Measles Cases : అగ్రరాజ్యం అమెరికాలో మీజిల్స్ వ్యాధి విజృంభిస్తోంది. ఇటీవలి కాలంలో పెన్సిల్వేనియా రాష్ట్రంలో 1,000కిపైగా మీజిల్స్ కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల్లోనూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఈ అంశంపై అమెరికా ఆందోళన చెందుతోంది. పెన్సిల్వేనియాకు పొరుగునే ఉన్న న్యూయార్క్ కూడా డిజాస్టర్ ఎమర్జెన్సీ ప్రకటించింది. 1990 తర్వాత అమెరికాలో మీజిల్స్ వ్యాధి విజృంభించడం ఇదే మొదటిసారి.
మీజిల్స్ వ్యాధి విజృంభణకు సంబంధించిన వివరాల్ని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) తాజాగా వెల్లడించింది. దీని ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు అమెరికాలో 3,869 మీజిల్స్ కేసులు నమోదయ్యాయి. 1990-91 తర్వాత ఈ స్తాయిలో అమెరికాలో ఈ ఏడాది మాత్రమే మీజిల్స్ వ్యాధి ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది ఏప్రిల్లో తొలిసారిగా ఫిలడెల్ఫియాలో మీజిల్స్ వ్యాధి మొదట సోకింది. అక్కడే ఇప్పటివరకు దాదాపు 200 మందికిపైగా ఈ వ్యాధి బారినపడ్డారు. ఈ వ్యాధి సోకిన వారిలో ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకోని వారే. పెన్సిల్వేనియాలో ఇప్పటివరకు వెయ్యి మందికిపైగా ఈ వ్యాధి బారినపడ్డారు.
దీంతో పక్కనే న్యూయార్క్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నెల మొత్తం డిజాస్టర్ ఎమర్జెన్సీ ప్రకటించారు. మీజిల్స్ వ్యాధి నివారణ, గుర్తింపు, అవగామన కార్యక్రమాలు చేపడుతున్నారు. న్యూయార్క్ సిటీ కాకుండా న్యూయార్క్ రాష్ట్రవ్యాప్తంగా 100కుపైగా కేసులు నమోదయ్యాయి. దీంతో భారీ ఎత్తున వ్యాక్సినేషన్ కూడా చేపడుతున్నారు. టెక్సాస్, సౌత్ కరోలినా, ఉతా వంటి రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదవుతున్నాయి. ఈ వ్యాధి సోకితే జ్వరం, దగ్గు, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా ఈ వ్యాధికి గురువుతారు. మీజిల్స్ సోకకుండా ఉండాలంటే వ్యాక్సిన్ తీసుకోవాలి.