న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టులో విజయవంతమైన కెప్టెన్‌గా పేరొందిన హర్మన్‌ప్రీత్ కౌర్ అన్ని ఫార్మాట్ల నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోగా.. ఆమె స్థానంలో కొత్త సారథిగా స్మృతి మంధానను బీసీసీఐ ఎంపిక చేసింది. మంగళవారం గువాహటిలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశం తర్వాత హర్మన్ తన నిర్ణయాన్ని ఇన్స్టాగ్రామ్ పోస్టు ద్వారా వెల్లడించింది. ఈ సమావేశంలో హెడ్ కోచ్ అమోల్ మజుందార్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కూడా పాల్గొన్నారు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా ఆటపై తనకున్న ప్రేమ తగ్గబోదని, ఇకపై ఓ ప్లేయర్‌గా అన్ని ఫార్మాట్లలో కొనసాగుతానని కౌర్ స్పష్టం చేసింది.
‘కెప్టెన్‌గా నా బాధ్యత ముగిసింది. జట్టు కోసం నా శక్తినంతటినీ ధారపోశాను. నా వ్యక్తిగత రికార్డులు, లక్ష్యాలను పక్కన పెట్టి ఎల్లప్పుడూ జట్టు ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం ఇచ్చాను. కెప్టెన్సీ ముగిసినంత మాత్రాన భారత క్రికెట్ పట్ల నాకున్న ప్రేమ తగ్గదు. కేవలం ఆటపై ఉన్న మక్కువతో మైదానంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాను‘ అని భావోద్వేగంగా రాసుకొచ్చింది. 2016లో టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హర్మన్‌ప్రీత్, 2022లో వన్డేలకు, 2023లో అన్ని ఫార్మాట్లకు సారథిగా ఎంపికైంది. ఆమె నాయకత్వంలోనే గతేడాది తొలిసారి వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన భారత్ వరుసగా రెండోసారి ఆసియా క్రీడల్లో పసిడి పతకం గెలిచింది. మొత్తంగా హర్మన్ 5 టెస్టులు, 51 వన్డేలు, 155 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించింది.అయితే కొంతకాలంగా తను బ్యాటర్‌గా తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఇటీవలి టీ20 ప్రపంచ కప్‌లో భారత్ కనీసం సెమీఫైనల్ చేరలేకపోవడంతో ఆమెపై విమర్శలు వచ్చాయి.
హర్మన్ తప్పుకోవడంతో ఊహించినట్టుగానే వైస్ కెప్టెన్ మంధానకే సారథ్య బాధ్యతలు దక్కాయి. డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ జట్టును రెండు సార్లు విజేతగా నిలిపిన మంధాన ఇప్పటికే తన నాయకత్వ ప్రతిభను నిరూపించుకుంది. దేశానికి నాయకత్వం వహించే అవకాశం రావడం చాలా ప్రత్యేకమైన గౌరవమని మంధాన చెప్పింది. స్వదేశంలో ఈ నెల 16వ తేదీ నుంచి జరిగే మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో మంధాన కెప్టెన్సీలో భారత్ బరిలోకి దిగనుంది. రెండు సిరీస్‌ల్లో పాల్గొనే జట్లనుఎంపిక చేసిన సెలెక్టర్లు టీ20ల్లో షెఫాలీకి, వన్డేల్లో దీప్తి శర్మకు వైస్ కెప్టెన్సీ అప్పగించారు.