తెలంగాణలో పండుగ అంటే కేవలం దేవుడిని పూజించడం కాదు. మనిషికి, ప్రకృతికి మధ్య ఉన్న బంధాన్ని గుర్తు చేసుకోవడం కూడా పండుగే. ఆ బంధాన్ని మట్టితో, పూలతో, పాటలతో, ఆడపిల్లలు సందడిగా జరుపుకొనే జానపద సంప్రదాయాల్లో బొడ్డెమ్మ మొదటిది. బతుకమ్మ పండుగకు సరిగ్గా తొమ్మిది రోజుల ముందు భాద్రపద బహుళ పంచమి నాడు ప్రారంభమయ్యే బొడ్డెమ్మ వేడుకలు మహాలయ అమావాస్యతో ముగుస్తాయి. బతుకమ్మ పెండ్లయిన ముత్తయిదువల పండుగైతే, బొడ్డెమ్మ కన్నెపిల్లల పండుగ. చిన్ననాటి నుంచే బాలికలకు సృష్టిని గౌరవించడం, కుటుంబ బాధ్యతలను నేర్పడం ఈ పండుగ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.
బొడ్డెమ్మ సంప్రదాయంలో మట్టికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రాంతాన్ని బట్టి బొడ్డెమ్మను తయారు చేసే పద్ధతులు, అలంకరణ, పూజావిధానం మారుతుంటాయి. కొన్ని ప్రాంతాల్లో మట్టితో గౌరమ్మ రూపాన్ని తయారు చేస్తారు. మరికొన్నిచోట్ల పీటపై మట్టిని ప్రత్యేక ఆకృతిలో అమర్చి పూజిస్తారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతీయ సంప్రదాయాల్లో బొడ్డెమ్మను గౌరమ్మతో అనుసంధానిస్తారు. సౌభాగ్యం, కుటుంబ శ్రేయస్సు, సంతానం, స్త్రీశక్తి వంటి భావాలు ప్రాంతీయ విశ్వాసాల్లో దీనితో కలిసిపోయాయి. బొడ్డెమ్మ పుట్టుక వెనక పల్లెల్లో రకరకాల ఆసక్తికరమైన గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. శివుడిని వివాహం చేసుకున్న సతీదేవి తన తండ్రి దక్షుడు యజ్ఞానికి పిలవకపోయినా వెళ్తుంది. అక్కడ తండ్రి వల్ల పతినింద భరించలేక యజ్ఞగుండంలో దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది. అలా అగ్నికి ఆహుతైన సతీదేవి తిరిగిన జగన్మాతగా లోకాన్ని రక్షించడానికి మట్టి నుంచి ఉద్భవించి బాల్యరూపమే బొడ్డెమ్మ అని, పెద్దయ్యాక బతుకమ్మగా మారిందని పౌరాణిక విశ్వాసం.
బొడ్డెమ్మ తయారు చేసే విధానం విభిన్నంగా ఉంటుంది. పుట్టమట్టితో చతురస్రాకార పీఠాన్ని వేసి దానిపై ఐదు లేదా ఏడు అంతస్తులు (అంతరాల) గోపురాన్ని నిర్మిస్తారు. ఈ మట్టి గోపురంపై శిఖర ప్రదేశంలో బియ్యంతో నిండిన చిన్న కలశం, కొత్త వస్త్రం పెడుతారు. పసుపుతో చేసిన గౌరమ్మను తమలపాకులో ఉంచి ఆ వస్త్రంపై పెడుతారు. గోపురం చుట్టూ తంగేడు, గునుగు, కట్ల తదితర పూలతో అందంగా అలంకరిస్తారు. ప్రతీ రోజూ సాయంత్రం కాగానే కన్నెపిల్లలంతా తమ ఇంటి ముందు పేర్చిన బొడ్డెమ్మ చుట్టూ చేరి, చేతులు తడుతూ వలయాకారంగా తిరుగుతూ లయబద్ధంగా పాటలు పాడుతారు. ఈ పాటలు లక్ష్మీ సరస్వతీ, గౌరీ సంబంధితమైనవే కాకుండా అత్తాకోడళ్ల ముచ్చట్లు, అన్నదమ్ముల అనురాగాలు, ప్రకృతి అందాలను ప్రతిబింబిస్తాయి. ఈ తొమ్మిది రోజులు కూడా బొడ్డెమ్మకు సమర్పించే నైవేదాలు ఆరోగ్యకరమైనవి. బియ్యంపిండి, బెల్లం, నువ్వులు, పల్లీలతో చేసిన సద్ది లేదా ఫలహారం ఇస్తారు. ఇవి పెరిగే పిల్లలకు అవసరమైన క్యాల్షియం, ఐరన్ అందిస్తాయి.
బొడ్డెమ్మ పండుగ కేవలం ఆటపాటల వినోదం కాదు.. ఇది కన్నెపిల్లలకు సామాజిక స్పృహను, కళాత్మకతను, ప్రకృతి పట్ల ప్రేమను చిన్నతనం నుంచే అలవాటు చేసే ఒక అద్భుతమైన సాంస్కృతిక పాఠశాల. మట్టితో మొదలై, పూలతో వికసించి, నీటితో ముగిసే ఈ పండుగ యావత్ మానవాళికి ప్రకృతితో మమేకమై జీవించాలనే పరమార్థాన్ని బోధిస్తుంది.