ఈ చర్మ రహస్యం తెలిస్తే అందం కోసం అంతగా కష్టపడాల్సిన అవసరమే లేదని సినీ నటి టబు చెబుతోంది. ‘నా అందం వెనక రహస్యం నిద్రే. నిద్రకు చర్మ సౌందర్యానికి ఉన్న సంబంధం గురించి చెప్పలేను. కానీ, కావల్సినంత నిద్రపోతే రావల్సినంత సౌందర్యం వస్తుందని తెలుసు’ అంటున్నదామె.
టబు చెప్పింది అక్షరాలా నిజమే. చర్మ సౌందర్యంతో మెరిసిపోయే వాళ్లను గమనిస్తే ఈ విషయం అర్థం కాదు. కానీ, చర్మ సమస్యలతో బాధపడేవారిని గుర్తిస్తే చర్మ సౌందర్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో ఇట్టే తెలిసిపోతుంది. చర్మం కాంతి హీనంగా మారడం వల్ల ఆకర్షణీయంగా కనిపించరు. దీనికి కారణం చర్మ కణాల్లో నీటి శాతం తక్కువ ఉండటం. అలాగే కొంతమంది వాస్తవ వయసుకు మించి కనిపిస్తారు. కారణం చర్మ కణజాలంలో కొలాజన్ తగ్గడం.
అందువల్లే చర్మం ముడతలు పడి వయసు పెరిగినట్టు కనిపిస్తారు. వాతావరణ కాలుష్యం, బ్యాక్టీరియా వల్ల ముఖంపై ఉండే చర్మంలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇది సహజమైన ఆకర్షణని తగ్గిస్తుంది. శరీర అవసరాన్ని బట్టి కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్రపోతే ఈ మూడు సమస్యలూ తగ్గిపోతాయి. నిద్రపోయేప్పుడు కణాల్లో హైడ్రేషన్ జరిగి కాంతి తిరిగి వస్తుంది. కొలాజన్ కోల్పోవడం తగ్గుతుంది. నిద్రలోనే కణాల రిపేర్ జరుగుతుంది. అందువల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. కాబట్టి అలారం పెట్టుకుని నిద్రాభంగం చేయకుండా శరీరానికి కావల్సినంత నిద్రపోతే టబులా వయసుని దాచే చర్మ సౌందర్యం సొంతమవుతుంది.