ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కాలమైనా ఆధ్యాత్మిక భావన మాత్రం మరవద్దనేది నా భావన. నా మనస్సుకు ప్రశాంతతతో పాటు నా ఎదుగుదలకు తోడ్పాటునిచ్చిన వాటిలో మొదటిది జ్యోతిష శాస్త్రమైతే రెండోది యోగా సాధన. మాది ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ గ్రామం. మాకు బట్టల దుకాణం, కొంత వ్యవసాయ పొలం ఉన్నాయి. అమ్మానాన్నలిద్దరూ కలిసి పనిచేస్తుంటారు. నాకో తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. చిన్నప్పటినుంచి చదువులో ముందుండేదాన్ని. నా పాఠశాల విద్యనంతా ఉట్నూర్‌లో పూర్తి చేసి పై చదువులకోసమని హైదరాబాద్‌కి వచ్చాను. డిగ్రీ చేస్తున్న సమయంలో ఓ సారి మా కళాశాలలో మిస్ ఫ్రెషర్స్‌ను నిర్వహించారు. అందులో పాల్గొని విజేతగా నిలిచాను. నా పేరును నోటీస్‌బోర్డులో పెట్టి మరీ ప్రకటించడంతో భవిష్యత్తులో మిస్ యూనివర్స్ కావాలనుకున్నాను. కానీ కుటుంబానికి తోడుగా నిలవడం కోసం నా కోరికను మదిలోనే దాచుకుని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాను. నేను ఎన్సీసీ విద్యార్థిని కావడంతో పోలీస్, ఆర్మీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని వాటికి ప్రిపేరయ్యాను. కానీ ఆ రెండింటిలోనూ చివరివరకూ వెళ్లి క్వాలిఫై కాలేకపోయాను.

సరైన గైడెన్స్ లేకపోవడంతో పోటీ పరీక్షల్లో రాణించలేకపోయానని చాలా బాధకు లోనయ్యాను. నా భవిష్యత్తు ఎటువైపు వెళ్తుందో అని బెంగపడ్డాను. ఆ సమయంలోనే నా ఫ్రెండ్ జ్యోతిష శాస్ర్తాన్ని పరిచయం చేసింది. జ్యోతిషం నేర్చుకోవడంలో భాగంగా బృహత్ పరాశర హోరా శాస్త్రం గ్రంథ పఠనం చేశాను. మా కుటుంబ పండితులు, కాశీ పండితుల దగ్గర నేర్చుకుంటూనే ఆన్లైన్లో వేరే గురువుల దగ్గర ఈ శాస్ర్తాన్ని అభ్యసించాను. జ్యోతిషం అనేది మన జీవితానికి జీపీఎస్ లాంటిదని నా విశ్వాసం. దాంతోపాటు నాకు మరమశివుడంటే అమితమైన భక్తి. ఎప్పుడూ ధ్యాన ముద్రలో ఉండే ఆయన్ను చూసి, యోగా ధ్యానం కూడా నేర్చుకున్నాను. అంతే కాకుండా తెలంగాణ రాష్ట్ర యోగాసన ప్లేయర్‌గా బ్రాంజ్ మెడల్ సాధించాను కూడా. ఇవన్నీ మానసిక ప్రశాంతతతో పాటు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సాధనాలుగా ఉపయోగపడ్డాయి.

