Ramayana | భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రాల్లో ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’ ఒకటి. నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మహాకావ్య చిత్రంలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ వంటి అగ్రతారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్, అంతర్జాతీయ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా విడుదలకు దాదాపు నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇప్పుడు మరో విషయం చర్చనీయాంశంగా మారింది. ఇంతటి భారీ చిత్రానికి తగ్గ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు మాత్రం ఇప్పటివరకు ప్రారంభం కాకపోవడం అభిమానులను, సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
సాధారణంగా ఇలాంటి భారీ చిత్రాలకు విడుదలకు చాలా వారాల ముందే ప్రచారాన్ని వేగవంతం చేస్తారు. టీజర్లు, పాటలు, ట్రైలర్, ప్రత్యేక కార్యక్రమాలు, నటీనటుల ప్రచార కార్యక్రమాలతో సినిమాపై అంచనాలను మరింత పెంచుతారు. కానీ ‘రామాయణ’ విషయంలో ఇప్పటివరకు పెద్దగా ప్రచారం చేసినట్టు కనిపించడం లేదు. దీని వెనుక చిత్రబృందం ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తోందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే కొద్ది రోజుల తర్వాత ట్రైలర్, పాటలు, భారీ ప్రచార కార్యక్రమాలను వరుసగా విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని ఒక్కసారిగా పెంచాలని మేకర్స్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వ్యూహం కొంత రిస్క్‌తో కూడుకున్నదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇలాంటి భారీ చిత్రానికి ప్రేక్షకుల్లో అవగాహన పెంచడం, అంతర్జాతీయ మార్కెట్లలో ఆసక్తిని పెంచడం, విడుదలకు ముందు భారీ అంచనాలను కొనసాగించడం కోసం కొంత సమయం అవసరం. ముఖ్యంగా ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో ప్రచారంలో ఆలస్యం ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
‘రామాయణ’ను అంతర్జాతీయ స్థాయిలో భారీ దృశ్యకావ్యంగా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ముఖ్యంగా ఐమ్యాక్స్, ప్రీమియం లార్జ్ ఫార్మాట్ వంటి భారీ తెరలపై సినిమాను ప్రేక్షకులకు అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే నవంబర్‌లో అదే సమయంలో ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ కూడా విడుదల కానుండటంతో విదేశీ మార్కెట్లలో ప్రీమియం స్క్రీన్ల కోసం పోటీ ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐమ్యాక్స్ వంటి పరిమిత సంఖ్యలో ఉన్న ప్రత్యేక తెరల విషయంలో రెండు భారీ చిత్రాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వస్తే థియేటర్ల కేటాయింపుపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.ఈ నేపథ్యంలో కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో ‘రామాయణ’ విడుదలను నవంబర్ 5కు ముందుకు తీసుకురావాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇలా చేయడం ద్వారా ‘గాడ్జిల్లా మైనస్ జీరో’తో నేరుగా ఎదురుపడే పరిస్థితిని కొంతవరకు నివారించవచ్చనే అంచనాలు ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..!