తొలిచూపులు వెలిగించిన ప్రణయ దీపం
Heard melodies are sweet, but those unheard are sweeter- అని ఆంగ్లకవి జాన్ కీట్స్ (Ode on a Grecian Urn) అన్నారు. ఈ పంక్తులు దాశరథిని ప్రభావితం చేశాయేమోనని పిస్తుంది. కీట్స్ రాసిన సందర్భం వేరు. ఆయన ఒక పురాతన గ్రీకు దేశపు మట్టి పాత్ర (Urn) పై చెక్కి ఉన్న చిత్రాలను చూస్తూ.. కళ, కాలం, జీవితాల మధ్య ఉన్న సంబంధాన్ని వివరించారు.
దాశరథి, సైతం కీట్స్ లాగే ‘ఎక్ఫ్రాసిస్ట్’ కవి. సాహిత్యంలో ఒక శిల్పాన్నో, చిత్రాన్నో లేదా ఏదైనా ఒక దృశ్యరూప కళా ఖండాన్ని మాటల రూపంలో కవిత్వంగా మార్చి వర్ణించే ప్రక్రియను ‘ఎక్‌ఫ్రాసిస్’ అంటారు. ‘అగ్నిధార’లో ‘శిల్పి’ అనే కవితలో అజంతా గుహలలోని శిల్పకళను, ఒక శిల్పి రాతిపై చెక్కిన దృశ్య రూపాలను మాటల్లో కవిత్వంగా ఆయన మార్చిన విధానం ‘ఎక్‌ఫ్రాసిస్’ కు చెందినదే!
ఈ ‘ఎక్‌ఫ్రాసిస్’ శిల్పాన్ని దృష్టిలో పెట్టుకొనే.. అన్నపూర్ణ వారి ‘చదువుకున్న అమ్మాయిలు’ (1963) చిత్రంలో ‘వినిపించని రాగాలే, కనిపించని అందాలే‘ అనే పాటను రాశారు దాశరథి. నాయిక ప్రేమ చిగురించిన తొలి దశలో తన ప్రణయ భావనలను వ్యక్తపరిచే సన్నివేశం కోసం రాసిన పాట ఇది.
కథాపరంగా శేఖర్ (అక్కినేని)తో పరిచయమయ్యాక, అతనిపై తన మనసులో కలిగిన ప్రేమను, తెలియజేయాలని వసంత (సావిత్రి) ఆరాటపడుతుంది. శేఖర్ గురించిన మధురమైన ఊహల్లోనే ఆమె నిద్రలోకి జారుకుంటుంది. శేఖర్‌తో కలిసి ఒక తోటలో విహరిస్తున్నట్టు ఒక అందమైన కలగంటుంది. ‘తన హృదయంలో కలిగిన ఆరాటాన్ని, తొలి వలపును వ్యక్తపరుస్తూ వసంత తనలో తాను చెప్పుకొన్నట్లుగా పాటను రాయండి’ అని దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు సన్నివేశం వివరించారు. సాలూరి హార్మోనియంపై ట్యూన్ వినిపించారు. దాశరథి కలం కూడా కలల తీరాల్లో విహరించింది. అరగంటలోనే అందమైన ప్రణయ గీతం ఆవిష్కృతమైంది!
పల్లవి
వినిపించని రాగాలే..
కనిపించని అందాలే
అలలై మదినే కలచే..
కలలో ఎవరో పిలిచే
చరణం 1
తొలిచూపులు నాలోనే..
వెలిగించే దీపాలే
చిగురించిన కోరికలే..
చిలికించెను తాపాలే
వలచే మనసే మనసు //వినిపించని //
చరణం 2
వలపే వసంతముల..
పులకించి పూచినది
చెలరేగిన తెమ్మెరలే..
గిలిగింతలు రేపినవి
విరిసే వయసే వయసు //వినిపించని //
చరణం 3
వికసించెను నా వయసే..
మురిపించు ఈ సొగసే
విరితేనెల వెన్నెలలో..
