లూసాన్ (స్విట్జర్లాండ్): ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం భారత్ గట్టిగా ప్రయత్నిస్తోంది. 2036 ఒలింపిక్స్ నిర్వహించేందుకు భారత్ సహా మొత్తం ఏడు దేశాలు అధికారికంగా ఆసక్తి కనబరిచాయని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) మంగళవారం వెల్లడించింది. ఈ ఏడు దేశాలు తమ గేమ్స్ ప్రాజెక్టులను నవంబర్లో ఐఓసీకి చెందిన ఫ్యూచర్ హోస్ట్ కమిషన్ ఎదుట ప్రదర్శించాలని ఆహ్వానించినట్లు పేర్కొంది. భారత్ పాటు జర్మనీ, హంగేరీ, ఖతార్, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, తుర్కియే పోటీలో ఉన్నాయి.
భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ).. గుజరాత్ ప్రభుత్వం, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖల సమన్వయంతో అహ్మదాబాద్ నగరాన్ని వేదికగా ప్రతిపాదించింది. కాగా, నవంబర్లో జరిగే ప్రెజెంటేషన్లలో ప్రతిపాదిత వేదికల మాస్టర్ ప్లాన్, అథ్లెట్లకు కల్పించే సదుపాయాలు, నిధుల సేకరణ వ్యూహం, రాజకీయ-ప్రజా మద్దతు, నిర్వహణా సామర్థ్యం వంటి అంశాలను ఐఓసీ సమగ్రంగా పరిశీలిస్తుంది. 2029లో 2036 ఒలింపిక్స్ ఆతిథ్య నగర అధికారిక ప్రకటన చేయనుంది.