ఓటు ప్రజాస్వామ్యంలో ఒక సాధారణ గుర్తు కాదు. అది పౌరుడి రాజకీయ హక్కుకు, సమానత్వానికి, పాలనలో భాగస్వామ్యానికి ప్రతీక. అందుకే ఓటర్ల జాబితా రూపకల్పన నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశపై ప్రజలకు విశ్వాసం ఉండటం ప్రజాస్వామ్యానికి ప్రాథమిక అవసరం. ఆ విశ్వాసం దెబ్బతింటే సమస్య ఒక పార్టీకి, ఒక ఎన్నికకు లేదా ఒక అధికారికి మాత్రమే పరిమితం కాదు. అది మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థ విశ్వసనీయతకు సంబంధించిన ప్రశ్నగా మారుతుంది.
అసలు ప్రజాస్వామ్య ప్రశ్న-‘సర్’ ప్ర క్రియ ఎంత పారదర్శకంగా, న్యాయబద్ధంగా, ప్రజలు స్వయంగా ధ్రువీకరించగలిగే విధంగా కొనసాగుతున్నది అనేదే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ఎన్నికల పర్యవేక్షణ, నియంత్రణ, దిశానిర్దేశం వంటి విస్తృత బాధ్యతలను ఎన్నికల సంఘానికి అప్పగించింది. ఎన్నికల సంఘం కూడా తనను స్వతంత్ర రాజ్యాంగబద్ధ సంస్థగా పేర్కొంటున్నది. ఈ అధికారంతోపాటు ప్రజల విశ్వాసాన్ని కాపాడే బాధ్యత కూడా ఉంటుంది. ఎన్నికల సంఘం ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ వ్యవహరించకూడదు. రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియలో ప్రాథమిక హక్కులు, రాజకీయ స్వేచ్ఛ వంటి అంశాలపై జరిగిన చర్చలు మన ప్రజాస్వామ్య దృక్పథానికి పునాది వేశాయి.
నేటి చర్చ కేవలం ఒక ఎన్నికల కమిషనర్ వ్యక్తిగత వ్యవహారం కాదు. ఇది ఎన్నికల సంస్థాగత స్వతంత్రత, పౌరుడి ఓటు హక్కు, ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసానికి సంబంధించిన ప్రశ్న. ఎస్ఐఆర్పై వచ్చిన ఆరోపణలను అవి రాజకీయ ఆరోపణలేనని వెంటనే కొట్టిపారేయడం సరికాదు.
ప్రజాస్వామ్యానికి సరైన మార్గం-ఆరోపణలను ఆధారాలతో పరీక్షించడం, ఫలితాలను ప్రజల ముందుంచడం. ఏ ప్రాంతంలో ఎంతమంది ఓటర్లు తొలగింపునకు గురయ్యారు? కారణాలేంది? ఎంతమంది కొత్త ఓటర్లుగా చేరారు? సంబంధిత వ్యక్తులకు నోటీసులు, అభ్యంతరాలు, అప్పీల్‌కు తగిన అవకాశాలు కల్పించారా? తుది జాబితాలో ఎన్ని మార్పులు జరిగాయి? ఈ ప్రశ్నలకు స్పష్టమైన గణాంకాలతో సమాధానాలు రావాలి. ఇది ఎన్నికల సంఘాన్ని బలహీనపరుచడం కాదు. ప్రజలకు సమాచారాన్ని అందించడం ద్వారా దాని విశ్వసనీయతను బలోపేతం చేయడం.
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేస్తే సమస్య మొత్తం పరిష్కారమవుతుందని భావించడం కూడా సరైంది కాదు. ఒక వ్యక్తి స్థానంలో మరొకరు రావడం ద్వారా వ్యవస్థాగత లోపాలు తొలగిపోవు. వ్యక్తి మార్పు కంటే వ్యవస్థాగత జవాబుదారీతనం ముఖ్యం. అదే సమయంలో రాజ్యాంగ సంస్థపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు మౌనం సమర్థవంతమైన సమాధానం కాదు. ప్రజలకు వివరణ ఇవ్వడం సంస్థ బలహీనత కాదు; అది ప్రజాస్వామ్య బాధ్యత. ప్రజా నిరసనలను పక్కదారి పట్టించేందుకు ఇతర అంశాలను ముందుకు తేవడం కంటే, ప్రజా ప్రాముఖ్యత కలిగిన ప్రశ్నలకు ప్రత్యక్షంగా సమాధానం ఇవ్వడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య పద్ధతి. అదే సమయంలో ఆధారాలతో ప్రజల ముందుంచాలి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికే కాదు-విమర్శించే ప్రతి వర్గానికీ ఆధారబద్ధత, బాధ్యత అవసరం. ‘సర్’పై వచ్చిన ఆరోపణల ను స్వతంత్రంగా, పారదర్శకంగా, ఆధారాలతో పరిశీలించాలి. అవసరమైతే ఓటర్ల జాబితాలపై నియోజకవర్గాల వారీగా ఆడిట్ నిర్వహించాలి. ఎన్నికల కమిషన్ మౌనం సమాధానం కాదు. తీర్పు కూడా కాదు. ప్రజాస్వామ్యానికి అవసరమైనది వ్యక్తులపై అంధ విశ్వాసం కాదు-వ్యవస్థలపై ప్రజల నమ్మకం. ఆ నమ్మకానికి పునాది పారదర్శకత, స్వతంత్రత, జవాబుదారీతనం.
ఓటరు తన పేరు ఓటర్ల జాబితాలో ఉన్నదని, తన ఓటు తనదేనని, అది సక్రమంగా లెక్కించిందని విశ్వసించినప్పుడే ఎన్నిక ప్రజల తీర్పుగా నిలుస్తుంది. ఆ విశ్వాసాన్ని కాపాడటం ఎన్నికల సంఘం తక్షణ బాధ్యత.
(వ్యాసకర్త: ఓయూ ఇంగ్లిష్ విభాగం ఆచార్యుడు)
-ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్ ,98852 95413