ఎండ పొద్దెక్కింది. పసుపు, కాషాయ రంగుల్లో పోలీస్ స్టేషన్ పెద్దపులిలా గంభీరంగా ఉంది. లోపల రైటర్, ఇద్దరు పోలీసులు ఏదో పని చేసుకుంటున్నారు. పనిమనిషి స్టేషన్ శుభ్రం చేసి రైటర్‌కు చెప్పి వెళ్లిపోయింది. కంట్రోల్ రూంలో వైర్లెస్ సెట్లలోంచి సమాచారం ప్రవాహంలా వస్తోంది. వరండాలో తాటిమానులా నల్లగా ఉన్న సెంట్రీ కుర్చీలో కూర్చుని అటూ ఇటూ చూస్తున్నాడు. స్టేషన్ భవనంపైన మువ్వన్నెల జెండా రంగులు వెలసి, చివికిపోయి దేశ ప్రజాస్వామ్యానికి ప్రతీకలా ఉంది. పంద్రాగష్టుకు కట్టిన తోరణాలు చిరిగి వేలాడుతున్నాయి. ఆవరణలో రావిచెట్టు ఆకులు ఊసులు చెబుతున్నట్లు గాలికి సవ్వడి చేస్తున్నాయి. చెట్టు కింద ప్రహరీ వారగా పట్టుబడ్డ ద్విచక్ర వాహనాలుతుప్పుపట్టి, దుమ్ముకొట్టుకుని చిందరవందరగా ఉన్నాయి. వాటినిండా పిట్టల రెట్టలు ఎండి కనిపిస్తున్నాయి. గేటుకు ఆ పక్కన మొగుడు-పెళ్లాలు గొడవ పడుతున్నారు. పెద్దపెద్దగా అరుచుకుంటున్నారు.
“ఏయ్ మీకే చెప్పేది. ఎంటా గోల? పోండవతలకు”.సెంట్రీ అరిచాడు. ఇద్దరూ నోరుమూసుకున్నారు. రావిచెట్టు కింద బెంచీమీద ఎల్లి దిగులు కుండలా కూర్చునుంది.నేరేడు రంగు, మీనాల్లాంటి కళ్లు, తీరైన ముక్కు, విచ్చుకున్న పూరేకుల్లాంటి పెదాలు, గుండ్రటి ముఖం, నునుపైన దేహంతో అడవి పువ్వులా ఎవర్నైనా ఇట్టే ఆకర్షిస్తుంది ఎల్లి.సెంట్రీ మాటి మాటికీ ఎల్లిని క్రీగంట ఆశగా చూస్తున్నాడు.కొంగు కప్పి చంటాడికి పాలు కుడుపుతూ, తాను దుఃఖాన్ని తాగుతూ ఎటో చూస్తోంది. రాత్రంతా ఏడ్చిందేమో కళ్లు ఉబ్బి ఉన్నాయి. చెంపల నిండా ఎండిన కన్నీటి చారికలు కనిపిస్తున్నాయి. వెంట్రుకల పాయ ముఖంమీద తీగలా వేలాడుతోంది. పదే పదే దాన్ని చేత్తో పైకనుకుంటోంది.
పొద్దు పొద్దున్నే స్టేషనుకొచ్చింది తను. లోపలెవరో ఎస్సైగారు వచ్చాక రమ్మని చెప్పడంతో, చంటాడ్ని తీసుకుని బైటకొచ్చి కూర్చుంది. ఎల్లి మనసంతా తుఫాను తీరం దాటేటప్పుడు సంద్రంలా అల్లకల్లోలంగా ఉంది. నిన్న సాయంత్రం జరిగిన సంఘటన గుర్తొచ్చింది.
నిన్న సాయంత్రం రోజుట్లాగే పొలం దగ్గర వాళ్లుంటున్న గుడారం ముందు రాళ్లపొయ్యి మీద అన్నం వండుతోంది. చంటాడు నేలమీద పరిచిన బొంతమీద ఆడుకుంటున్నాడు.
కాసేపటికి ఆమె పెనిమిటి దుర్గారావు పొలం దగ్గర ఎలుక బుట్టలు పెట్టి వచ్చాడు. కాళ్లు, చేతులు కడుక్కుని చంటాడితో ఆడుకుంటున్నాడు. పొయ్యిలో మంట వెలుగుల్లో చీకటి స్పష్టంగా కనిపిస్తోంది.
దుమ్ము లేపుకొంటూ, డుగ్…. డుగ్ మంటూ శబ్దం చేస్తూ బైక్ వచ్చి ఆగింది. ఇద్దరూ తలెత్తి చూశారు. బైక్ మీంచి ఇద్దరు పోలీసులు దిగారు. పోలీసుల్ని చూడగనే వాళ్లకు భయమేసింది. వాళ్లెందుకొచ్చారో, తమతో వాళ్లకేంపనో ఇద్దరికీ అంతుబట్టలేదు.చంటాడ్ని వదిలి దుర్గారావు లేచి నిలబడ్డాడు. గబగబా వచ్చి దుర్గారావు పక్కన నిల్చుంది ఎల్లి. పోలీసులు దగ్గరకొచ్చారు.
