ప్రతి మనిషిలోనూ ఒక సృష్టికర్త దాగి ఉన్నాడు. ఇది కేవలం ఏదో కవిత్వంలో చెప్పే ఒక అందమైన మాట కాదు.. మానవ నైజంలోనే ఉన్న ప్రాథమికమైన సత్యం. మనం ‘సృష్టికర్త’ అనగానే కేవలం బొమ్మలు గీసే చిత్రకారులనో, కవితలు రాసే కవులనో లేక సంగీతం సమకూర్చే సంగీత దర్శకులనో అనుకుంటాం. కానీ, సృష్టి అంటే కేవలం కళలు మాత్రమే కాదు. ఆలోచనలను ఆచరణలోకి తెచ్చి, ఏదీ లేని చోట ఒక కొత్తదాన్ని నిర్మించే ప్రతీ చర్య సృష్టి కిందకే వస్తుంది.
‘భావాలకు, ఆలోచనలకు ఎప్పటికీ నవయవ్వనమ’నే భావనను ఆధ్యాత్మిక కోణంలో చూస్తే, అది కేవలం మనస్తత్వానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఆత్మస్వరూప అనుభూతికి, జీవన్ముక్తికి దారితీసే ఒక గొప్ప సాధన. ఈ భౌతిక జగత్తులో పుట్టిన ప్రతి జీవికి మార్పు తప్పనిసరి. ‘జాతస్య హి ధ్రువో మృత్యుః’ అన్నట్లు, కాలక్రమంలో శరీరం శిథిలం కావడం, వృద్ధాప్యానికి గురవ్వడం ప్రకృతి నైజం. అయితే మన శాస్ర్తాలు, వేదాంతం శరీరాన్ని ‘అనిత్యం’ అని, దానిలో ఉండే చైతన్యాన్ని (ఆత్మను) ‘నిత్యం’ అని చెబుతాయి. శరీరం ముసలిదవుతుంది కానీ, చైతన్యానికి ముసలితనం ఉండదు. ఆ చైతన్య గుణాలైన ఉత్సాహం, జిజ్ఞాస, ప్రేమలకు వృద్ధాప్యం రాకుండా చూసుకోవడమే ఆధ్యాత్మిక యవ్వనం.
రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒక సమస్యకు ఒక కొత్త పరిష్కారం వెతకడం కూడా ఒక సృష్టే. ఒక ఇల్లాలు వంటగదిలో కొత్త రుచిని ప్రయత్నించడం, ఒక రైతు పంట తెగులును నివారించడానికి ఒక కొత్త ఆలోచన చేయడం ఇవన్నీ సృజనాత్మకతకు సంకేతాలే. ప్రతి ఒక్కరి జీవితంలోనూ అనేక అనుభవాలు ఉంటాయి. మనం ఒక సంఘటనను ఇంకొకరికి వర్ణించి చెప్పేటప్పుడు, అందులో మన భావోద్వేగాలను, ఊహలను జోడిస్తాం. అక్కడే మనలోని ఒక కథకుడు లేదా రచయిత రూపుదిద్దుకుంటాడు. ఒక కుటుంబాన్ని చక్కదిద్దుకోవడం, పిల్లలను మంచి మార్గంలో తీర్చిదిద్దడం లేదా మన చుట్టూ ఉన్న పరిసరాలను మరింత అందంగా, సురక్షితంగా మార్చుకోవడం.. ఇవన్నీ మన సొంత ప్రపంచాన్ని మనం నిర్మించుకోవడమే. చాలామంది ‘ఎటువంటి కళలూ రావు, నేను సృష్టికర్తను ఎలా అవుతాన’నుకుంటారు. కానీ, సృష్టికి కావలసింది నైపుణ్యాల కంటే ముందు పరిశీలన, కుతూహలం, మార్పు తీసుకురావాలనే ఆరాటం. ‘చేసేది అందంగా ఉంటుందో లేదో, ఎదుటివారు ఏమనుకుంటార’నే భయాన్ని పక్కన పెట్టినప్పుడే సృజనాత్మకత బయటికి వస్తుంది. ఆలోచనను కాగితం మీద పెట్టడం, మాటల్లో చెప్పడం లేదా చేతల్లో చూపించడం. మన చుట్టూ ఉన్న మనుషులను, లోకాన్ని లోతుగా గమనించడం మనలోని సృష్టికర్తను నిద్రలేపడానికి మూడు ముఖ్యమైన అడుగులు.
