక్టర్‌లోని మంచుతో న్యూట్రినో పరస్పరం చర్య జరిపినప్పుడు ఒక చిన్న కాంతి మెరుపు ఏర్పడుతుంది. దీనిని సెన్సర్లు గుర్తిస్తాయి. పారదర్శకమైన మంచు కారణంగా ఈ అత్యంత స్వల్ప కాంతి సంకేతాలను శాస్త్రవేత్తలు సులభంగా గుర్తించగలుగుతారు. కాస్మిక్ కిరణాలు, రేడియేషన్ వంటి అంతరాయాలను తగ్గించేందుకు ఈ సెన్సార్లను సుమారు 8,200 అడుగుల లోతులో మంచులో అమర్చారు. 82 ఏండ్ల హాల్జెస్ అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిస్-మ్యాడిసన్‌తో అనుబంధం కలిగి ఉన్నారు. ఈ వర్సిటీనే ఐస్ క్యూబ్ పరిశీలనా కేంద్రాన్ని నిర్వహిస్తున్నది. విశ్వం అభివృద్ధి చెందడానికి సంబంధించిన కీలక ఆధారాలను అందించే అరుదైన న్యూట్రినోలపై పరిశోధనలో హాల్జెస్ కీలక పాత్ర పోషించారు.