నెలలు నిండకుండా పుట్టడం కన్నా.. స్క్రీన్ టైమ్తోనే పిల్లల్లో ఎక్కువ సమస్యలు కనిపిస్తున్నాయట. డిజిటల్ తెరకు అతుక్కుపోయే పిల్లలు.. చదువులో రాణించడం, భాషా నైపుణ్యాలు పెంచుకోవడంలో బాగా వెనకబడుతున్నారట. వారి మానసిక ఆరోగ్యం, భావోద్వేగాలు, ప్రవర్తన కూడా ఆందోళనకరంగా మారుతున్నదట. తాజాగా, ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఓ భారీ అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రముఖ జర్నల్ ‘జమా పీడియాట్రిక్స్’లో ఈ నివేదిక ప్రచురితమైంది. ఇందులో భాగంగా.. 64 దేశాల్లోని 28 లక్షల మంది పిల్లలకు సంబంధించిన డేటాను పరిశోధకులు విశ్లేషించారు. వారి విద్యాపరమైన విజయాలు, మానసిక సమస్యలు లాంటి వివిధ అంశాలను క్షుణ్నంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా పలు ఆందోళనకరమైన విషయాలను గుర్తించారు. ముఖ్యంగా గేమింగ్, సోషల్ మీడియా స్క్రోలింగ్, వీడియో స్ట్రీమింగ్ లాంటి వాటికి ఎక్కువ సమయం కేటాయించడం వల్ల పిల్లల్లో అకాడమిక్ ప్రతిభ గణనీయంగా తగ్గిపోతున్నదని పరిశోధకులు వెల్లడించారు. వారి భాషా వికాసంలోనూ సమస్యలు తలెత్తుతాయని చెప్పుకొచ్చారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి, పేరెంటింగ్ బిహేవియర్, ప్రీమెచ్యూర్ బర్త్ లాంటి ఇతర ప్రధాన కారకాలతో పోలిస్తే.. పిల్లల మానసిక పరిస్థితిపై వారి స్క్రీన్టైమ్ ప్రభావమే ఎక్కువగా ఉన్నదని తేల్చారు. ఎప్పుడూ డిజిటల్ తెరపైనే గడిపే పిల్లల్లో డిప్రెషన్, ఆందోళన, దూకుడు స్వభావం, ఏకాగ్రత లోపం, తోటివారితో సమస్యలు కూడా అధికంగా కనిపిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. స్క్రీన్ టైమ్ అనేది అందరూ అనుకున్నదాని కన్నా ఎక్కువగా పిల్లలపై ప్రభావం చూపుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. కాబట్టి, ఈ విషయంలో తల్లిదండ్రులు మరింత కఠినంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.