ధోకాకు మూడేండ్లు.. నేటికీ నెరవేరని కాంగ్రెస్ మ్యానిఫెస్టో హామీలు
అది 2023 నవంబర్ 17. అదేరోజు కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా ‘అభయ’ పేరుతో ‘ఇందిరమ్మ రాజ్యం-ఇంటింటా సౌభాగ్యం’ ట్యాగ్‌లైన్‌తో ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో కూడిన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అన్ని హామీలను అమలు చేస్తామని ప్రకటించింది.
- 2023 నవంబర్ 17న కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల
- ఆరు గ్యారెంటీలు.. 420 హామీలతో ఓటర్లకు గాలం
- 100 రోజుల్లో అమలు చేస్తామని ఢిల్లీ నేతల గొప్పలు
- మూడేండ్లయినా మెజారిటీ హామీలకు మోక్షం కరువు
- అమలు చేసింది అరకొరే.. అటకెకించినవి మరెన్నో..
- మహిళలు, రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులకు నిరాశే
- గ్యారెంటీల గారడీ, డిక్లరేషన్ల వంచనపై జనాగ్రహం
ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల చేసి నేటితో మూడేండ్లు పూర్తయ్యాయి. అలవికాని హామీలతో అరచేతిలో స్వర్గం చూపించింది కాంగ్రెస్. ఢిల్లీ నాయకులు వచ్చి డిక్లరేషన్లు రిలీజ్ చేశారు. తాము గ్యారెంటీ అంటూ హామీల మాయను, గ్యారెంటీల గారడీని నమ్మి తెలంగాణ మోసపోయింది. వందరోజుల్లో నెరవేరుస్తామన్న హామీలు నేటికీ అతీగతీ లేవు.
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : అది 2023 నవంబర్ 17. అదేరోజు కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా ‘అభయ’ పేరుతో ‘ఇందిరమ్మ రాజ్యం-ఇంటింటా సౌభాగ్యం’ ట్యాగ్‌లైన్‌తో ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో కూడిన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అన్ని హామీలను అమలు చేస్తామని ప్రకటించింది. కానీ, మూడేండ్లు గడుస్తున్నా.. నేటికీ అమలు కాలేదు. మ్యానిఫెస్టో ధోకాకు మంగళవారంతో మూడేండ్లు నిండనున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి సర్కార్ రాష్ట్ర ప్రజలను నమ్మించి వంచించిన తీరుపై చర్చ జరుగుతున్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి క్యాబినెట్ సమావేశంలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించి, కచ్చితంగా అమలయ్యేలా చూస్తామని నాడు హామీలిచ్చారు. కానీ, నేటికీ ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించలేదు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే హామీలను అమలు చేయించే బాధ్యత తమదేనని ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ స్వయంగా పలుమార్లు తెలంగాణకు వచ్చి హామీలిచ్చారు. కానీ, ఇప్పుడు వారి మాటకు కూడా విలువ లేకుండా పోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజల ఆశలే పెట్టుబడిగా.. ఆరు గ్యారెంటీల గాలం
ప్రజల ఆశలను పెట్టుబడిగా మార్చుకొని అధికార పీఠాన్ని అధిష్ఠించిన కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలును తుంగలో తొక్కుతున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘అభయహస్తం’ పేరుతో ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. వాటికితోడు రైతు, యువజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ డిక్లరేషన్ల ద్వారా అనేక హామీలు గుప్పించింది. రైతులకు రుణమాఫీ, ఎకరాకు రూ.15 వేల పెట్టుబడి సాయం, కౌలు రైతులకు ఆర్థిక భరోసా, మహిళలకు నెలవారీ ఆర్థిక సాయం, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పింఛన్లు, యువతకు ఉద్యోగాలు, విద్యార్థులకు విద్యా భరోసా కార్డులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించేలా హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో పదేపదే ప్రకటించింది.
దీంతో ఆయా పథకాలకు ఆకర్షితులైన వారు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. కానీ, అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నిజరూపం బయటపడింది. అవన్నీ చిత్తశుద్ధిలేని హామీలని, అధికారం కోసం వేసిన గాలమని ప్రజలకు అర్థమవుతున్నది. ఒకో హామీకి ఒకో మెలిక పెడుతూ కాలం వెళ్లదీస్తున్నది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీల్లో అనేకం ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. మ్యానిఫెస్టోలోని హామీలను నమ్మి ఓట్లేసిన ప్రజలకు ఇప్పుడు ఎదురుచూపులే మిగులుతున్నాయి. మెజారిటీ కీలక హామీలు పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు. ఎన్నికల ముందు 100 రోజుల గడువు విధించిన పార్టీ.. ఇప్పుడు ఒకో హామీకి కొత్త నిబంధనలు, ఆర్థిక పరిమితులు, విడతల పేరుతో కాలయాపన చేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
100 రోజుల మాట.. మూడేైండ్లెనా అమలేది?
తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించింది. కానీ, మూడేండ్లు అయినా అమలుకు నోచుకోవడం లేదు. మ్యానిఫెస్టోలో 420 హామీలను ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి నాలుగు హామీలనైనా పూర్తిగా అమలు చేయడం లేదన్న విమర్శలున్నాయి. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మినహా ఏ పథకం కూడా పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు కురిపించిన కీలకమైన హామీలనే ప్రభుత్వం పక్కన పెట్టడం గమనార్హం. మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 ఆర్థిక సహాయం, కళ్యాణలక్ష్మీ పథకం కింద రూ.లక్షతోపాటు తులం బంగారం, పింఛన్ల పెంపు, విద్యార్థులకు విద్యాభరోసా కార్డులు, 2 లక్షల ఉద్యోగాల కల్పన.. ఇలా ఎన్నో హామీలను ప్రభుత్వం అమలు చేయకుండా విస్మరించింది. ఈ ప్రభుత్వానికి ఇంకా మిగిలింది రెండేండ్ల కాలమే.. ఈ రెండేండ్లలో కీలకమైన హామీలను అమలు చేస్తుందనే నమ్మకం కూడా ప్రజల్లో లేదు.
