ముంబై, అక్టోబర్ 6: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు శాంతించడంతోపాటు బ్యాంకింగ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లను కొనుగోలు చేయడానికి మదుపర్లు ఆసక్తి చూపడంతో సూచీలు కదంతొక్కాయి. బ్యారెల్ ధర 100 డాలర్ల దిగువకు పడిపోవడం చమురు షేర్లలో క్రయవిక్రయాలు జోరుగా సాగడంతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ తిరిగి 73 వేల పాయింట్ల మైలురాయిని అధిగమించింది.
మార్కెట్ ముగిసే సమయానికి 685.34 పాయింట్లు అందుకొని 73,067.81 వద్ద ముగిసింది. నిఫ్టీ 220.35 పాయింట్లు ఎగబాకి 22,776.10 వద్ద స్థిరపడింది. సూచీల్లో ట్రెంట్ షేరు అత్యధికంగా 12.78 శాతం లాభపడి టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు కొటక్ మహీంద్రా బ్యాంక్, హిందుస్థాన్ యునిలీవర్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇంటర్గ్లోబల్ ఏవియేషన్, ఏషియన్ పెయింట్స్ షేర్లు కూడా లాభా ల్లో ముగిశాయి. కానీ, టెక్ మహీంద్రా, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ షేర్లు నష్టపోయాయి. క్రూడాయిల్ ధర 1.70 శాతం తగ్గి 98.59 డాలర్లకు పడిపోవడం మదుపర్లలో ఉత్సాహాన్నినింపిందని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.