“దుర్గారావంటే నువ్వేనా?”ఇద్దర్లో నల్లగా, గుబురు మీసాలతో ఉన్న పోలీసు బొంగురు గొంతుతో అడిగాడు. దుర్గారావుకు గొంతు తడారిపోయింది. నోటమాట పెగల్లేదు.“ఈనేనయ్యా…”ధైర్యాన్ని కూడగట్టుకుని నెమ్మదిగా అంది ఎల్లి.
“సరే! చీకటి పడ్డాక వస్తాను. సికిని పలావు తెస్తాను. నీళ్లు పోసుకుని శుభ్రంగా ఉండు. నీ మొగుడ్ని ఇడిపించే పూచి నాది.. పో”
అంటూ సంతోషంగా ఇంట్లోకి వెళ్లాడు.చంటాడ్ని తీసుకుని దుఃఖ భారంతో ఎల్లి బైటికి నడిచింది.
“నువ్ సల్లగుండాలి సామి!” ఎస్సై పట్ల గుండెల నిండా కృతజ్ఞత నిండగా.. ఫోన్ పెట్టేసింది. నడచుకుంటూ ఇద్దరూ చీకట్లో కలిసిపోయారు. తెల్లవారింది. తూర్పు దిక్కుగా రైలు వేగంగా పరిగెడుతోంది. కంపార్ట్మెంట్లో డోరు పక్కన ఇద్దరూ కూర్చున్నారు. ఆసామి చేసిందంతా మొగుడికి చెప్పింది ఎల్లి. దుర్గారావు కళ్లలో నీళ్లు కారుతుండగా ఎల్లివైపు చూస్తూ… భుజం మీదుగా చెయ్యేసి దగ్గరికి తీసుకున్నాడు ప్రేమగా. ఎల్లి అతని భుజాలమీద వెచ్చగా వాలి కళ్లు మూసుకుంది.రైలు కూతపెడుతూ పరుగులు తీస్తోంది.
“ఎస్సైగారు నిన్ను స్టేషనుకు తీసుకురమ్మన్నారు”.
పోలీసు నోట్లోంచి తూటాలా వచ్చిందా మాట.
ఎల్లి గుండె ఝల్లుమంది. దుర్గారావు నిలువునా వణికి పోయాడు.
“నడు” గద్దించినట్లు అన్నాడు.
“ఏ… ఏ… ఎందుకయ్యా!?” తడబడుతూ అడిగింది ఎల్లి.
“వివరాలు చెప్తేగానీ పంపవా…?”
కోపంగా అని, చేత్తో బలంగా ఎల్లిని పక్కకు నెట్టి, దుర్గారావు రెక్క పట్టుకున్నాడు.
ఆ తోపుడుకు ఎల్లి వెల్లకిలా పడింది.
ఆమె కళ్లు బైర్లు కమ్మాయి. పోలీసులిద్దరు దుర్గారావును బైక్ ఎక్కించుకుని స్టార్ట్ చేశారు.ఎల్లి తేరుకుంది.
ఒంట్లోని శక్తినంతా కూడదీసుకుని, లేచి బైక్ వెంట పరిగెత్తింది. అప్పటికే అది వేగం పుంజుకుని చీకట్లో కలిసిపోయింది. నిస్సహాయంగా ఉన్నచోట కూలబడింది. కళ్లు ధారాపాతంగా వర్షిస్తున్నాయి.
చంటాడు గుర్తుకువచ్చి కళ్లు తుడుచుకుని, లేచెల్లి ఎత్తుకుంది. నిద్రపోవడంతో బొంతమీద పడుకోబెట్టింది. పొయ్యిమీద అన్నం మాడువాసన కొట్టింది. గబగబా లేచెళ్లి వట్టి చేతుల్తో గిన్నెను పట్టుకోడంతో చుర్రున కాలింది. తర్వాత కొంగుతో పట్టుకుని దించి, పక్కన పడేసింది.
జరిగిందంతా తనకు పీడకలలా అనిపిస్తోంది. పదే పదే మొగుడు దుర్గారావు గుర్తొస్తున్నాడు.
పోలీస్ స్టేషన్ ఇక్కడ్నుంచి పది కిలోమీటర్ల దూరంలో మండల కేంద్రంలో ఉంది. చీకటి పడితే ఈ ఊర్నుంచి ఆటోలుండవు. ఏంచేయాలో తెలీలేదు.
