రాంచీ, అక్టోబర్ 6 : సంకల్పం బలంగా ఉంటే ఎంత కష్టతరమైన లక్ష్యమైనా చిన్నబోవాల్సిందేనని రుజువు చేసింది జార్ఖండ్‌కు చెందిన ఒక వితంతు మహిళ. ఇద్దరు పిల్లలు, అత్త్తామామలను పోషించాలంటే ఎలాగైనా హోంగార్డు ఉద్యోగాన్ని సాధించి తీరాలన్న తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంది. కనీసం స్పోర్ట్స్ షూ, ట్రాక్ సూట్ కూడా కొనలేని పేదరికంలో చీరతోనే చెప్పులు లేకుండా మండుటెండలో 1600 మీటర్ల దూరాన్ని కేవలం ఆరు నిమిషాల్లో పూర్తి చేసి భేష్ అన్పించుకుంది. రామ్‌గర్ దుల్మీ బ్లాక్ సోసో గ్రామానికి చెందిన కవితా కుమారి రామ్‌గర్‌లో జరిగిన హోంగార్డు నియామక ఫిజికల్ టెస్ట్‌కు హాజరైంది. 10 నిమిషాల్లో పూర్తి చేయాల్సిన 1600 మీటర్ల రన్‌ను ఆరు నిమిషాల్లోనే పూర్తి చేసింది.
కాళ్లకు చెప్పులు లేకుండా ఒట్టికాళ్లతో చీరతోనే రన్నింగ్ చేస్తున్న ఆమె వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఆమె స్ఫూర్తి, పట్టుదలను అందరూ మెచ్చుకుంటున్నారు. స్థానిక రన్నింగ్ అకాడమీ అధికారులు ఇంటికి వెళ్లి అమెను సన్మానించారు. తన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే హోంగార్డు ఉద్యోగం పొందడమొక్కటే మార్గమని తలచి దాని ఎంపిక కోసం ప్రతి రోజూ ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి రన్నింగ్ ప్రాక్టీస్ చేసినట్టు ఆమె తెలిపింది. చెప్పులు, ట్రాక్‌సూట్ కొనే ఆర్థిక పరిస్థితి తనకు లేదని చెప్పింది. 284 హోంగార్డుల ఉద్యోగాలకు జరిగిన ఈ రిక్రూట్మెంట్లో 50 శాతం మహిళలకు కేటాయించారు. అందులో 5 శాతం వితంతువులకు, విడాకులు పొందిన మహిళలకు కేటాయించారు.