హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ‘డిండి’ ప్రాజెక్టుపై ఏ విధంగా ముందుకు సాగాలనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నది. డిండి ప్రాజెక్టు పనుల దుస్థితి, కారణాలు తదితర అంశాలపై ‘నమస్తే తెలంగాణ’ ఇటీవల పలు కథనాలను ప్రచురించింది. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సాగు, తాగునీటిని అందించేందుకు సత్వరమే ప్రాజెక్టును చేపట్టాలని నల్లగొండ జిల్లా మంత్రులు, ప్రజాపత్రినిధులు పట్టుబడుతుండటం,
మరోవైపు పాలమూరు లిఫ్ట్ స్కీమ్‌లో భాగంగా చేపడితే తమకు తీరని నష్టమని, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజాప్రతినిధులు వ్యతిరేకించడం, వెరసి ప్రాజెక్టు పనులు ముందుకు పడని దుస్థితి నెలకొన్నది. కాంగ్రెస్ నేతల మధ్య సయోధ్య లేక అధికారులు నలిగిపోతున్నారు. ఈ సందిగ్ధత నడుమ నాగర్‌కర్నూల్ చీఫ్ ఇంజినీర్ రాజీనామాకే సిద్ధమయ్యారు. ఆయా అంశాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనాలను ప్రచురించడంతో ప్రభుత్వ పెద్దలు రెండు రోజులుగా ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. ప్రాజెక్టుపై ఎలా ముందు కు వెళ్లాలనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు.
ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ (అడ్మిన్) రాజీనామా చేశారని తెలుస్తున్నది. ఆయన ఇప్పటికే ఉద్యోగ విరమణ పొందగా, ప్రభుత్వం ఎక్స్టెన్షన్ ఇచ్చింది. నవంబర్ నెలాఖరు వరకు ఆయనకు గడువు ఉన్నది. కానీ బాధ్యతల నుంచి తప్పించాలని ఇప్పటికే ప్రభుత్వానికి ఆయన విన్నవించుకున్నట్టు సమాచారం. ఈ మేరకు రాజీనామా సమర్పించారని తెలిసింది. వ్యక్తిగత కారణాలతోనే బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారని జలసౌధ వర్గాలు వెల్లడిస్తున్నాయి.