అంతలో ఏదో తట్టిన దాన్లా తాముంటున్న గుడారంలోకి వెళ్లింది. ఫోన్ తీసుకుని బైటకొచ్చి ఆసామికి ఫోన్ చేసింది. రింగయ్యింది కానీ ఫోన్ ఎత్తలేదు. రెండుసార్లు చేసినా ఎత్తలేదు. చార్జింగ్ అయిపోవడంతో ఫోన్ స్విచాఫ్ అయ్యింది. రాత్రంతా ఎల్లి శోకసంద్రంలో మునిగి పోయింది.తెల్లారింది. ఆటో పట్టుకుని స్టేషనుకొచ్చింది.ఆలోచనల్లోంచి బైటకొచ్చింది.
చంటాడు నిద్రపోయాడు. రవికె, పైట సరిజేసుకుంది. చంటాడ్ని బెంచీమీద పడుకోబెట్టి, లేచి నిల్చుంది.సెంట్రీ తనవైపు చూడటం గమనించింది. అదేం పట్టించుకోకుండా నడచుకుంటూ స్టేషన్లోకి వెళ్లింది.లోపల రైటర్ కుర్చీలో చేరగిలబడి పుల్లతో పళ్లను కుట్టుకుంటున్నాడు. లోనికొస్తున్న ఎల్లిని చిరాగ్గా చూశాడు.
“నీకు ఇందాక చెప్పానుగా.. మళ్లీ వచ్చావేంది?” కోపంగా అడిగాడు.
“అయ్యా! నా మొగుడొట్టి అమాయకుడు, అడ్ని ఒదిలేయండయ్యా!” అంటూ దీనంగా రైటర్ని వేడుకుంది.
“ఆడు అమాయకుడో, కేటు నాకొడుకో ఎస్సైగారు తేలుస్తారు. ఆయనొచ్చే టైం ఐంది బయటకెళ్లు” అంటూ కసురుకున్నాడు.
చేసేదిలేక ఏడుస్తూ బైటికొచ్చింది. రెక్కలు తెగిన పక్షిలా బెంచీమీద కూలబడింది. తన దుస్థితి ఏ దిక్కుకెల్లాలో తెలీక కూడళ్లో నిస్సహాయంగా నిల్చున్నట్లుంది.ఎల్లికి వాళ్ల ఊరు గుర్తొచ్చింది.
ఎల్లిది ఈ ఊరుకాదు, ఈ ప్రాంతంకాదు. వాళ్లది యాడ్నో శ్రీకాకుళం దగ్గర పల్లెటూరు. పదిరోజుల క్రితం బతుకు తెరువుకోసం ఈ ఊరొచ్చారు. ఎల్లి వాళ్లు యానాదులు. పంట పొలాల్లో ఎలుకలు పట్టి జీవనం సాగిస్తుంటారు. ఈ యేడు వానల్లేక, కరువొచ్చి వాళ్ల ప్రాంతంలో వ్యవసాయం దెబ్బతింది. వేసిన ఒకటీ అరా పంటలు కూడా నీళ్లులేక ఎండిపోయాయి. దాంతో పనులు వెతుక్కుంటూ కృష్ణా, గుంటూరు జిల్లాలను దాటి పల్నాడు ప్రాంతానికొచ్చారు. ఎవరో చెబితే ఇక్కడి ఆసామిని కలిశారు. ఎలుక్కి ఇరవై రూపాయల కాడికి బేరం కుదుర్చుకున్నారు. ఉండటానికి పొలం దగ్గర బొంగులు పాతి నీలంరంగు ప్లాస్టిక్ కవరుతో గూడు ఏర్పాటు చేసుకున్నారు.
ఆసామి ఊళ్లో పలుకుబడున్నోడు. రాజకీయాల్లో తిరుగుతాడు. ఏపార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి దూకుతాడు. ఏ రాజకీయం చేసినా తన లాభం కోసమే చేస్తాడు. ఇతరులకు వీసమెత్తు ఉపయోగం చేయడు. ఆసామి భార్య ఐదేళ్లక్రితం చచ్చిపోయింది. ఆయనే చంపాడని ఊళ్లో అందరూ చెప్తారు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు యాడ్నో సముద్రాలకవతల ఉంటాడు. అతనికి తండ్రిమీద పిసరంత ప్రేమ లేదు.
ఆసామి వట్టి ముండల ముఠాకోరుడు. చుట్టుపట్ల రెండు మూడూళ్లలో అతనికి పర్మినెంటు ఖాతాలున్నాయి. అవిగాక కంటికి నదురుగా కనిపించిన ఏ ఆడదాన్నీ వదలడు. బెట్టుచేస్తే నయానో, భయానో లొంగ దీసుకుంటాడు.