కొరతేదో కనిపించే
ఎదలో ఎవరో మెరిసే //వినిపించని //

Chaduvukunna Ammayilu
తొలిప్రేమ తాలూకు మధురానుభూతిని ముగ్ధ నాయిక ఎంత సున్నితంగా విన్నవించుకొన్నదో, దాశరథి అంతే లలితంగా రాశారు. నాయకుని తొలిచూపులలోని ప్రేమ. నాయిక దిగులు (చీకటి)ను తొలగించే దీపాలని, ఆ వెలుగే క్రమంగా చిగురించి మధుర తాపాన్ని (విరహాన్ని) రగిలించిందని చెప్పడం రొమాంటిక్ కవిత లక్షణం. అంతేకాదు ఆమె ప్రేమను వసంతంతో పోల్చారు. వసంతంలో చెట్లు చిగుర్చినట్లు, వలపు వల్ల ఆమె మనసు పులకించి పూలు పూసిందట. నిండు పున్నమి వెన్నెల రాత్రిలో కూడా ఏదో తెలియని వెలితి వేధిస్తున్నదని, దానికి కారణం నాయకుడు నిజంగానే తనను ఇష్టపడుతున్నాడో లేడోననే సంశయం!
నాయిక మదిలో చెలరేగే భావోద్వేగాలను దాశరథి లలిత పదాలతో ప్రబంధ స్థాయి భావాన్ని సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా అందించారు. పాటలో రూపక, శబ్దాలంకారా (అంత్యప్రాస)లతోపాటు ఉత్ప్రేక్ష కూడా కనిపిస్తాయి. తొలిచూపులు నాలోనే వెలిగించే దీపాలే- అన్నపుడు చూపులే దీపాలుగా, వలపే వసంతములా పులకించి పూచినది- అనే పంక్తిలో ప్రేమే వసంతంగా రూపకం చేశారు. ఇక ప్రతి పాదం చివర ఒకే రకమైన అక్షర క్రమం (దీపాలే, తాపాలే, పూచినది, రేపినవి, వయసే, సొగసే) రావడం వల్ల వృత్త్యానుప్రాస/ అంత్యప్రాస అలంకారంతో శోభించింది. దాశరథి గారు ఈ పాటలో పాదాంత ప్రాసలను అత్యంత సహజంగా, అర్థవంతంగా కూర్చారు.
పాటలో రెండవ, మూడవ చరణాంతాలను (వలచే మనసే మనసు/విరిసే వయసే వయసు) లాటానుప్రాస అలంకారంలో చెప్పడం పాట మొత్తానికే అలంకారంగా మారింది. అర్థభేదం లేక తాత్పర్య భేదంతో ఒకే పదం వెంట వెంటనే ప్రయోగిస్తే అది లాటానుప్రాస అవుతుంది. ఉదాహరణకు కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. ఇక ‘విరితేనెల వెన్నెల’ వంటి భావచిత్రాలు, మనసులను స్పృశిస్తాయి.
ఇది స్వప్న గీతం.. అందుకే దాశరథి పల్లవిలోనే ‘అలలై మదినే కలచే… కలలో ఎవరో పిలిచే…’ అని సూచించారు. రాజేశ్వరావు మోహన రాగంలో స్వరపరచిన ఈ పాటకు ముందు ఘంటసాల ఆలాపన ఒక బోనస్. మోహన రాగంలో వర్జితమైన శుద్ధ రిషభం, శుద్ధ మధ్యమం, కాకలి నిషాదం స్వరాలను ప్రయోగించి పాటను మాధురీభరితంగా మలిచారు. ఈ పాటపైన సావిత్రి ,అక్కినేని అభినయించారు. కానీ, చిత్రంలో కథానుసారం సావిత్రి వివాహం శోభన్‌బాబుతో జరుగుతుంది.
కొసమెరుపు:: దాశరథికి ఇష్టమైన పదం ‘దీపం’ ఈ గీతంలో కూడా వెలిగింది.
డాక్టర్ వి.వి.రామారావు
రచయిత, వ్యాఖ్యాత, గాయకుడు
9849237663
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

