Indian sailors : హార్ముజ్ జలసంధి వద్ద ఒక నౌకపై జరిగిన దాడిలో 11 మంది భారతీయ సిబ్బంది గాయపడ్డారు. ఒమన్ తీరంలో మంగళవారం ఈ ఘటన జరిగినట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి. హార్ముజ్ జలసంధి వద్ద, ఒమన్ తీరంలో పనామాకు చెందిన ఎంటీ ఆన్ పీస్ అనే వానిజ్య నౌకపై గుర్తు తెలియని వస్తువుతో దాడి జరిగింది. ఈ దాడిలో నౌకలో ఉన్న 12 మంది సిబ్బంది గాయపడ్డారు.
వీరిలో 11 మంది భారతీయులు ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో 19 మంది ఉండగా.. వారిలో 17 మంది భారతీయులు. ఈ ఘటనపై వెంటనే సమాచారం అందుకున్న ఒమన్ అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. నౌక వద్దకు చేరుకుని గాయపడిన వారిని రక్షించారు. బాధితుల్ని ఒమన్లోని ఖసాబ్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడిని భారత్ ఖండించింది. భారతీయుల్ని రక్షించినందుకు ఒమన్ ప్రభుత్వానికి భారత్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతుండటంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
వెంటనే కాల్పుల విరమణ పాటించాలని, ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం నెలకొనాలని భారత్ ఆకాంక్షించింది. వాణిజ్య నౌకలపై దాడి చేసి, సాధారణ ప్రజలు, నిర్మాణాలపై దాడి చేయడం సరికాదని ఇండియా వ్యాఖ్యానించింది. అంతర్జాతీయ జలమార్గాలు స్వేచ్ఛా ప్రయాణం ఉండాలని సూచించింది. ఇక, ఈ దాడికి పాల్పడింది ఎవరు.. దేనితో దాడి జరిగింది అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై విచారణ కొనసాగుతోంది.