ఎల్లి మొగుడు దుర్గారావు రోజూ సాయంత్రం వెదురు బొంగుకు అటూఇటూ కట్టిన ఎలుక బుట్టల్ని కావిడిలా మోసుకుని పొలం వెళ్తాడు. పొలం చుట్టూ గెనాలమీన బొరియల దగ్గర, చేలో ఎలుక బుట్టలు పెడతాడు. ఎకరానికి వంద, నూటయాభై బుట్టలదాకా పెడతాడు. పొద్దున్నే పట్టిన ఎలుకల్ని లెక్కకట్టి ఆసామికి చూపిస్తాడు. ఆసామి లెక్క చెల్లిస్తాడు. ఎలుక బుట్టలు వెదురు పుల్లలతో చేస్తారు. వెదురు కర్రల్ని చీల్చి, బెత్తెడున్నర పొడవు పుల్లల్ని చేస్తారు. వాటితో త్రిభుజాకార చట్రాన్ని తయారుచేస్తారు. తాటాకులతో అల్లిన పొట్లంలాంటి బుట్టను మేకులతో చట్రానికి బిగిస్తారు. కోసుగా చెక్కిన పుల్లను రబ్బరు బ్యాండ్లతో బిగించి ఉంచుతారు.
ఎరగా వడ్లు, ఉల్లిపాయలు, కారం కలిపిన పదార్థాన్ని బుట్టలో ఉంచుతారు. ఆ వాసనకు ఎలుక బుట్టలోకి వచ్చి ఉచ్చుమీద కాలుపెడుతుంది. ఉచ్చు విడివడి కోసుగా చెక్కిన పుల్ల టప్ మంటూ పెద్ద శబ్దం చేస్తూ, మెరుపు వేగంతో ఎలుకను పట్టేస్తుంది. ఎలుక ఉచ్చులో పడి కాసేపు తన్నుకులాడి, నీలుక్కుని చస్తుంది. ఎలుక బుట్టలు చేయడంలో ఎల్లి నేర్పరి, వాళ్ల ఊర్లో పెద్దపేరు. జీపు రావడంతో ఆలోచనల్లోంచి బైటకొచ్చింది ఎల్లి.
జీపులోంచి ఎస్సైదిగి స్టేషన్లోకి వెళ్లాడు. సెంట్రి లేచి నిలబడి ఆయనకు సెల్యూట్ కొట్టాడు. చంటాడు నిద్రపోతూనే ఉన్నాడు. ఎల్లి లేచి గబగబా స్టేషన్లోకి వెళ్లింది. రైటర్ ఏదో కేసు తాలుకూ ఎఫ్ఐఆర్ను ఎస్సైకి చూపిస్తున్నాడు. లోపలికి వస్తున్న ఎల్లిని ఎస్సై చూసాడు.
“రాత్రి మనం తెచ్చినోడి పెళ్లాం సార్” రైటర్ కొంచెం వంగి ఎస్సై చెవిలో చెప్పాడు. ఎల్లి ఎస్సై దగ్గరికి వచ్చి చేతులు కట్టుకుని నిలబడింది.
“చూడూ.. నీ మొగుడు ఏ తప్పూ చేయలేదు. ఆసామి చెప్పడంతో తీసుకొచ్చి సెల్లో వేశాను”. ఎల్లివైపు సూటిగా చూస్తూ చెప్పాడు ఎస్సై. ఎల్లి విస్మయానికి గురైంది.
“ఆసామెందుకు సెప్పాడు సారూ” అర్థంకానట్లు ముఖంపెట్టి అడిగింది.
“ఆ విషయం వాడికీ, నీకే తెలియాల. వాడొట్టి వెధవ. ఎమ్మెల్యే తెలుసని అడ్డమైన పనులు చేస్తుంటాడు. వాడు చెప్పినట్లు చెయ్యకపోతే ఎమ్మెల్యేకి చెబుతాడు. అందుకే నీ మొగుడ్ని తెచ్చి లోపలేశా. నువ్వు స్టేషన్ చుట్టూ తిరగడంవల్ల లాభంలేదు. ఆసామిని కలిసి మాట్లాడుకో. నీ మొగుణ్ని మేమేం చేయం”. చెప్పాల్సింది చెప్పి ఎస్సై తనపనిలో తాను నిమగ్నమయ్యాడు. ఆసామి ఎందుకు తన మొగుడ్ని అకారణంగా లోన వేయించాడో, ఎల్లికి స్పష్టంగా అర్థమైంది. పనికోసం ఈ ఊరొచ్చి, ఆసామిని మొదటిసారి కలిసినప్పుడే.. ఎల్లిమీద అతని కన్ను పడింది. తనవంక అదోరకంగా చూడటం ఎల్లి గ్రహించింది. తర్వాత దుర్గారావు పొలానికి వెళ్లినప్పుడు ఆసామి వచ్చేవాడు. వంకర మాటలు మాట్లాడేవాడు. మింగేయాలన్నట్లు ఎల్లిని ఆబగా చూసేవాడు. రెండ్రోజుల క్రితం ఒంటరిగా ఉన్న ఎల్లి చెయ్యి పట్టుకున్నాడు ఆసామి. ఎల్లి నివ్వెరపోయింది. కాసేపటికి తేరుకుని ఆసామి చేతిని బలంగా విడిపించుకుంది.