కాలంతో పాటు శరీరం శిథిలమైనా, మనసును, ఆలోచనలను నిత్యనూతనంగా ఉంచుకోవడమే నిజమైన జీవిత పరమార్థం. ఎప్పుడైతే మనం ‘నిత్య విద్యార్థి’గా ఉంటామో, అప్పుడు జ్ఞాన దాహం మనసును ఎప్పుడూ చైతన్యవంతంగా ఉంచుతుంది. పాత జ్ఞాపకాల్లోనే ఉండిపోవడం కంటే, వర్తమానంలో వస్తున్న మార్పులను, సాంకేతికతను లేదా కొత్త ఆలోచనలను స్వాగతించడం వల్ల బంధాలు, అనుబంధాలు కూడా దృఢపడతాయి. కళలు, సాహిత్యం, రచనలు లేదా ఏదైనా సృజనాత్మక పని మనసులోని ఉత్సాహాన్ని ఎప్పటికీ చావనివ్వవు. ఒక సృష్టికర్తకు లేదా కళాకారుడికి ప్రకృతిలోని ప్రతి దృశ్యం, జీవితంలోని ప్రతి అనుభవం కొత్తగానే కనిపిస్తాయి.
అన్ని మతాల్లోనూ, వేదాంతంలోనూ ‘బాల భావానికి’ అత్యున్నత స్థానం ఉంది. పసిపిల్లలలో అహంకారం, కల్మషం ఉండవు. ప్రతీ చిన్న విషయాన్ని ఆశ్చర్యంతో, అమాయకత్వంతో చూస్తారు. అమాయకత్వం, కుతూహలం, ప్రతి చిన్న విషయానికీ ఆశ్చర్యపోయే గుణం పిల్లల్లో ఎక్కువగా ఉంటాయి. మనలోని ఆ చిన్నారిని బతికించుకున్నప్పుడు జీవితం భారం అనిపించదు, ఒక అందమైన ప్రయాణంగా మారుతుంది.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆత్మను వర్ణిస్తూ ‘న జాయతే మ్రియతే వా కదాచిత్’ ఆత్మకు జనన మరణాలు గానీ, వికారాలు గానీ ఉండవని తెలిపాడు. మనం కేవలం ఈ శరీరమే అని అనుకున్నప్పుడు మాత్రమే ‘ముసలివాడిని అయ్యాన’నే బాధ కలుగుతుంది. కానీ, నాలోని చైతన్యం అజరం, అమరం అని గుర్తించినప్పుడు ఆలోచనల్లో ఒక అద్భుతమైన నవయవ్వనం, ఆనందం వెల్లివిరుస్తాయి. బ్రహ్మసూత్రాలు ‘అథాతో బ్రహ్మజిజ్ఞాస’ (తెలుసుకోవాలనే తపన) వాక్యంతో ప్రారంభమవుతాయి. ఆధ్యాత్మిక ప్రయాణంలో వయసుతో నిమిత్తం లేదు. అన్నీ తెలుసనుకోవడం అజ్ఞానానికి, భావాల వృద్ధాప్యానికి సంకేతం. ‘తెలుసుకోవాల్సింది ఎంతో ఉంద’ని అనుకోవడమే నిత్య జ్ఞానాన్వేషణ. ఈ ‘జిజ్ఞాస’ ఉన్నంత కాలం సాధకుడి మెదడు, మనసు ఎప్పుడూ చైతన్యవంతంగానే ఉంటాయి. వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. ఆలోచనల్లో ఉత్సాహం ఉన్నంతవరకు ప్రతీ రోజూ ఒక నూతన అధ్యాయమే!