మహిళల ఖాతాల్లో రూ.2,500 ఏవి?
మహాలక్ష్మీ పథకం కింద ప్రతి మహిళకూ నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఈ సాయం ఉపయోగపడుతుందని ఎన్నికల ప్రచారంలో విసృ్తతంగా ప్రచారం చేసింది. దీంతో మహిళలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ, కాంగ్రెస్ సర్కార్ ఈ కీలక హామీని విస్మరించింది. ఈ పథకాన్ని అమలు చేసే ఆలోచన కూడా చేయడంలేదు. ఎక్కడా ఈ పథకం ఊసెత్తడంలేదు.

రైతు భరోసాలో కోతలు
రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకూ ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కౌలు రైతులకు కూడా రైతులతో సమానంగా ఎకరానికి రూ.15 వేల చొప్పున అందిస్తామని ప్రకటించింది. కూలీలకు సైతం ఏడాదికి రూ. 12వేలు ఇస్తామని ఆశ పెట్టింది. ఈ మేరకు రైతు డిక్లరేషన్‌ను ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా సాయాన్ని ఎకరాకు రూ.12 వేలకే పరిమితం చేసింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన రూ.15 వేల హామీకి రూ.3 వేల కోత పెట్టింది. అది కూడా నాలుగుసార్లు ఎగ్గొట్టింది. కౌలు రైతులు, కూలీలకు మొండిచేయి చూపింది. కొన్ని రకాల సన్నవడ్లకు మాత్రమే క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తుండటంతో దొడ్డు వడ్లు పండించే రైతులకు ఈ ప్రయోజనం అందడం లేదు. పంటల బీమా కూడా అమలుకు నోచుకోలేదు.
పింఛన్ల పెంపేది?
వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, దివ్యాంగులకు చేయూత పథకం కింద పింఛన్లను భారీగా పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. వృద్ధులు, వితంతువులకు కేసీఆర్ సర్కార్ ఇచ్చిన రూ.2,016 పింఛన్‌ను రూ.4 వేలకు, దివ్యాంగులకు రూ.4,016 నుంచి రూ.6 వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది. కానీ, ఇవేవీ అమలుకు నోచుకోవడంలేదు. పెంపు సంగతి పక్కనపెడితే కొత్త లబ్ధిదారులను నమోదు చేసేందుకు సైతం ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలేదనే విమర్శలున్నాయి.
తులం బంగారం ఏమాయె?
పేదింటి ఆడపిల్ల పెండ్లి తల్లిదండ్రులకు ఆర్థిక భారంగా మారకుండా చూస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇందిరమ్మ బహుమతి పథకం కింద అర్హులైన పేద కుటుంబాల ఆడపిల్లల పెండ్లికి రూ.లక్ష ఆర్థిక సాయంతోపాటు 10 గ్రాముల బంగారం అందిస్తామని ప్రకటించింది. ఈ హామీ కూడా ప్రజల్లోకి బాగా వెళ్లింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తులం బంగారం వస్తుందేమోనని ఆశపడ్డారు. కానీ, వారి ఆశలు అడియాశలే అయ్యాయి. తులం బంగారం హామీ అమలుకు నోచుకోలేదు.
యువతకు ఉద్యోగాలేవి?
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి ఇస్తామని, విద్యార్థులకు రూ.5 లక్షల వడ్డీలేని విద్యాభరోసా కార్డులు అందిస్తామని హామీ ఇచ్చింది. ప్రతి మండలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాసంస్థలు ఏర్పాటుచేస్తామని ప్రకటించింది. ఏకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అశోక్‌నగర్ చౌరస్తాకు వెళ్లి అక్కడి నిరుద్యోగులతో ముచ్చటించి వారికి హామీ ఇచ్చారు. కానీ, రాహుల్‌గాంధీ మాటలు నీటి మూటలుగా మారాయి. బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్లను తన ఖాతాలో వేసుకున్న రేవంత్‌రెడ్డి సర్కార్.. సొంతంగా నోటిఫికేషన్లు ఇచ్చిన భర్తీ చేసిన ఉద్యోగాలు కేవలం 16వేల లోపే ఉండటం గమనార్హం. జాబ్ క్యాలెండర్ సైతం అటకెక్కింది.
రుణమాఫీ.. ధోకా
రైతులకు రైతుభరోసాలో కోతలతో ధోకా ఇచ్చిన కాంగ్రెస్ రుణమాఫీలోనూ మోసం చేసిందనే విమర్శలున్నాయి. అధికారంలోకి రాగానే ప్రతి రైతుకూ రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన కుటుంబం మొత్తానికి కలిపి రూ.2 లక్షలంటూ మెలికపెట్టింది. 42 లక్షల మందికి రూ.31 వేల కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉండగా, ప్రభుత్వం మాత్రం కేవలం 25.35 లక్షల మందికి రూ.20,677 కోట్ల మేర రుణమాఫీ చేసి మిగిలిన రైతులకు మొండి చేయి చూపింది. అర్హత ఉన్నప్పటికీ చాలామంది రైతులకు రుణాలు మాఫీ కాలేదు. దీంతో ఆయా రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