“నేనట్టాటిదాన్ని కాదు నన్నొగ్గేయండి” అంటూ వేడుకుంది.
“ఏంటే.. అడుగుతుంటే బెట్టు సేస్తున్నావ్? ఒకసారి పడుకుంటే సచ్చిపోతావా!?” బెదిరిస్తూ అన్నాడు ఆసామి.
“కట్టుకున్నోడితో కాకుండా, ఇంగోరితో పక్క పంచుకుంటే మా కులంలో అది సావుతో సమానమయ్యా!”.
నిజాయితీగా చెప్పింది ఎల్లి. ఆసామి ఎల్లి మాటల్ని పట్టించుకోకుండా లోబర్చుకోవాలని ముందుకొచ్చాడు.
“అయ్యా! దగ్గరకొస్తే మర్యాదక్కదు, నా పెనిమిట్ని పిలుస్తా”. ధైర్యంచేసి గట్టిగా చెప్పింది ఎల్లి. ఆసామి ఆగిపోయాడు. ఎల్లి మాటలు అతని అహాన్ని దెబ్బకొట్టాయి.
“నిన్నెట్టా లొంగదీసుకోవాలో నాకు బాగా తెలుసు”. అంటూ తోకతొక్కిన తాచులా విసవిసా అక్కడ్నుంచి వెళ్లిపోయాడు.
తనను లొంగదీసుకోడానికే పెనిమిట్ని స్టేషన్లో వేయించాడని ఎల్లికి బోధపడింది. ఆసామి డబ్బు, పలుకుబడి ఉన్నోడు.
అతణ్ని ఎదుర్కొనే శక్తి తనకు లేదు. ఏం చేయాలో పాలుపోలేదు. కళ్లవెంట కన్నీళ్లు జలజలా రాలాయి.
“ఇదుగో అమ్మాయ్! ఇక్కడ నువ్వేడిస్తే లాభంలేదు. ఎస్సైగారు చెప్పినట్లు చెయ్. వెళ్లి నీ మొగుడ్ని విడిపించుకునే పనిచూడు పో” అంటూ రైటర్ అరిచినట్లు చెప్పాడు.
రక్షిచాల్సిన పోలీసులే భక్షించమని క్రూర మృగాల పాల్జేస్తుంటే.. సామాన్యులకు దిక్కేది? అనుకుంది.కాసేపటికి ఏదో నిర్ణయానికొచ్చిన దానిలా.. గట్టిగా ఊపిరి తీసుకుని అక్కడ్నుంచి కదిలింది.
“అమ్మాయ్!” వెళ్తున్న ఎల్లిని పిలిచాడు ఎస్సై. దగ్గరికి రమ్మని పిలిచి, ఎల్లికి ఏదో చెప్పాడు.ఇంకొక్క క్షణం ఎల్లికి పోలీసు స్టేషన్లో ఉండబుద్ధి కాలేదు. ఏడుస్తూ బైటికొచ్చింది. చంటాడ్ని ఎత్తుకుని రోడ్డుమీదికొచ్చింది. టీకొట్లోకి వెళ్లి టీ తాగింది. కాస్తంత ప్రాణం వచ్చినట్లు అనిపించింది.
ఆటో పట్టుకుని ఊరొచ్చింది. ఊరి మధ్యలో బొడ్డురాయి దగ్గర దిగి ఆసామి ఇంటికి వెళ్లింది. తను వెళ్లేసరికి ఆసామి వరండాలో వాలు కుర్చీలో కూర్చుని, పొగాకు కాడను చీలుస్తున్నాడు. లోపలికి వస్తున్న ఎల్లిని తలెత్తి నిర్లక్ష్యంగా చూసి.. చుట్ట చుట్టుకునే పనిలో పడిపోయాడు. చంటాడ్ని ఎత్తుకుని, ఆసామికి ఎదురుగా నిల్చుంది.
‘ఏంటి?’ అన్నట్లు చూశాడు.
“అయ్యా! రాత్రి నా పెనిమిట్ని పోలీసులు ఎత్తుకెళ్లారు”. హీన స్వరంతో నెమ్మదిగా అంది ఎల్లి. పొగాకు కాడలోంచి ఈనెను చీల్చి పారేసి..
