అబుదాబీ, అక్టోబర్ 6 : ఫ్లైదుబాయ్ ఘటనలో కో-పైలట్ చేతిలో గాయపడి చికిత్స పొందుతున్న భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ పుర్రెలో పగులు ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. విమానం హైజాక్ చేయడానికి ప్రయత్నించిన కోపైలట్ హమామ్ అల్ హమామీని ఎదుర్కొనే క్రమంలో గాయపడిన మచ్చర్‌కు తీవ్ర రక్తస్రావం అయ్యింది. తలకు ఫ్రాక్చర్ అయ్యింది. అంతేకాక ఈ దాడిలో పైలట్ ఛాతి, పై పొట్ట, ఇతర అవయవాలపై కూడా గాయాలయ్యాయి. పుర్రెపై తగిలింది తీవ్ర గాయమని వైద్యులు చెప్పారు.
అందుకే సౌదీ అరేబియాలో అతనికి అత్యవసర చికిత్స అందించి తర్వాత యూఏఈకి తరలించినట్టు దవాఖాన వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మచ్చర్ కోలుకుంటున్నాడని వెల్లడించాయి. మరోవైపు మచ్చర్ సాహసాన్ని ప్రశంసిస్తూ అమెరికా ప్రతినిధుల సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అలాగే సిబ్బంది, ప్రయాణికుల తెగువను కొనియాడింది.