ఉద్యోగ ప్రయత్నాలు వదులుకొని నాకిష్టమైన మోడలింగ్ వైపు దృష్టి మరల్చాను. అందులో భాగంగా కొన్నిరోజులు మేకప్ ఆర్టిస్ట్ మోడల్‌గా చేశాను. ఆ సమయంలోనే నాకో ఫ్రెండ్ పరిచయమై మిస్ హైదరాబాద్ ఆడిషన్ గురించి చెప్పింది. అలా మిస్ హైదరాబాద్- 2023కు దరఖాస్తు చేసుకున్నాను. అందులో సెకండ్ రన్నరప్‌గా నిలిచాను. ఆ గెలుపు నాలో సంతోషానిచ్చింది. నా కుటుంబమంతా గొప్పగా అనుభూతి చెందిన సమయమది. అప్పటివరకు అందాల పోటీలు నీకెందుకు అన్నవాళ్లే శుభాకాంక్షలు చెప్పారు. ఆ తర్వాత 2024లో మిస్ యూనివర్స్ తెలంగాణ, ఫెమినా మిస్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నాను. ఆ సమయంలో ఫిట్నెస్ కోసం పెట్టేంత డబ్బు లేక ఆన్లైన్ వీడియోలు చూస్తూ ప్రాక్టీస్ చేశాను. దాంతో ఆడిషన్లలో ఎంపికకాలేదు. అయినా ప్రయత్నాలు మానుకోకుండా అందాల పోటీలకు సంబంధించి ఏ నోటిఫికేషన్ కనిపించినా దరఖాస్తు చేస్తూనే వచ్చాను. 2025లో మిస్ ఊర్వశిలో పాల్గొని టాప్ టెన్‌లో నిలిచి, మిస్ ఫిట్నెస్ క్వీన్ గెలుచుకున్నాను. ఆ తర్వాత హైదరాబాద్‌లో నిర్వహించిన మిస్ యూనివర్స్ తెలంగాణ-2026లో పాల్గొని టాప్15లో నిలిచాను. ఆ పోటీ నా లైఫ్‌లో ఓ ధమాకానిచ్చింది. దాని ద్వారా ఓ పెద్ద ఫ్యాషన్ రన్‌వే షో స్టాపర్‌గా అవకాశం లభించింది.
మన మనుగడకు పంచేంద్రియాలే కీలకం. వాటిలో ఏ ఒక్కటి లేకున్నా మన జీవనం ముందుకు సాగదు. నాకు ప్రకృతి, మూగజీవాలు అంటే ఎంతో ఇష్టం. ఎనిమిది నెలల క్రితం కైండ్ హార్ట్స్ స్వచ్ఛంద సంస్థను స్థాపించి మూగజీవాలకు తిండి పెడుతూ, చెరువుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తున్నాను. మియాపూర్, ప్రగతి నగర్ ప్రాంతాల్లోని చెరువులను క్లీన్ చేస్తున్నది మా టీమే. నా సేవా కార్యక్రమాలకు కానుకే ఈ మిస్ ఎర్త్ వాటర్ ఇండియా కిరీటం. ఈ ఏడాది ఏప్రిల్‌లో మిస్ ఎర్త్ వాటర్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నాను. ఆగస్టులో సెమీఫైనల్, ఆన్లైన్ ఇంటర్వ్యూ పూర్తి చేసి ఫైనల్స్‌కు ఎంపికయ్యాను.
జైపూర్‌లో నిర్వహించిన ఈ వేడుకకు దేశవాప్తంగా నాతోపాటు 24మంది పోటీదారులు వచ్చారు. సెప్టెంబర్‌లో వారంరోజులపాటు నిర్వహించిన ఫైనల్స్‌లో టాప్‌లో నిలిచి మిస్ ఎర్త్ వాటర్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్నాను. దానితో పాటు అందాల పోటీల్లో అందరితో స్నేహభావంగా మెలిగినందుకుగాను అత్యంత ప్రాధాన్యత కలిగిన ‘కాంజెనియాలిటీ’ అవార్డును సబ్టైటిల్గా అందించారు. కిరీటం వస్తే గర్వం వస్తుందంటారు. నాకు మాత్రం మరింత బాధ్యత పెరిగింది. ప్రపంచ వేదికలపై నిర్వహించే పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నాను. ప్రస్తుతం యోగా టీచర్‌గా పనిచేస్తూనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. చట్టసభల్లో మహిళల ప్రాధాన్యత తక్కువగా ఉంది. అవకాశాలొస్తే భవిష్యత్తులో నన్నొక లీడర్‌గా చూస్తారు.
– రాజు పిల్లనగోయిన