“ఆడేదో దొంగ పన్జేసుంటాడు. పోలీసులు ఊరికనే ఎందుకెత్తుకెళ్తారు?” వెటకారంగా అన్నాడు.
“ఆడు అట్టాంటోడు కాదయ్యా!” దీనంగా చెప్పింది.
పక్కనున్న స్టీలు చెంబులో నీళ్లు గొంతులో ఒంపుకొన్నాడు.
“ఇప్పుడు నన్నేం జేయమంటావు?” ఎల్లిని చూస్తూ అడిగాడు.
“నీకాళ్లు పట్టుకుంటా! ఆడ్ని ఇడిపించండయ్యా!” బతిమాలింది.
“మొన్న సెయ్యి పట్టుకుంటే ఇసిరికొట్టావు. ఇప్పుడు కాళ్లు పట్టుకుంటావా?”.
కాళ్ల బేరానికొచ్చిన ఎల్లివైపు చూస్తూ గర్వంగా అన్నాడు. ఎల్లి మౌనంగా ఉంది. చుట్టను చుట్టి, దాని చివరను కొరికి తుపుక్కున ఊశాడు. నోట్లో పెట్టుకుని, అగ్గిపుల్ల గీసి ముట్టించుకున్నాడు. మండటానికి గబగబా నాలుగు సార్లు పీల్చి, పొగ గుప్పుమని వదిలాడు.చుట్ట చివర నిప్పులా ఆసామి మాటలకు ఎల్లి గుండె మండుతోంది.
“ఏం మాట్టాడకుండా మూగెద్దులా నిలబడ్డావేం”. నిర్ణయం ఎల్లిదేనన్నట్లు గొంతు పెంచి అన్నాడు.ఎల్లి చేతులతో కళ్లు తుడుచుకుంది.
“నువ్వు సెప్పినట్టే సేత్తా! ఆడ్ని ఇడిపించు”. తన అంగీకారాన్ని తలవంచుకుని చెప్పింది. ఆసామికి లొంగిపోయింది. ఆ మాటకోసమే ఎదురు చూస్తున్న ఆసామి ముఖం వెలిగిపోయింది. చుట్టను ఆఖరుసారి గట్టిగా పీల్చి పొగవదిలాడు. చుట్ట నేలకురాసి ఆర్పాడు. లేచి నిల్చున్నాడు.
“సరే! చీకటి పడ్డాక వస్తాను. సికిని పలావు తెస్తాను. నీళ్లు పోసుకుని శుభ్రంగా ఉండు. నీ మొగుడ్ని ఇడిపించే పూచి నాది.. పో” అంటూ సంతోషంగా ఇంట్లోకి వెళ్లాడు. చంటాడ్ని తీసుకుని దుఃఖ భారంతో ఎల్లి బైటికి నడిచింది. కాలి నడకన గుడారం చేరుకుంది. చంటాడికి స్నానం చేయించి, కడుపునిండా పాలు కుడిపి పడుకోబెట్టింది.
ఏదో నిర్ణయానికి వచ్చిందానిలా జుట్టు ముడేసి, కొంగును బొడ్లో దోపుకొంది. బుట్టలు చేసే కత్తిని అందుకుంది. బైటకొచ్చి రెండ్రోజులనాడు బుట్టలు చేయడం కోసం తెచ్చిన వెదురు బొంగుల్ని ముందేసుకుంది. కసిగా బొంగుల్ని, బద్దలుగా చీల్చింది.. వాట్ని నున్నగా, అంచులు కోసుగా చెక్కింది.
పురికొస తీసుకుని గుడారం ద్వారం కొలతలు తీసుకుంది. బొగ్గు ముక్కతో బద్దలమీద గుర్తులు పెట్టింది.
“పోతే నా మానం పోవాల! లేకపోతే వాడి పానం పోవాల! ఆడిది పైచేయి అయ్యి మానంపోతే.. ఈ కత్తితోనే పానం తీసుకోవాల”.
మనసులో బలంగా అనుకున్న మాటలు అప్రయత్నంగా బైటికొచ్చాయి.
కత్తితో గుర్తులుపెట్టిన కాడికి బద్దల్ని ముక్కలు చేసింది. పురికొసతో పెద్ద త్రిభుజాకార చట్రాన్ని చేసింది.
ఆ క్షణం ఎల్లి యుద్ధానికి సిద్ధమవుతున్న యోధలా కనిపించింది. త్రిభుజాకార చట్రమే తన ఆయుధం అనుకుంది. చావోరేవో అనుకుని చట్రాన్ని ఎత్తి కొసలతో కట్టి గుడారానికి బిగించింది.గుడారం ఇప్పుడు పెద్దసైజు ఎలుక బుట్టలా కనిపిస్తోంది. తర్వాత ఉచ్చును సిద్ధంచేసింది. అంతా అయిపోయాక గుండె నిండా ఊపిరి పీల్చుకుంది.
చీకటి పడింది. ఈ చీకటి సంద్రాన్ని దాటి తన బతుకు రేపటి వెలుగును చూస్తుందో లేదో అనుకుంది. ఏడుపొచ్చింది. చంటాడు బొంతమీద ఆడుకుంటున్నాడు. చంటాడ్ని చూడగానే గుండెల్లో దుఃఖం బద్ధలైంది. రెండు చేతుల్తో ఎత్తుకుని పెద్దగా ఏడ్చింది.
చాలాసేపటికి గానీ మామూలు మనిషి కాలేక పోయింది.
ఫోను మోగింది. ఎల్లి గుండెలు అదిరాయి. చేతులు వణుకుతున్నాయి. ఎత్తాలని అనిపించలేదు. మళ్లీ మోగింది. మొగుడు గుర్తొచ్చి కళ్లు తుడుచుకుని, ఎత్తింది.
“రెడీ అయ్యావా?” ఆసామి గొంతు.
“ఊ..” నెమ్మదిగా అంది.
ఫోన్ పెట్టేశాడు.
కాసేపటికి ఆసామి వచ్చాడు. మందుతాగి ఉన్నాడేమో.. బాగా తూలుతున్నాడు. ఎల్లికి తినమని పలావు ప్యాకెట్ ఇచ్చాడు. వద్దని పక్కన పెట్టింది. తన బతుకు క్రూర మృగానికి వేసిన ఎరలా ఉంది. అది ఉచ్చులో పడటమా? తాను బలవ్వడమా? కాలమే చెప్పాలి అనుకుంది.
“లోపలికి పద!” ఆసామి తొందరపడుతూ అన్నాడు.
“ముందు నా పెనిమిట్ని ఇడిపించు” ఖరాఖండిగా అడిగింది ఎల్లి. ఇందాకటి దాక భయంతో ఉన్న ఎల్లి.. ఇప్పుడు తెగించినదానిలా మొండిగా ఉంది.
“అదంతా నా సేతుల్లోనే ఉంది. నీ మొగుడ్ని లోపలేయించింది నేనే!” అంటూ క్రూరమైన నవ్వొకటి నవ్వి ఎస్సైకి ఫోన్ చేశాడు. ఆ మాటకు ఎల్లి రక్తం ఉడికిపోయింది. రెండు చేతుల్తో ఆసామి గొంతు పట్టుకుని కొరికి చంపాలని అనిపించింది.
“అలో ఎస్సైగారూ! ఆడ్నిడిసి పెట్టండి. ఊళ్లోకిప్పుడు ఆటోలుండవు. కాస్త మీ కానిస్టేబుల్ నిచ్చి బండిమీన చెరువుకాడ వదలిపెట్టండి. అట్నే ఎమ్మెల్యేకు సెప్పి నీ పనయ్యేట్లు చేస్తా సరేనా..” అంటూ ఫోన్ పెట్టేసి,
‘నా పలుకుబడి చూశావా!?’ అన్నట్లు ఎల్లివైపు చూశాడు. ఎల్లి మాట ప్రకారం మౌనంగా గుడారం లోపలికి నడిచింది. ఆసామి ఏదో సాధించినట్లు నవ్వి.. ఎల్లిని అనుసరించాడు. గుడారం బైట ఆగిపోయాడు. ఎల్లి లోపలికి రమ్మన్నట్లు నెమ్మదిగా తలాడించింది.
ఆసామి మీసం మెలేశాడు. కోర్కె నాలుకలు చాపుతుండగా ఎల్లివైపు ఆశగా చూశాడు. ఎల్లి మస్తిష్కంలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఆసామి ఉచ్చుమీద కాలు వేస్తాడా? లేక దాటుకుని వస్తాడా? దాటుకుని వస్తే.. తన బతుక్కివే ఆఖరి ఘడియలు. ఏదో ఆలోచన తట్టింది. ఆసామిని రెచ్చగొట్టడానికి అదోరకంగా చూసింది. రెండు చేతులూ చాపి లోపలికి రమ్మని పిలిచింది. విద్యుత్తు ప్రవహించినట్లు ఆసామి శరీరం పులకించింది.
ఆలస్యం చేయకుండా లోపలికి అడుగేశాడు. దీపం మసక వెలుగులో ఆసామి కాలివైపు ఉత్కంఠగా చూసింది ఎల్లి.కాలు సరిగ్గా ఉచ్చుమీద పడింది. ఊపిరి పీల్చుకుంది.ఆకాశంలో ఉరుము ఉరిమినట్లు.. ఠప్… మంటూ పెద్దశబ్దం చేస్తూ, పైనుంచి ఓ కర్ర ఆసామి తలను బలంగా తాకింది.
“అమ్మో!”.. అని పెద్దగా అరుస్తూ కింద పడ్డాడు. కరెంటు తీగను తాకిన పందిలా అరుస్తున్నాడు. కాసేపటికి అరుపు ఆగిపోయింది. ఏ శబ్దమూ లేదు. ఆ ఇరుకు స్థలంలో ఎల్లి నెమ్మదిగా కదిలి దీపం తీసుకుని.. ఆ వెలుగులో ఆసామిని చూసింది. తల పగిలి, చారెడు రక్తం చిక్కగా కారి ఉంది. వేలు ముక్కుదగ్గర పెట్టి శ్వాస చూసింది. ఆసామి చచ్చిపోయాడని నిర్ధారించుకుని.. ధైర్యంగా బైటికొచ్చి చంటాడ్ని ఎత్తుకుని కూర్చుంది. కొంతసేపటికి చీకట్లో నడుచుకుంటూ దుర్గారావు వచ్చాడు. మొగుడ్ని చూడగానే కావలించుకుని బోరుమని ఏడ్చింది.
“నాకేం కాలేదుమే!” ఎల్లిని సముదాయించాడు. ఎల్లి తేరుకుంది.
“ఆసామి మంచోడు. ఆయనే పోలీసోల్లకు సెప్పి ఇడిపించాడు మే!” అమాయకంగా చెప్పాడు దుర్గారావు. కాసేపు ఎల్లి మౌనంగా దుర్గారావువైపు అలాగే చూస్తుండి పోయింది.
“ఏంటిమే.. ఎర్రిదాన్లా సూస్తున్నావు” అని మళ్లీ..
“సందకాడ ఆసామి వచ్చాడా?” అని అడిగాడు. ఎల్లి తలతిప్పి చచ్చిపడి ఉన్న ఆసామివైపు చూసింది. విగతజీవిగా పడిఉన్న ఆసామిని చూసి.. దుర్గారావు దిగ్భ్రమకు లోనయ్యాడు. తేరుకుని దీపం వెలుతురులో రక్తపు మడుగులో పడిఉన్న ఆసామిని చూశాడు. దుర్గారావు గుండె అవిసి పోయింది. వెనకాలే వచ్చిన ఎల్లివైపు చూసి..
“ఏమైందిమే!” అని అరిచాడు.
‘అడవిలో పులి ఊరి మీదబడి సంపుతుంటే అందరొకటై మట్టుబెడతారు కదా! నేనదే సేసాను” దృఢంగా చెప్పింది. దుర్గారావు స్థాణువయ్యాడు.
“అంతా ఇవరంగా సెప్తాగానీ, ముందు ఇక్కడ్నుంచి పోవాలిపద” అంటూ, దుర్గారావును తొందర పెట్టింది. మరో గంట సేపట్లో ఇద్దరూ కల్సి గుడారం పీకి, సామాన్లు సర్దుకున్నారు. అక్కడ గుడారం ఉన్న ఆనవాళ్లు మిగల్చకుండా చేశారు.
ఆ చీకట్లో చంటాడ్ని తీసుకుని ఇద్దరూ బయల్దేరారు. ఎల్లికి.. ఎస్సై ఆఖర్న చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.
“నీ మొగుడ్ని విడిపించు కోవాలంటే నీకు రెండే మార్గాలు ఉన్నాయి. వాడి పక్కలో పడుకోవడం. లేదా వాడ్ని శాశ్వతంగా పండబెట్టడం. నువ్వు ఏది చేయగలిగితే అది చెయ్!”.
ఒక్కక్షణం ఆగి ఫోన్ తీసింది. అరచేతిమీద రాసుకున్న ఎస్సై నెంబరు నొక్కి కాల్ చేసింది. ఎస్సై ఫోన్ లిఫ్ట్ చేశాడు.
“ఆణ్ని శాశ్వతంగా పండబెట్టాను సారూ!” ముఖంలో గర్వం తొణికిస లాడుతుండగా ధైర్యంగా చెప్పింది ఎల్లి.
“శభాష్! నా కొడుకు పీడ ఊరికి శాశ్వతంగా తొలగిపోయింది. మీరు అన్నీ సర్దుకుని వెళ్లిపోండి. రాత్రికి గుంటూరు చేరుకుని, అక్కడ రైలు పట్టుకుని మీ ఊరెళ్లండి. వాడి దగ్గర ఏముంటే అవి పట్టుకెళ్లండి. డబ్బు, బంగారం కోసం దొంగలు దాడిచేసి చంపారని కేసు రాస్తా! ఊళ్లో వాడి గురించి ఒక్కళ్లు కూడా అడగరు. వెళ్లండి. నేను చూసుకుంటా” అంటూ ఎస్సై అభయమిచ్చాడు.
– బి.ఎన్.కె. కరిముల్లా